Off The Record: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది వ్యవధిలోనే… తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురు ఐఎఎస్ అధికారులు బదిలీ అవడంపై హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు. కనీసం పూర్తి పదవీకాలమన్నా ఉంచకుండా… వాళ్ళని ఎందుకు బదిలీ చేశారంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. తాజాగా కలెక్టర్ ట్రాన్స్ఫర్తో ఈ చర్చలు మరింత పెరిగాయి. పోనీ… వాళ్ళమీదేమన్నా తీవ్ర స్థాయి అవినీతి ఆరోపణలు, అసమర్ధ ముద్రలు ఉన్నాయా అంటే.. అదీ లేదు. దీంతో జిల్లాలో అసలేం జరుగుతోందన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. కూటమి పార్టీల నేతలు చెప్పినట్టు వినకపోవడమే అసలు కారణం అయి ఉండవచ్చన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, తాజాగా కలెక్టర్ పి. ప్రశాంతి వరుసగా బదిలీ అవ్వడంపై జిల్లాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రజల్లో మంచి పేరు ఉన్న అధికారులనను అంత తక్కువ టైంలో బదిలీ చేయడం వెనక రాజకీయ ఒత్తిళ్ళు ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇసుక, భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, రూల్స్‌కు విరుద్ధంగా అపార్ట్ మెంట్స్ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకున్న కలెక్టర్ ప్రశాంతిపై మధ్యంతర బదిలీ వేటు పడిందంటే… అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమేనని చెప్పుకుంటున్నారు జిల్లాలో. ఇది సాధారణ బదిలీ కాదని, ట్రాన్స్ఫర్ పేరుతో కలెక్టర్ మీద వేటేశారన్న వాదన బలంగా ఉంది.
Read Also: Anil Sunkara : ’ఆగడు’ అలా చేసి ఉంటే హిట్ అయ్యేది
కలెక్టర్‌ని బదిలీ చేస్తారన్న ప్రచారం మూడు నెలల నుంచే ఉంది జిల్లాలో. కొద్ది రోజులుగా ఇక్కడ పాలక పార్టీల ముఖ్యులకు, కలెక్టర్‌కు మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందట. ఇసుక దోపిడీ, అక్రమ రిజిస్ట్రేషన్లు, భూ దందాల్లాంటి విషయాల్లో ఆమె కచ్చితంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నాయకుల అనుచర గణానికి సంబంధించిన ఇసుక లారీల మీద వరుసగా ఓవర్ లోడ్ కేసులు బుక్ అవుతున్నాయి. అలాగే అక్రమంగా డ్రెడ్జింగ్ చేస్తున్న బోట్లు సీజ్ చేయించారు కలెక్టర్. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల క్వాలిటీ విషయంలో కూడా కలెక్టర్ ప్రశాంతి కఠినంగా ఉంటున్నారట. ఇప్పుడు ఇవన్నీ కలగలిసి ఆమె బదిలీకి దారి తీశాయన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆక్రమణల తొలగింపు, డ్రైనేజీ నిర్మాణం, పారిశుధ్యం విషయంలో చర్యలు తీసుకున్న కమిషనర్ కేతన్ గార్గ్ బదిలీ కూడా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఆయన ఏడాది క్రితమే బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ అంత త్వరగా ట్రాన్స్ఫర్ అవుతారని కనీసం సాటి అధికారులు కూడా ఊహించలేకపోయారట. పోనీ ఈయనపై ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా..? లేక పనితీరులో అలసత్వం వహించారా.. అంటే మచ్చుకైనా అలాంటివి లేవన్నది రాజమండ్రి టాక్. పనిచేసిన కొన్ని నెలల్లోనే సిటీలో మార్పులు తీసుకువచ్చారన్న అభిప్రాయం ఉంది స్థానికంగా. మాస్టర్ ప్లాన్‌తో ఎప్పటినుంచో పేరుకుపోయిన ఆక్రమణల తొలగింపును మొదలుపెట్టారు.
Read Also: Crime News: లవర్ మోజులో పడి.. కన్న కూతురునే కడతేర్చిన కసాయితల్లి!
మరోపక్క డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించారు. పనిచేయని పారిశుద్ధ్య కార్మికులను పరుగులు పెట్టించారు. అంతేకాకుండా వివిధ రూపాల్లో నగర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే పనిలో ఉన్న అధికారిని బదిలీ చేయడం ఆశ్చర్యంగానే ఉందంటున్నారు రాజమండ్రి వాసులు. ఇక ఐదారు నెలల క్రితం జాయింట్ కలెక్టర్‌గా చిన్న రాముడు బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కూడా తక్కువ సమయంలోనే
మంచి అధికారి అన్న పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈయన్ని కూడా హఠాత్తుగా బదిలీ చేయడం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ. ఇక్కడ ఐఏఎస్ అధికారులు పూర్తి పదవీకాలం కొనసాగలేకపోతున్నారా? లేక నేతల ఒత్తిడితోనే వరుస బదిలీల వేట్లు పడుతున్నాయా అని. మొత్తంగా స్వార్ధ రాజకీయాలకు మంచి అధికారులు బలి అవుతున్నారని, జిల్లా అభివృద్ధి కూడా కుంటుపడుతోందన్న అభిప్రాయం బలంగా ఉంది తూర్పు గోదావరి జిల్లాలో.