ఆత్రం సక్కు. ఆసిఫాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటి నుంచి అధికారపార్టీలో ఆయన పనేదో ఆయనదే. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన కోవా లక్ష్మితో కొద్దిరోజులు వార్ నడిచింది. పాత కొత్త కేడర్ మింగిల్ కాలేదు. ఈ సమస్యను అధిగమించకపోగా.. ఎమ్మెల్యే అందుబాటులో ఉండబోరనే ప్రచారం సాగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసిఫాబాద్ గులాబీ శిబిరంలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేకు అల్టిమేటాలు ఇస్తున్నారట. వాటి గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఎక్కువ సమయం హైదరాబాద్‌లో ఉంటూ.. నియోజకవర్గానికి వస్తే కొన్ని మండలాల్లోనే పర్యటించి వెళ్లిపోతారని MLAపై సర్పంచ్‌లు ఇతర ప్రజాప్రతినిధుల ఆరోపణ. దాంతో అభివృద్ధి పనులకు ఆయన అందుబాటులో ఉండబోరనే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో వాంకిడి మండలంలోని సర్పంచ్‌లు అయితే మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యేకు సవాల్ విసురుతున్నారు. తమకు నిధులు.. పనులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ.. తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. గతంలో కూడా ఇదే విధంగా 26 మంది సర్పంచ్‌లు రాజీనామా అస్త్రం సంధించారు. అలా వార్నింగ్ ఇచ్చినవాళ్లంతా తర్వాత ఎమ్మెల్యేతో కలిసిపోయారు. కొత్తగా 16 మంది ఆదివాసీ సర్పంచ్‌లు స్వరం పెంచారు. తమతో ఫొటోలు దిగడం తప్పితే.. ఎమ్మెల్యే సక్కు తమ మొర ఆలకించడం లేదని గగ్గోలు పెడుతున్నారట.
తాజా రగడపై ఎమ్మెల్యే సక్కు శిబిరం ఉలిక్కి పడుతున్నట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ జగడం ఏంటని ఆందోళన చెందుతున్నారట. కాంగ్రెస్, బీజేపీ వర్గాలు గేర్ మార్చి దూకుడు పెంచుతున్న తరుణంలో.. ఈ సమస్య పెద్దది అయితే మొదటికే మోసం రావొచ్చని కలవరం పడుతున్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలు సైతం తాజా రాజకీయ పరిణామాలను ప్రస్తవిస్తూ ఎమ్మెల్యేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. అయితే అసమ్మతి రాగం వెనుక పార్టీలో కొందరి ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారట ఎమ్మెల్యే ఆత్రం సక్కు. మొదట్లో కోరలు చాచి.. తర్వాత సైలెంటైన ప్రత్యర్థులే ఇప్పుడు యాక్టివ్ అయ్యి ఉంటారని సందేహిస్తున్నారట. ఆసిఫాబాద్ గులాబీ శిబిరంలో రేగిన సమస్యకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే వర్గీయులు విరుగుడు మంత్రం వేసే పనిలో పడ్డారట. అసమ్మతి వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీస్తున్నారట. ఇన్నాళ్లూ లేనిది.. ఎన్నికల సమయంలోనే గొంతు చించుకోవడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పూర్తి క్లారిటీతో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే నిప్పు లేకుండా పొగ రాదు కదా అనేది పార్టీలో మరికొందరి వాదన. పంతాలకు పోకుండా.. అంతా కలిసి నడిస్తే మేలని హితవు పలుకుతున్నారట. మరి.. సమస్య సర్దుబాటుకు ఎమ్మెల్యే చొరవ తీసుకుంటారో లేక పార్టీ పెద్దలే జోక్యం చేసుకుంటారో చూడాలి.