Off The Record: తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా అడపా దడపా కొన్ని చోట్ల స్థానిక కమిటీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ… ఇంకొక్క విషయంలో మాత్రం పీటముడి గట్టిగానే బిగుసుకుపోయినట్టు కనిపిస్తోంది. పార్టీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉంటే… 36 చోట్లే అధ్యక్ష ఎన్నిక పూర్తయింది. ఆయా జిల్లాల్లో కమిటీలు కూడా దాదాపుగా పడ్డాయి. ఇక అనుబంధ కమిటీలు, అధికార ప్రతినిధుల నియామకం కూడా త్వరలోనే పూర్తవబోతోంది. కానీ… రెండు జిల్లాల విషయంలో పడ్డ పీటముడి మాత్రం ఎంతకీ విడిపోవడం లేదట. ఎలా తెగ్గొడదామని చూస్తున్నా… అక్కడ పంచాయితీలు మాత్రం తెగడం లేదంటున్నారు. అలా పెండింగ్‌లో పడ్డ రెండు జిల్లాల్లో ఒకటి కరీంనగర్ అయితే మరొకటి మేడ్చల్ మల్కాజ్ గిరి. ఈ రెండు చోట్ల పార్టీకి చెందిన ఉద్దండుల్లాంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినాసరే… అధ్యక్షుల నియామక వ్యవహారాన్ని మాత్రం తేల్చలేకపోతున్నారన్న మాట బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ ఎంపీలుగా ఉన్నారు. అలాంటి రెండు చోట్లే జిల్లా అధ్యక్షులను నియమించలేకపోవడం పోవడం ఏంటన్నది కమలం నాయకుల క్వశ్చన్.
Read Also: Off The Record: లిక్కర్ కేసులో చెవిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నాయా..?
పార్టీ వ్యవహారాల పరంగా ముందుండాల్సిన ఆ జిల్లాల్లో నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటం ఏంటన్న విమర్శలు పెరుగుతున్నాయి. కరీంనగర్ కు జిల్లా అధ్యక్షుడిగా గతంలో ఉన్న వ్యక్తే కొనసాగుతున్నా.. మేడ్చల్ మల్కాజ్ గిరికి మాత్రం అసలు అధ్యక్షుడే లేడు. పార్లమెంట్ ఎన్నికలకి ముందు రాజీనామా చేశారు అక్కడి నాయకుడు. తర్వాత ఓ సీనియర్ నేతకు సమన్వయ బాధ్యతలు అప్పగించినా..ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ తర్వాతి పరిణామాలు ఏవీ జరగలేదు. ఇక్కడ ఎంపీ ఈటల ఒకరి పేరు చెబితే… స్థానిక నేతలు ఇంకో పేరు చెబుతున్నారట. ఎంపీ చెప్పిన పేరును ఒప్పుకునే ప్రసక్తే లేదని స్థానిక నేతలు అంటున్నట్టు సమాచారం. అలాగే కరీంనగర్‌లో ఎంపీ చెబుతున్న దానికి, రాష్ర్ట పార్టీ పెద్దలు అనుకుంటున్న దానికి మధ్య చాలా తేడా ఉందట. అలా… ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా మేటర్ మాత్రం కొలిక్కి రావడం లేదని చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు ఎన్నికైన జిల్లా అధ్యక్షుల్లో కొందరు పని తీరుపై ఇప్పటికే అసంతృప్తి మొదలైనట్టు తెలుస్తోంది. స్థానిక నేతలను కలుపుకొని పోవడంలో విఫలం అవుతున్నారట నయా ప్రెసిడెంట్స్. వాళ్ళు ఎంపీలతో కూడా కలివిడిగా ఉండటంలేదంటున్నారు. అందుకే… ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక జిల్లా అధ్యక్షుడితో పాటు మరో రెండు చోట్ల రాజీనామాలు చేయించి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా మొత్తంగా…. తెలంగాణ బీజేపీ సంస్థాగత వ్యవహారం పెద్ద ప్రసహసనంగా మారిపోయిందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
