దేశ రాజధాని ఢిల్లీలో BRS ఆఫీసు ప్రారంభించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్. అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదంతో పాగా వేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ స్పేస్ ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ నజర్ ఉంది. ఆ విధంగా తెలుగు రాష్ట్రమైన ఏపీపైనా ఆరా తీస్తున్నారట. ఇప్పటికే BRS విస్తరణ దిశగా చర్యలూ మొదలైనట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. తర్వాత ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణకు తగింత సమయం కూడా చిక్కుతుందనే ఆలోచన గులాబీ శిబిరంలో ఉంది. గతంలో సీఎం కేసీఆర్ వైజాగ్ వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజల్లో అనూహ్య స్పందన కనిపించిందని.. అందుకే ఏపీలో సానుకూల వాతావరణమే ఉంటుందని అనుకుంటున్నారట.
ఏపీలోని వైసీపీ సర్కార్‌తో సన్నిహిత సంబంధాలే ఉన్నప్పటికీ.. అక్కడ బీజేపీ వ్యతిరేక వాతావరణం కూడా ఉందని అంచనా వేస్తున్నారట గులాబీ నేతలు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలిచినా.. ఎంపీలుగా ఎవరు ఉన్నప్పటికీ.. వాళ్లు బీజేపీవారేనని మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో కామెంట్ చేశారు. బీజేపీపై పోరాటం చేస్తున్న BRSకు ఏపీలో తప్పకుండా ఆదరణ లభిస్తుందని అభిప్రాయ పడుతున్నారు. గతంలో ఉండవల్లితో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. అలాంటి మరికొందరు కీలక నేతలను ఆకర్షిస్తే.. వర్కవుట్ అవుతుందనే వాదన ఉందట. పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితర నేతలను BRSలోకి ఆహ్వానించే పనిలో ఉన్నారట. ఏపీలోని వివిధ పార్టీల నాయకులతో సత్ససంబంధాలు కలిగిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇప్పటికే కొందరితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఏపీలో సంక్రాంతి కోడి పందాలకు భీమవరం తదితర ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంటారు తలసాని. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలను బీఆర్‌ఎస్ విస్తరణకు ఉపయోగించుకోవచ్చునని తెలుస్తోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్సీలుగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఏపీ మూలాలు ఉన్నవారిని పార్టీ విస్తరణకు తెరపైకి తీసుకొస్తారనే ప్రచారం ఉంది. సీఎం కేసీఆర్ ఏపీలోని పాత పరిచయాలను కదిలిస్తే.. మిగతా పని ఇలాంటి నాయకులంతా పూర్తి చేస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపించే నేతలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారట. సామాజికవర్గాల లెక్కలను కూడా దగ్గర పెట్టుకుని.. బీసీలు.. ఎస్సీలు.. ఎస్టీలు.. ఓసీల్లో ఎవరు కీలక నేతలు.. వారిని చేర్చుకుంటే కలిగే రాజకీయ లాభం తదితర అంశాలను బేరీజు వేసుకుంటున్నారట. ఈ లెక్కలు బీఆర్‌ఎస్‌కు కలిసొస్తాయో లేదో చూడాలి.
