Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ వైపు భారత ప్రభుత్వం, మరోవైపు కుటుంబసభ్యులు నిమిషప్రియను కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. మరోవైపు కేరళకు చెందిన ఓ ముస్లిం మతపెద్ద జోక్యంతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడిందని సమాచారం. అయితే తానే నిమిష ప్రియను కాపాడానని కె.ఎ.పాల్ ప్రకటించుకున్నారు. మరి నిమిష ప్రియను కాపాడిందెవరు..? చివరి నిమిషంలో ఏం జరిగింది..?
యెమెన్ లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నిమిష ప్రియను కాపాడేందుకు అందరూ తమవంతు ప్రయత్నం చేశారు. ఒకవేళ వాళ్ల ప్రయత్నాలు విఫలమై ఉంటే నిమిష ప్రియకు ఈరోజు ఉరిశిక్ష అమలయ్యేది. కానీ ఆ ముప్పు తప్పింది. నిమిష ప్రియ ఉరిశిక్షను యెమెన్ అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీనికి ప్రధాన కారణం భారత ప్రభుత్వం, నిమిషా కుటుంబం, కొందరు కీలక వ్యక్తులు చేసిన అవిశ్రాంత ప్రయత్నాలేనని చెప్పొచ్చు. భారత ప్రభుత్వం యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. అదే సమయంలో నిమిషప్రియ కుటుంబం బాధిత తలాల్ అబ్దు మహదీ కుటుంబంతో “బ్లడ్ మనీ” ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. ఇందుకోసం సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సహాయం చేస్తోంది. ఈ చర్చలకు మరింత సమయం కావాలని భారత ప్రభుత్వం యెమెన్ అధికారులను కోరడంతో, ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు కేరళకు చెందిన మతపెద్ద కూడా జోక్యం చేసుకుని నిమిష ప్రియను కాపాడారు. అయితే, ఈ వాయిదా తాత్కాలికమే. మహదీ కుటుంబం బ్లడ్ మనీని అంగీకరిస్తేనే నిమిషా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
అసలు నిమిష ప్రియ ఎవరు..? ఆమె ఎందుకు యెమెన్ లో ఉరిశిక్ష ఎదుర్కొంటోంది.. అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలు. అయితే తన వ్యాపార భాగస్వామిని హత్య చేయడం వల్లే ఆమె జీవితం తలకిందులైంది. నిమిష ప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నర్సు. 2008లో మంచి జీతం కోసం యెమెన్‌కు వెళ్లారు. అక్కడ ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత, తన సొంత క్లినిక్‌ను స్థాపించేందుకు యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తితో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కానీ, ఈ భాగస్వామ్యం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. నిమిషప్రియ చెప్పిన దాని ప్రకారం, తలాల్ ఆమెను శారీరకంగా, ఆర్థికంగా వేధించాడు. ఆమె పాస్‌పోర్ట్ ను కూడా దొంగిలించాడు. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు, నిమిషప్రియ 2017లో తలాల్‌కు సెడేటివ్స్ ఇంజెక్ట్ చేసింది. కానీ, అది వికటించడంతో మహదీ మరణించాడు. దీంతో నిమిష ప్రియ అరెస్ట్ అయ్యారు. 2020లో యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ఈ తీర్పును ధృవీకరించింది. 2024 చివర్లో యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలీమీ ఈ శిక్షను ఆమోదించారు. 2025 జులై 16 నాటికి నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో ఊరట లభించింది.
నిమిష ప్రియకు చివరి నిమిషంలో ఊరట లభించడానికి తెరవెనుక ఎంతోమంది కృషి చేశారు. దాదాపు ఏడాదికాలంగా వీళ్లంతా నిమిషప్రియ కోసం నిరంతరం చర్చలు జరుపుతున్నారు. నిమిష ప్రియను ఎలాగైనా సురక్షితంగా దేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. యెమెన్‌తో మన దేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, భారత విదేశాంగ శాఖ యెమెన్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో, భారత ప్రభుత్వం “ఇది చాలా సంక్లిష్టమైన సమస్య” అని చెప్పినప్పటికీ, చివరి నిమిషంలో ఉరిశిక్షను వాయిదా వేయడంలో విజయం సాధించింది. మరోవైపు నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి 2024 నుంచి యెమెన్‌లోనే ఉంటూ, తలాల్ కుటుంబంతో బ్లడ్ మనీ చర్చలు జరుపుతోంది.
Read Also:AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు.. కీలక అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
ఆమె ధైర్యం, అంకితభావం ఈ కేసుకు పెద్ద బలం. ఇక నిమిష ప్రియ కోసం సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ బృందంలో యాక్టివిస్టులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్లంతా నిమిష ప్రియను రక్షించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. చివరగా కేరళకు చెందిన ప్రముఖ సున్నీ మత గురువు కంథపురం ఏపీ అబూబకర్ ముస్లియార్.. నిమిష ప్రియ కోసం తనవంతు ప్రయత్నాలు చేశారు. యెమెన్‌లో ప్రభావవంతమైన సూఫీ గురువు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు తలాల్ కుటుంబంతో బ్లడ్ మనీ ఒప్పందానికి దారితీశాయి.
చివరి నిమిషంలో నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిపోవడానికి ప్రధాన కారణం ముస్లిం మత పెద్ద జోక్యమే అని చెప్పొచ్చు. కీలక సమయంలో ముస్లియార్ చొరవ ఆమెను కాపాడింది. కంథపురం ఏపీ అబూబకర్ ముస్లియార్.. ఈయన్ను భారతదేశ “గ్రాండ్ ముఫ్తీ”గా పిలుస్తుంటారు. ఈయన ప్రముఖ సున్నీ నాయకుడు. నిమిష ప్రియ కుటుంబసభ్యులు ఆయన్ను సంప్రదించి జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో ఆయన యెమెన్ లోని తన సంబంధాలను ఉపయోగించి, సూఫీ గురువు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్‌తో మాట్లాడారు. ఈయన మహదీ కుటుంబంతో, అలాగే యెమెన్ షరియా కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరిపారు. మహదీ సొంతూరు ధమర్ లో ఈ చర్చలు మంగళవారం జరిగాయి. ఇందులో బ్లడ్ మనీ ఒప్పందం గురించి చర్చించారు. దీనిపై తుది ఒప్పందానికి రావాల్సి ఉంది. కంథపురం జోక్యం వల్లే ఈ చర్చలు ముందుకు సాగాయని, ఉరిశిక్ష వాయిదా పడడానికి ఇది ఒక పెద్ద కారణమని చెప్పవచ్చు.
అయితే నిమిష ప్రియకు ఉరిశిక్ష వాయిదా పడడానికి తానే కారణమని కె.ఎ.పాల్ ప్రకటించారు. తను చొరవ తీసుకుని యెమెన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినట్లు తెలిపారు. భారత ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడడం తన ఘనతే అని ప్రకటించుకున్నారు కె.ఎ.పాల్. అయితే, ఈ విషయంలో ఆయన ఏ రకమైన చర్చలు జరిపారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. భారత ప్రభుత్వం, కంథపురం, సేవ్ నిమిషా కౌన్సిల్, నిమిషా తల్లి ప్రేమకుమారి ప్రయత్నాలు ఈ వాయిదాకు దారితీశాయని అనేక వార్తా సంస్థలు నివేదించాయి. కె.ఎ.పాల్ యెమెన్ అధికారులతో కానీ.. లేదంటే మహదీ కుటుంబంతోకానీ సంప్రదింపులు జరిపినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఎక్స్ లో ఆయన కొంతమందితో కూర్చొని ఉన్న వీడియోలను పోస్ట్ చేశారు. వాళ్లెవరో, వాళ్లతో ఎక్కడ సమావేశమయ్యారో, వాళ్లు నిమిష ప్రియకోసం ఏం చేశారో సమాచారం లేదు. నిమిష ప్రియ కుటుంబసభ్యులు కూడా పాల్ జోక్యం చేసుకున్నట్టు చెప్పలేదు. కాబట్టి, కె.ఎ.పాల్ వాదనలను నమ్మే పరిస్థితి లేదు.
నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే ఆమె క్షేమంగా బయటకు రావాలంటే ఇంకా పెద్ద తతంగమే ఉంది. నిమిష ప్రియకు తాత్కాలికంగా ఊరట లభించింది. అయితే బాధిత మహదీ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తేనే ఆమె పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. యెమెన్‌లో అమలవుతున్న షరియా చట్టం ప్రకారం, “బ్లడ్ మనీ” తీసుకుని క్షమించే సంప్రదాయం ఉంది. ఈ మేరకు ఒప్పందం కుదిరితే నిమిష ప్రియ శిక్షను రద్దు చేయవచ్చు లేదా తగ్గించవచ్చు. నిమిష ప్రియ కుటుంబం మహదీ కుటుంబానికి సుమారు 8.6 కోట్ల రూపాయలు బ్లడ్ మనీగా ఆఫర్ చేసింది. అయితే, దాదాపు 13 కోట్ల వరకూ మహదీ కుటుంబం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసమే తమకు కాస్త సమయం కావాలని నిమిష ప్రియ కుటుంబం అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇందుకు అంగీకరించిన యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్షను వాయిదా వేసింది.
నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడడం కోట్లాదిమందికి సంతోషం కలిగించింది. ఇప్పుడు బ్లడ్ మనీ ఒప్పందం కుదుర్చుకోవడంపైనే అందరి చూపూ ఉంది. వీలైనంత త్వరగా ఈ ఒప్పందం కుదుర్చుకుని నిమిష ప్రియను ఇంటికి తీసుకురావాలని ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం.