Nandyala TDP Politics :ఒకరు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే. ఇంకొకరు ఈసారి ఎమ్మెల్యే కావాల్సిందే అనుకుంటున్న ఓ మాజీ మంత్రి తనయుడు. ప్రత్యర్థులపై పోరుకంటే.. వాళ్లే పరస్పరం విమర్శించుకుంటున్నారట. మూడేళ్లుగా మిన్నకుండి.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ సొంతగూటిలో సౌండ్ పెంచుతున్నారట. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్..!
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి పెట్టనికోటనేది ఒకప్పటి మాట. టీడీపీ నేతల మధ్యే నిత్యం పోరాటమనేది ఇప్పటి మాట. ప్రత్యర్థి పార్టీపై పోరు కంటే సొంత పార్టీలోని నేతలపైనే బాణాలు ఎక్కు పెడుతున్నారు నాయకులు. సోషల్ మీడియాలో పోస్టులు.. ఏదో సందర్భంలో పరోక్షంగా చేసిన విమర్శలను వైరల్ చేయడంలో ఫుల్ బిజీగా ఉంటున్నారట. ఇదంతా ఎందుకోసమనే చర్చ టీడీపీ వర్గాల్లో ఉంది. బలంగా ఉన్న పార్టీ బలహీనపడుతున్నా పట్టించుకోని నేతలు కుంపట్లు రాజేయడంతో తమ్ముళ్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.
మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల టీడీపీ ఇంచార్జ్. బ్రహ్మానందారెడ్డికి.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఫరూక్ కుమారుడు ఫిరోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నంద్యాల టికెట్‌ను ఆశిస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఫిరోజ్ వర్గం బ్రహ్మానందరెడ్డిపై ఒంటికాలిపై లేస్తోంది. ఫిరోజ్ యువసేన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్స్ అమ్ముకున్నారనే ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యేపై నేరుగా బాణాలు ఎక్కు పెడుతున్నారు.
బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే ఏదో సందర్భంలో పరోక్షంగా బ్రహ్మనందరెడ్డిపై చేసిన విమర్శల వీడియోలు ఫిరోజ్ వర్గానికి ఇప్పుడు అస్త్రంగా మారిపోయాయి. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.. టీడీపీ నేత నారా లోకేష్ పై చేసిన విమర్శలను బీసీ జనార్దన్ రెడ్డి ప్రస్తావిస్తూ.. బ్రహ్మానందరెడ్డి పై విమర్శలు చేశారట. పాలు అమ్ముకునే వారిని లోకేష్ ఎమ్మెల్యేని చేసారంటూ జనార్దన్ రెడ్డి గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం నంద్యాల టీడీపీలో రచ్చ అవుతున్నాయి. నంద్యాలలో టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి ఇంఛార్జ్ బ్రహ్మానందరెడ్డే కారణమనేది ఫిరోజ్ వర్గం ఆరోపణ.
కొంతకాలంగా నంద్యాలలో ఇరువర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. నియోజకవర్గం క్లస్టర్ మీటింగ్‌కు తనను పిలవలేదని బహిరంగ వేదికపైనే ఫిరోజ్.. బ్రహ్మానందరెడ్డిపై అసంతృప్తి వెళ్లగక్కారు. దాంతో తనను రాజకీయంగా కార్నర్ చేస్తున్న సొంత పార్టీ నేతలకు బ్రహ్మానందరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పెద్దలు అందరిని కలుపుకొనే ముందుకు వెళ్తున్నానని.. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని వివరణ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. అలాగే స్థానిక నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేదిస్తుంటే.. వారి కోసం వచ్చానని చెప్పుకొచ్చారు బ్రహ్మానందరెడ్డి. నంద్యాల టీడీపీలో విభేదాలు సృష్టించాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో రాజకీయం హీట్ మీద ఉంది. ఆ ప్రభావం నంద్యాలలోనూ కనిపిస్తున్నా.. క్యాచ్ చేసుకునే పరిస్థితులో టీడీపీ నేతలు లేరు. పైగా ప్రత్యర్థులపై పోరాటం మానేసి సొంత వాళ్లపైనే ఓపెన్‌గా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం టీడీపీ నాయకులకే చెల్లిందని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. టికెట్ కావాలంటే పార్టీ పెద్దలను అడగాలి కానీ.. ఇలా రోడ్డున పడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. మొత్తం మీద అధికారం కోల్పోయినా టీడీపీలో మార్పు రాదా అనే ప్రశ్న కేడర్‌లో వినిపిస్తోంది.