Off The Record: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో కూర్చుంది. రాష్ట్రానికి ఇంత చేసినా… ఓడిపోయామంటే… సరిగా ప్రచారం చేసుకోలేకపోవడమే కారణం అని భావించారట పార్టీ పెద్దలు. అదే సమయంలో సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం కూడా గట్టి దెబ్బే కొట్టిందన్న అభిప్రాయం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకు కౌంటర్‌గా తమ సోషల్ మీడియా వింగ్‌ని బలోపేతం చేయాలనుకున్న గులాబీ పెద్దలు ఆ దిశగా అడుగులేస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే తమ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌తోపాటు ప్రైవేట్ సోషల్ మీడియాను కూడా ఎంకరేజ్ చేశారట. పార్టీ ముఖ్య నాయకుల పర్యవేక్షణలో చాలా సంస్థలు బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నాయన్నది లేటెస్ట్ టాక్. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మితిమీరిన అభిమానంతోనో, అవతలోళ్ళ మీద వ్యతిరేకతతోనే పెడుతున్న పోస్ట్‌లు వివాదాస్పదం అవుతున్నాయి. అవి పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాల పోరాటంలో సోషల్ మీడియా కీలకమే అయినా… కొన్నిసార్లు ఫేక్ న్యూస్ కూడా విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. దీనివల్ల బాగా ఇరుకున పడుతున్నామన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లో వ్యక్తం అవుతోందట. అలాగే ఒక్కోసారి ఒరిజినల్ న్యూస్ కూడా అన్వయ దోషాలు, ప్రజెంటేషన్ లోపాల వల్ల కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందన్న అభిప్రాయం బీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో.. రాష్ట్రంలో ఇంత వరదలు వచ్చినా రెండు రోజుల పాటు బయటకు రాకుండా ఇంట్లో సినిమాలు చూస్తూ కూర్చున్నారంటూ ప్రచారం చేశాయి బీఆర్‌ఎస్ వర్గాలు. దీనికి రెస్పాన్స్ కంటే నెగెటివ్ రియాక్షన్సే ఎక్కువగా వచ్చాయట.గత పదేళ్ళలో నాటి సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు బయటకు వచ్చారంటూ రివర్స్ అటాక్ మొదలయ్యేసరికి బీఆర్‌ఎస్ వర్గాలు ఉక్కిరి బిక్కిరి అయినట్టు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించే సమయంలో ముందూ వెనుక చూసుకోకుండా వ్యవహరించడం వల్ల తమకే నెగెటివ్ అయిందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది.
ఇంకోవైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై విమర్శల విషయంలో తొందరపాటు పనికిరాదన్న కామెంట్స్ పార్టీలోనుంచే వినిపిస్తున్నాయట. కొంచెం సమయం ఇవ్వాలి కదా అన్న అభిప్రాయం జనంలో కూడా పెరిగితే తమకే ఇబ్బంది అవుతుందని బీఆర్‌ఎస్ ముఖ్యులు అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభుత్వం పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు కూడా పెడుతున్నారు పోలీసులు. వారికి బెయిల్ ఇప్పించడంతోపాటు ఇతర విషయాల్లో అండగా ఉంటోంది బీఆర్‌ఎస్ అధిష్టానం. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియాలో సపోర్ట్ బాగానే ఉందన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. పార్టీ ముఖ్యులతో పాటు కేడర్ కూడా ఆ విషయంలో యాక్టివ్‌గానే ఉంది. కానీ… బయటి వ్యక్తుల్ని బాగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళెవరో అత్యుత్సాహంతో పెట్టే పోస్ట్‌లతో చివరికి పార్టీనే సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. ఇంకొందరు కావాలనే బీఆర్‌ఎస్ తరపున వివాదాస్పద పోస్ట్‌లు పెడుతున్నారన్న అనుమానాలు సైతం ఉన్నాయట. పెట్టేది ఎవరైనా… చివరికి అన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సింది పార్టీనే కాబట్టి ఇబ్బందికరంగా మారుతోందంటున్నారు. అందుకే బలం అనుకున్న సోషల్ మీడియానే బలహీనత కావద్దన్న అభిప్రాయం పెరుగుతోందట గులాబీ వర్గాల్లో.