Off The Record: రాజకీయంగా, కుటుంబపరంగా.. తనకు ఇబ్బందులు రావడానికి కారణమేంటో.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు తెలిసిపోయిందా? సమస్యకు మూలం ఎక్కడుందో కనుక్కున్నారా? అందుకు విరుగుడు కూడా మొదలుపెట్టేశారా? ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలు పూర్తయితే… ఇక తన మునుపటి పొజిషన్ వచ్చేస్తుందని ఆమె ధీమాగా ఉన్నారా? ఇంతకీ సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తున్నారు కవిత?
Read Also: Stock Market: ఎంత మోసం.. దలాల్ స్ట్రీట్ లొసుగులను వాడుకొని కోట్లు కొల్లగొట్టిన అమెరికా సంస్థ..!
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కవిత మాటలు, చేతలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్. ఇంటా బయటా రకరకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నారామె. అది స్వయంకృతమా? లేక పరిస్థితుల ప్రభావమా అన్న విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం తన సమస్యలకు విరుగుడు కనుక్కునే పనిలో బిజీగా ఉన్నారట కవిత. అన్నతో పోలిక..పోటీ, తండ్రికి, తనకు మధ్య గ్యాప్ రావడం, ఎక్కడికెళ్ళినా బీఆర్‌ఎస్ శ్రేణులు గతంలోలాగా ఆదరించకుండా ముఖం చాటేయడం, అన్నిటికీ మించి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను ఇరుక్కోవడం.. ఇలా సమస్యలన్నీ చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేయడానికి వాస్తు దోషమే ప్రధాన కారణం అని భావిస్తున్నారట ఎమ్మెల్సీ. ముందు తన ఇంటి వాస్తును సెట్ చేస్తే.. తర్వాత సమస్యలన్నీ వాటంతటవే సెట్ అయిపోతాయని కవిత నమ్ముతున్నట్టు చెబుతున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు.
Read Also: Off The Record: మీ లెక్కల్తో మాకేంటి..? మాకు గుర్తింపు ఇవ్వండి!
అందుకే, ఆలోచన వచ్చిందే తడవుగా కొట్టుడు-కట్టుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు హైదరాబాద్ గాంధీనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు కవిత. ఆ క్రమంలోనే.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమెకు సరైన నివాసం లేదన్నది కూడా ప్రచారాంశమైంది. ఆ తర్వాత బంజారాహిల్స్ నంది నగర్‌లో సొంత ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు కవిత. అక్కడే తేడా కొట్టిందన్నది ప్రస్తుతం ఆమె నమ్మకంగా తెలుస్తోంది. కొత్త ఇంట్లోకి వెళ్లిన నాటి నుంచి ఏదీ కలిసి రాలేదని అభిప్రాయపడుతున్నారట. దాదాపు రెండేళ్ళపాటు దగ్గరుండి ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంట్లోకి వెళ్ళాక.. అక్కకు ఇబ్బందులు మొదలయ్యాయని చెబుతుంటారు ఆమె అనుచరులు. కొత్త ఇంట్లోకి వచ్చిన నాటి నుంచి ఈడీ, సీబీఐ కేసులతో సతమతం అయ్యారన్నది వాళ్ళ వాదన. అలా, నందినగర్ ఇంట్లో ఉన్న సమయంలోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత దాదాపు ఆరు నెలపాటు జైల్లో ఉన్న కవిత… బెయిల్ మీద బయటికి వచ్చాక అదే ఇంట్లో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నా.. సరైన ప్రాధాన్యం దక్కడం లేదంటూ నారాజ్ అయిపోయి.. తండ్రికి లేఖ రాశారు.
ఇక, కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ పరోక్షందా సొంతోళ్ళనే టార్గెట్ చేశారన్నది విస్తృతాభిప్రాయం. ఇక ఆ తర్వాతి నుంచి కవిత పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందంటారు రాజకీయ పరిశీలకులు. పార్టీలో పట్టించుకునే వాళ్ళు లేకపోగా.. జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు గతంలోలాగా గులాబీ కేడర్ వెంట రావడం లేదు. కాస్తో కూస్తో ఆమె మీద అభిమానం ఉన్న నాయకులు కూడా భయభయంగా వచ్చి కలిసివెళ్తున్న పరిస్థితి. దీంతో కవిత పునరాలోచనలో పడ్డారట. అసలీ సమస్యలన్నిటికీ మూలం ఎక్కడుందని వెదికే క్రమంలో.. ఓ సిద్ధాంతి వాస్తు బల్బు వెలిగించినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన సూచనల మేరకే ప్రస్తుతం ఇంట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారట కవిత. నెల క్రితం తన ఇంటి పక్కనే ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా వాస్తు మార్పులు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి ముందు గోడను తొలగించారు.
Read Also: Minister Nara Lokesh: ఇంటర్ విద్యపై లోకేష్ సమీక్ష.. కీలక ఆదేశాలు
ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి మొదలుపెట్టిన జాగృతి కార్యాలయం ఎంట్రెన్స్ కూడా పక్కకు మార్చారు. ఇక ఇంటి ప్రధాన ద్వారం స్థానాన్ని కూడా మార్చబోతున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఒక పక్కగా, వాయువ్య మూలలో ఉన్న ప్రధాన ద్వారాన్ని సెంటర్‌కు మార్చబోతున్నారట. పైన ఉన్న సింహద్వారానికి ఎదురుగా ఈ ప్రధాన ద్వారం వచ్చేలా పెట్టాలన్నది ప్రస్తుతం జరుగుతున్న వాస్తు కరెక్షన్. అలాగే, ఇంట్లో నుంచి జాగృతి కార్యాలయంలోకి వెళ్లడానికి కూడా ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే శ్రావణమాసం లోపు ఈ వాస్తు మార్పులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారట కవిత. ప్రస్తుతం తనకు బ్యాడ్ టైం నడుస్తోందని, త్వరలో మంచి రోజులు వస్తాయని సన్నిహితులతో అంటున్నారట ఎమ్మెల్సీ. అప్పటికల్లా వాస్తు మార్పులతో రెడీగా ఉంటే.. ఇక తన పొలిటికల్ కెరీర్‌కు తిరుగుండదని భావిస్తున్నట్టు సమాచారం.