Off The Record: అధికారం పోయాక కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి అన్నా చెల్లెళ్ళ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడ్డట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. తనకు పార్టీలో సరైన ఆదరణ లభించడంలేదని కుంగిపోయిన కవిత ఇటీవల తండ్రికి రాసిన లేఖ సంచలనం సృష్టించింది. అందులోని అంశాలతో పాటు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ఇంకా కలకలంరేపాయి. కేసీఆర్ దగ్గర కోవర్ట్‌లు ఉన్నారని, ఆయన దేవుడేగానీ… చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత లెటర్‌లో రాసిన అంశాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి తెరలేపాయి. అప్పటి నుంచి సొంత అజెండాతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవిత….తాను ప్రారంభించిన జాగృతిని పటిష్టం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
Read Also: CM Chandrababu: పొదిలిలో వైసీపీ రాళ్ల దాడిపై సీఎం సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు..
సింగరేణిలో సొంత దుకాణం, టీచర్స్ యూనియన్స్‌లో కూడా సొంత అజెండా, బీఆర్‌ఎస్‌కు బదులుగా జాగృతిలో చేరికలు, కేసీఆర్‌ని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలువడాన్నినిరసిస్తూ ధర్నా, ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆందోళన లాంటి సొంత కార్యక్రమాలతో దూకుడుగా ఉన్నారామె. అసలామె అమెరికా నుంచి వచ్చి వ్యాఖ్యలు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు తండ్రి కేసీఆర్ మాట్లాడలేదట. కూతురు అలా మాట్లాడాక తనను కలవమని కూడా చెప్పలేదు కేసీఆర్. అటు పిలవకున్నాసరే… అంటూ తానే వెళ్ళి కలవడానికి కవిత ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలో… జరిగిన తాజా ఘటనపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ దృశ్యాన్ని నిశితంగా గమనించిన వాళ్ళకు కూతురి మీద కేసీఆర్ కోపం తగ్గలేదని అర్ధమవుతోందట. బుధవారం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్నారని తెలిసిన కవిత…ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా…. చెప్పాపెట్టకుండా… నేరుగా ఉదయమే ఫామ్ హౌజ్‌కు వెళ్ళారట. చాలా సేపు తండ్రిని కలవడానికి, పలకరించడానికి ప్రయత్నించినా కుదరలేదని చెబుతున్నారు ఆ టైంలో ఫామ్ హౌజ్‌లో ఉన్న కేసీఆర్ సన్నిహితులు.
Read Also: Extramarital Affair: ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో అన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!
కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ బయటకు వస్తున్న క్రమంలో ఆయనకు ఎదురుపడేందుకు ప్రయత్నించారామె. అయినాసరే… ఆమె ఉన్నవైపు తిరక్కుండానే… డైరెక్ట్‌గా వెళ్ళిపోవడం స్పష్టంగా కనిపించింది. మొత్తంగా… అలా ఫామ్‌హౌజ్‌కు వెళ్లిన కవిత తండ్రిని కలవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని తెలిసింది. కేసీఆర్ రెస్ట్ తీసుకునే మొదటి అంతస్తు వరకు వెళ్లినా… కూతుర్ని పలకరించలేదట ఆయన. మాజీ ఎంపీ సంతోష్‌తో కలిసి పై నుంచి లిప్ట్‌లో వచ్చిన కేసీఆర్… మొట్లు దిగివచ్చిన కూతురు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సో… దీన్నిబట్టి చూస్తుంటే… కవిత చాలా డ్యామేజ్ చేసిందన్న భావన కేసీఆర్‌లో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. బీఆర్‌ఎస్‌ను బిజెపిలో కలిపేందుకు కుట్ర జరుగుతోందని కన్న కూతురే… నేరుగా తండ్రిపైకి ప్రశ్నలు ఎక్కుపెట్టడడం, కంటికి రెప్పలా చూసుకున్న పార్టీని సొంత రక్తమే విమర్శించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. అందుకే కేసీఆర్ చాలా గుంభనంగా ఉన్నారన్నది ఓ వెర్షన్. ఈ పరిస్థితుల్లో…. తండ్రి కూతురు మధ్య గ్యాప్ ఎన్నాళ్ళు ఉంటుంది? దీని పర్యవసానాలు ఎక్కడిదాకా వెళ్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.