Off The Record: జీహెచ్‌ఎంసీ పరిధిలోని తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫోకస్ మారుతోందా? అంటే…వాతావరణం అలాగే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. పాలిటిక్స్ ఒక ఎత్తయితే… పోలీస్ బాసులు, వాళ్ళ పనుల మీదికి దృష్టి మళ్ళుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. మొన్న ఎమ్మెల్యే,ఇప్పుడు పార్టీ సీనియర్ లీడర్. వరుసగా చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ స్టేట్‌మెంట్స్‌ని విశ్లేషిస్తుంటే…కొందరు పోలీసులు అసలు పని మానేసి కొసరు విషయాలపై దృష్టి పెట్టారని కాంగ్రెస్ ముఖ్యులు చెప్పాలనుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో స్వయంగా అధికార పార్టీ నేతలే అంతలా ఆరోపణలు చేస్తున్నారంటే… నిజంగానే సమస్య అంత తీవ్రంగా ఉందా..? అన్న చర్చ కూడా మొదలైంది. హైదరాబాద్‌లో…కొందరు పోలీసు అధికారుల మీద కత్తులు నూరుతున్నారు కాంగ్రెస్ నేతలు . సమయం సందర్భం వచ్చినప్పుడల్లా… సమస్యను బయటకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో మొదటి వరుసలో ఉన్నారు దానం నాగేందర్. తన పరిధిలో ఉన్న ఓ డీసీపీ స్థాయి అధికారి… ఇష్టారాజ్యంగా వ్యవహారం నడిపిస్తున్నారంటూ మీడియా ముందే తూర్పార పట్టారు. అది అధికార పార్టీకి కంట్లో నలుసులా మారింది.
ఇక కొన్ని రోజులుగా దానం కాస్త సైలెంట్‌గా ఉన్నారు. సమస్య తీరిందని అనుకునేలోపే… మరో నేత నోరు విప్పారు. ఈసారి ఆరోపణలు తీవ్ర స్థాయిలోనే వచ్చాయి. ఎల్బీ నగర్ డీసీపీ మీద చాలా సీరియస్ కామెంట్స్ చేశారట కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ. గాంధీభవన్ చిట్‌చాట్‌లో డీసీపీ వ్యవహారశైలిని తీవ్ర స్థాయిలో తప్పు పట్టినట్టు సమాచారం. ఆ డీసీపీకి ఉద్యోగం పార్ట్‌టైం అయిందని, ల్యాండ్ సెటిల్ మెంట్లు ఫుల్‌టైమ్ డ్యూటీలా మారిపోయాయంటూ… డైరెక్ట్ కామెంట్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. శాంతిభద్రత పరిరక్షణకంటే… భూ వివాదాల మీదనే డీసీపీ గట్టిగా ఫోకస్ పెడుతున్నారంటూ మధుయాష్కీ ఫైరైపోయినట్టు తెలిసింది. దీనికి కొనసాగింపుగా… పోలీస్ కమిషనర్ ప్రస్తావన కూడా చేశారట. ల్యాండ్ కబ్జాకి సంబంధించిన ఫిర్యాదును ఓ అడ్వకేట్ తీసుకు వెళ్తే… డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పారని, అసలు సివిల్ ఇష్యూలతో పోలీసులకు ఏం పని అంటూ.. మౌలికమైన ప్రశ్నను లేవనెత్తారట మధు యాష్కీ.
ఐతే.. ఐఎస్ఏస్..ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ మధు యాష్కీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అధికార పార్టీ నేతలే ఇలా ఆరోపణలు చేస్తున్నారంటే ఆఫీసర్స్ వ్యవహారం సరిగా లేదా..? వాళ్ళ ప్రవర్తన అంత తేడాగా ఉందా అనే డిస్కషన్ మొదలైంది. పోలీస్ అధికారులు సైతం ఇప్పుడీ సబ్జెక్ట్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఐతే..యాష్కీ ఆరోపణలు చేసిన డీసీపీ పరిధిలో… అంతర్గత సమస్యలతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఏసీపీ స్థాయి అధికారులు ఇలా ప్రచారం చేస్తున్నారా..? అన్న డౌట్స్ ఉన్నాయట కొందరికి. లేదంటే అసలు ఎప్పుడూ పోలీసు అధికారుల మీద మాట్లాడని మధుయాష్కీ… ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందన్నది వాళ్ళ క్వశ్చన్. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల కబ్జా జరిగితే.. ఆ వ్యవహారాల్ని చక్కబెట్టే పని హైడ్రా కి అప్పగించింది ప్రభుత్వం. కానీ సివిల్ ఇష్యూ లలో పోలీసుల జోక్యం ఏంటన్న చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న నేతలే ఇలా కామెంట్స్ చేసే వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పినా పోలీస్ అధికారులు సరిదిద్దుకోకపోవడంతోనే… నేతలు ఇలా మీడియా ముందు కు వస్తున్నారా అన్నది చర్చ సైతం మొదలైంది. ఈ కామెంట్స్, వాటి పర్యవసానాలు ఎట్నుంచి ఎటు దారి తీస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.