Mopidevi Planning for next generation leaders :
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగ సభలతో ప్రజల్లో చర్చ కూడా జరుగుతోంది. వ్యూహాలకు పదును పెడుతున్నారు నాయకులు. అధిష్ఠానం అభ్యర్థుల మార్పునకు సంకేతాలు ఇస్తే.. ఆ ప్రత్యామ్నాయం కూడా తామే చూపించేలా ప్లాన్ చేస్తున్నారట కొందరు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని కొన్నిచోట్ల.. సామాజిక, రాజకీయ అంశాలు మరికొన్నిచోట్ల అభ్యర్థుల మార్పుకు కారణంగా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. కొత్త వాళ్లు వస్తే ఇబ్బంది అనుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలు.. వారసులను బరిలో దించేందుకు కసరత్తు మొదలుపెట్టేశారట.
బాపట్ల జిల్లా రేపల్లె ఎంపీ మోపిదేవి వెంకట రమణ ఇలాకా. గత ఎన్నికల్లో ఆయన ఓడినా.. ఎమ్మెల్సీని చేసి మంత్రిగా తీసుకున్నారు. తర్వాత శాసనమండలి రద్దు అంశం తెరపైకి రావడంతో ఆయన్ని రాజ్యసభకు పంపారు. వచ్చే ఎన్నికల్లో మోపిదేవి బరిలో దిగుతారో లేదో కానీ.. ఇక్కడ వైసీపీ అభ్యర్థిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకూడదని చూస్తోన్న మోపిదేవి.. తన కుమారుడు రాజీవ్‌ను బరిలో దించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం రేపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వంతోపాటు పార్టీ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో పార్టీ అధిష్ఠానం ఆశీసులు తన కుటుంబంపై ఉన్నాయని.. రాబోయే కాలంలో తన ఫ్యామిలీ నుంచి ఓ వ్యక్తి పోటీ చేస్తారని గట్టిగా చెప్పారు మోపిదేవి. పోటీ చేసేది మోపిదేవి కుమారుడు రాజీవే అని అంతా అనుకున్నారు. అప్పట్లో రేపల్లె వైసీపీ బరిలో ఉంటారని హీరో సుమన్‌తోపాటు మరికొందరు పేర్లు వినిపించాయి. కానీ.. అలాంటి చర్చకు ఆస్కారం లేకుండా మోపిదేవి అడ్వాన్స్ అయినట్టు భావిస్తున్నారు.
ఇక గుంటూరు తూర్పు నుంచి రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ముస్తఫా సైతం తన రాజకీయ వారసత్వాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కుమార్తె ఫాతిమాను ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలు.. పార్టీలో వ్యతిరేకవర్గాలు దూకుడు పెంచడంతో ముందు జాగ్రత్త పడుతున్నారట ముస్తఫా. కుమార్తె ఫాతిమాను నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడం.. వైసీపీ ప్లీనరీలో ప్రసంగాలు చేయిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారట. అయితే వైసీపీ మహిళా కార్పొరేటర్ ఒకరు తూర్పు అసెంబ్లీ సీటును ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే కుమార్తెను నియోజకవర్గం అంతా పర్యటించేలా ప్రణాళికలు వేస్తున్నారు ఎమ్మెల్యే.
మొత్తానికి రేపల్లె, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో వారసుల కోసం తండ్రులు పడుతున్న ఇక్కట్లు పార్టీలో పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. అయితే వారసులకు పార్టీ పెద్దలు ఓకే చెబుతారా? లేక ఇంకేదైనా సమీకరణాలను తెరపైకి వస్తాయా అన్నది చూడాలి.