ఇల్లు అలకగానే పండగ కాదు. ప్రస్తుతం శింగనమల టీడీపీ పరిణామాలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఇంఛార్జ్ ఉండగానే వచ్చిన టుమెన్ కమిటీకి.. రెండు మండలాలను టచ్ చేయాలంటే ధైర్యం సరిపోవడం లేదట. ఆ మండలాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే జేసీ బ్రదర్స్ పర్మిషన్ తీసుకోవాలట. దానిపైనే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ..!
శింగనమలలో టీడీపీ టు మెన్ కమిటీ బలప్రదర్శన..!
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో తలెత్తిన రచ్చ ఇప్పట్లో తగ్గేలా లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో కొత్త పరిణామాలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఇంఛార్జ్ బండారు శ్రావణికి కొందరు సీనియర్ లీడర్లకు మధ్య విభేదాలు రావడంతో టుమెన్ కమిటీ తెరపైకి వచ్చింది. శ్రావణి అండ్ కో ఈ టు మెన్ కమిటీని తీవ్రంగా వ్యతిరేకించింది. అభ్యంతరాలను, అసంతృప్తులను పట్టించుకోకుండా టుమెన్ కమిటీ కొన్ని మండలాల్లో ఆత్మీయ సమావేశాల పేరుతో బలప్రదర్శనకు దిగింది.
యల్లనూరు, పుట్లూరులో జేసీ బ్రదర్స్ చెప్పిందే వేదం?
టు మెన్ కమిటీలోని నేతల సొంత మండలాలైన నార్పల, గార్లదిన్నెలే కాకుండా శింగనమల నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవే శింగనమల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు. వీటిలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో పార్టీ పరంగా జేసీ బ్రదర్స్ చెప్పిందే వేదం. వీరి ఆజ్ఞ లేకుండా ఒక్క కార్యకర్త కూడా కదలడు. పైగా తాడిపత్రికి చేరువలోనే ఉండే మండలాలివి. అంతేకాదు.. టీడీపీ ఇంఛార్జ్ శ్రావణికి జేసీ బ్రదర్స్ ఫుల్ సపోర్ట్ ఉంది. అందుకే ఆ రెండు మండలాల్లో పర్యటన.. కార్యకర్తలతో భేటీ ఎలాగో టుమెన్ కమిటీకి అంతుచిక్కడం లేదట.
జేసీ బ్రదర్స్‌ను కాదని ఆ మండలాలకు టు మెన్ కమిటీ వెళ్తుందా?
నార్పల, గార్లదిన్నె మండలాలలో మీటింగ్స్ పూర్తయ్యాక ఇతర మండలాల్లో కూడా అలాంటి సమావేశాలు పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నట్టు టు మెన్ కమిటీ వర్గాల వాదన. అసలు సంగతి మాత్రం మరొకటి అన్నది పార్టీ వర్గాలకు తెలుసు. ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. శింనగమల, బుక్కరాయసముద్రం మండలాల్లో ఎలాగోలా నెట్టుకొచ్చినా.. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో పరిస్థితి ఏంటన్నది వాళ్లకు పాలుపోవడం లేదట. ఇంచార్జ్ శ్రావణి లేకుండా ఈ మండలాలకు టు మెన్ కమిటీ వెళ్లకపోవచ్చని టాక్. జేసీ బ్రదర్స్‌ను కాదని అక్కడికి వెళ్లితే పరిస్థితులు.. పరిణామాలు మరోలా ఉంటాయని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే టుమెన్ కమిటీ ఎత్తుగడలపై ఆసక్తి నెలకొంది. అసలే జిల్లాలో పాత టీడీపీ నాయకులు.. జేసీ సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గ్యాప్ వచ్చింది. ఇలాంటి తరుణంలో శింగనమలలో టుమెన్ కమిటీ తీసుకునే నిర్ణయం.. కదలికలు టీడీపీలో ఇంకెలాంటి రచ్చకు కారణం అవుతాయో చూడాలి.