Off The Record: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్… తన పదవికి రాజీనామా చేస్తారా..? అలా చేయాలనుకోవడం వెనక ఆయన స్కెచ్ ఏంటన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన దానం.. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే… రాజీనామా చేయడమే బెటర్ అనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. తాజాగా… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తెర మీదకు రావడంతో.. నాగేందర్ మనసు అటువైపు మళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. అక్కడ పోటీ చేసేందుకు స్కెచ్ వేశారని అందులో భాగంగానే…. ప్రస్తుత శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన దానం… ప్రస్తుతం అనర్హత సమస్య ఎదుర్కొంటున్నారు. ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటుకు నిర్ణయమంటూ తీసుకుంటేగనుక… అది ముందు దానం మీదనే పడుతుందనేది రాజకీయవర్గాల విస్తృతాభిప్రాయం. పార్టీ మారిన మిగతా వాళ్ళకు ఈయనకు ఓ పెద్ద తేడా ఉంది. ఓవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూనే…మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ సీటు నుంచి కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేశారాయన. బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా… కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు కాబట్టి… ఆయన మీద వేటు పడటానికి అన్ని రకాలుగా అవకాశం ఉందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. అదే సమయంలో మాజీ మంత్రి ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు చూడ్డం వెనక కూడా భారీ స్కేచ్చే ఉందని విశ్లేషిస్తున్నారు కొందరు.
Read Also: Chandu Naik Murder: సీపీఐ నాయకుడు చందూ నాయక్ వెలుగులోకి సంచలన విషయాలు..!
ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేస్తే… ఆ గొడవ పోతుంది. ఇదే సమయంలో ఇటు జూబ్లీహిల్స్‌లో ఈసారి డైరెక్ట్‌గా కాంగ్రెస్ బీ ఫామ్ మీద పోటీ చేసి గెలిస్తే… ఏకంగా మంత్రి అయిపోవచ్చని కలలుగంటున్నారట దానం. ప్రస్తుతం హైదరాబాద్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి… తానే లక్కీ ఛాన్స్ కొట్టవచ్చన్నది నాగేందర్ వ్యూహంగా తెలుస్తోంది. ఐతే… ఇప్పటికే పార్టీలోకి తిరిగి వచ్చిన వెంటనే లోక్‌సభ టికెట్, ఇప్పుడు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు పోటీకి అవకాశం… గెలిస్తే మంత్రిగా అవకాశం… ఇలా అన్ని అవకాశాలు ఒక నాయకుడికే ఇస్తారా అన్న చర్చ నడుస్తోంది పార్టీ సర్కిల్స్‌లో. దీనికి తోడు.. ఆ మధ్య సొంత ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారాయన. హైడ్రా, స్మితా సబర్వాల్, జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై బాహాటంగా మాట్లాడుతూ వచ్చారు. అటు కేటీఆర్‌కి ఫార్ములా ఈ రేస్ వ్యవహారాపై నోటీసు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ అనుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు దానం. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వ పెద్దలు… దానంని అంతగా దగ్గరికి రానివ్వడం లేదట. అప్పట్లో ఎదురుపడ్డా ప్రభుత్వ పెద్ద పట్టించుకోలేదన్న వార్తలు గుప్పుమన్నాయి.
Read Also: Nimisha Priya: నిమిష ప్రియను కె.ఎ.పాల్ కాపాడారా..? నిజమేంటి..?
ఐతే.. ప్రస్తుతం గాంధీభవన్ కి రావడం..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి వాటిలో దానం కొంత చొరవ తీసుకుంటున్నారు. ఇన్నాళ్ళు విమర్శించి… ఇప్పుడు పార్టీ మీద ఇన్‌స్టంట్ ప్రేమలు ఒలకబోయడం వెనక జూబ్లీహిల్స్ సీటు ఎత్తుగడ ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు. అంటే.. అన్నారుగానీ… ఆ ఊహే అద్భుతంగా ఉందన్న సినిమా డైలాగ్‌ని దానం గుర్తు చేసుకుంటూ… హడావిడి చేస్తున్నా…. ఇప్పుడు ఆయనతో ఖైరతాబాద్‌లో రాజీనామా చేయించి… జూబ్లీహిల్స్ బరిలో దింపే సాహసాన్ని పార్టీ చేస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆయన జూబ్లీహిల్స్ వెళితే… మరి ఖైరతాబాద్ సంగతేంటన్నది బిగ్ క్వశ్చన్. అధికార పార్టీ అక్కడ కోరి ఉప ఎన్నికను తెచ్చుకుంటుందా..? అన్న చర్చ కూడామరోవైపు నడుస్తోంది. దానం ఆలోచన ఎలా ఉన్నా….అందుకు పార్టీ ఎంతవరకు సుముఖంగా ఉందన్నది మెయిన్ పాయింట్.