Off The Record: ఏపీ బీజేపీ కేడర్ని ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తోందట. కార్యక్రమం ఏదైనాసరే…. ఆ… చూద్దాంలే, చెప్పినప్పుడు చేద్దాంలే అన్నట్టుగా ఉంటున్నారు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులతో సహా… ఎవ్వరూ యాక్టివ్ రోల్ తీసుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందులాగా… మేమున్నాం అంటూ పార్టీ కోసం ముందుకు రావడం లేదట. దీంతో చిన్న కార్యక్రమం చేయాలన్నా మందిని పోగేయడం పెద్ద టాస్క్‌గా మారిందని చెబుతున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు. ఏదైనా సరే… అధిష్టానం ఆదేశిస్తేనే ఇక తప్పదన్నట్టుగా మమ అనిపిస్తున్నారు తప్ప… పార్టీ మీద ప్రేమతో, శ్రద్దగా ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నది ఇంటర్నల్ టాక్. పార్టీ పిలుపునిచ్చిందని తప్పక ఏ కార్యక్రమం చేసినా… చివరికి ఖర్చులే కనిపిస్తున్నాయి తప్ప…. చేశారన్న గుర్తింపు రావడం లేదన్న బాధ కనిపిస్తోందట ఏపీ బీజేపీ నాయకుల్లో. ఈ పార్టీలో పని చేసి ఫలితం దక్కాలంటే, పాకా సత్యనారాయణ, శ్రీనివాసవర్మ లాగా నాలుగు పదుల సర్వీసు దాటాలని, రోజులు మారాయని గుర్తించకపోతే ఎలాగని మాట్లాడుకుంటోందట కేడర్. దశాబ్దకాలం పని చేసినా…, అధికారంలో ఉన్నామని చెప్పుకోవడమే తప్ప పదవులు రావడం లేదని, ఎలాంటి పదవి లేకుండా, ఇవాళో రేపో వస్తుందన్న కనీస ఆశ లేకుండా ఏం పని చేస్తామని మాట్లాడుకుంటున్నారట నాయకులు. పదవులు లేక, గుర్తింపు దక్కక ఓ పక్కన నిరాశతో సతమతమవుతుంటే….ఇంకా పనులు చేయమని పురమాయిస్తారని, ఈ పరిస్థితుల్లో అదెలా సాధ్యమవుతుందని పరస్పరం ప్రశ్నించుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Off The Record: ఏపీ ప్రభుత్వం, టీడీపీలో భారీ మార్పులు.. కీలకంగా మారనున్న నారా లోకేష్
ఒకవేళ ఏదైనా కార్యక్రమం గురించి చర్చిస్తే…, బాధ్యత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. కూటమి ధర్మం పేరిట బీజేపీ నాయకులకు ఛాన్సులు దాదాపు లేవన్నట్టుగానే జరుగుతున్న పరిణామాలు చెపుతున్నాయంటూ అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట ఏపీ కాషాయ నేతలు. పార్టీ బలోపేతం గురించి ఆలోచించాలంటే, ముందు ప్రజల్లోకి వెళ్ళేందుకు గుర్తించదగిన పదవి కావాలి కదా అన్నది కమలం నేతల ప్రశ్నగా తెలుస్తోంది. ఈ అసహనాన్ని ఎక్కడ వెళ్ళగక్కాలో అర్ధంగాక మనసులో బాధను గోడ చాటున చెప్పుకుంటున్నారట ఏపీ బీజేపీ లీడర్స్. సూత్రాలు, సిద్ధాంతాలు చెప్పుకుంటూ తిరిగితే, మనకి ఒరిగేదేంటి అంటూ కొందరు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు సమాచారం.ఎవరైనా కేంద్రస్ధాయి నేతలు వస్తే తప్ప రాష్ట్ర కార్యాలయం ముఖం కూడా చూడటం లేదట లీడర్స్, కేడర్. ఢిల్లీ నేతల కళ్ళలో పడటానికి చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో, పట్టనట్టు ఉంటున్నారట. మొత్తంగా… ఈ నిర్లిప్తత పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుందోనని ముఖ్యనేతలు కెంగారు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.