Off The Record: తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అలంపూర్ నియోజకవర్గం రాజకీయ మలుపుల్లో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటోంది. ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది…. టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్ గానే ఉంటోంది గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి. ఈ క్రమంలో…. రెండు సార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పని చేసిన అబ్రహం… ఈసారి పార్టీ మారి కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని, ఎమ్మెల్సీ చల్లా సూచించిన విజయుడికి టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్. తనకో, లేదా తన కుమారుడు అజయ్‌కో గులాబీ టికెట్ దక్కుతుందని భావించిన అబ్రహంకు ఈ పరిణామాలు అస్సలు నచ్చలేదట. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కు మద్దతిచ్చారు. అయినా సంపత్ ఓడిపోయారు. ఇక… అసెంబ్లీ ఎన్నికల తరువాత క్రియాశీల రాజకీయాలతో టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటున్న అబ్రహం…, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీ లో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ చేజారిన తర్వాత బీజేపీ నుంచి పిలుపు వచ్చినప్పుటికీ అప్పుడాయన నిరాకరించారట. కానీ… ఇప్పుడు నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులు, అనుచరగణం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Read Also: Off The Record: ఆ జనసేన ఎమ్మెల్యే అనుచరులకు ఏం చేసినా పర్శంటేజ్ ఇవ్వాల్సిందేనా..?
2009లో రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే… మొదట కాంగ్రెస్ నుంచి టిక్కెట్ దక్కించుకొని గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు కాకుండా… సంపత్ కుమార్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో అప్పుడాయన టీడీపీ చేరి ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక 2018 ఎన్నికల ముందు బి అర్ ఎస్ లో చేరి మరోసారి విజయం సాధించారు. ఇక 2023లో సిట్టింగ్‌గా మరోసారి ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఐతే కాంగ్రెస్ లోనూ , బి అర్ ఎస్ లోనూ సిట్టింగ్‌గా తనకు టికెట్ దక్కకుండా చేయడం లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారట అబ్రహం. ఇదిలా ఉంటే… వయోభారంతో ఉన్న డాక్టర్ అబ్రహం… బీజేపీ గూటికి చేరాలని ఆలోచించడం వెనక ప్రత్యేక కారణాలున్నాయని చెప్పుకుంటున్నారు. అలంపూర్‌లో బీజేపీకి పట్టు ఉండటం, జనరల్ స్థానంగా ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ట్రాక్ ఉండటంతోపాటు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్‌లో బీజేపీకి 55 వేల పైచిలుకు ఓట్లు రావడంలాంటి లెక్కలు వేసుకుంటున్నారట ఆయన. బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా ప్రాబల్యం, కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే సంపత్ హవా నే కొనసాగుతుండటంతో…. జాతీయ పార్టీ అయిన బీజేపీలో భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారట అబ్రహం.
Read Also: Real Estate Scam: సొంతిటి కలలు కనే వారే టార్గెట్.. రియల్ ఎస్టేట్‌లో కొత్త తరహా మోసాలు..
ఇక ఇదే సమయంలో కుమారుడు డాక్టర్ అజయ్ పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో ఉంచుకొని కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అబ్రహం ఇప్పటికే జిల్లా బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణతో, రాష్ట్ర పార్టీ పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల ముందే అబ్రహంను పార్టీలోకి చేర్చుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారట బీజేపీ పెద్దలు. మొత్తం మీద తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం అబ్రహం వేస్తున్న పొలిటికల్ స్టెప్స్ తో అలంపూర్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.