నాగార్జునాసాగర్ ఎమ్మెల్యే నోములు భగత్, ఎమ్మెల్సీ యంసీ కోటిరెడ్డి మధ్య దూరం చాలా పెరిగిపోయిందట. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య పెరిగిన ఈ గ్యాప్ తప్పకుండా పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారు కార్యకర్తలు. మనుషులు ఇద్దరూ ఒకే దగ్గర, ఒకే వేదిక మీద ఉన్నా పెదవి విప్పకపోవడం… పలకరించుకోకపోవడం వంటి ఘటనలు రొటీన్‌గా మారాయి. వారిద్దరూ పలకరించుకుంటే పెద్ద విశేషంలా చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. ఇద్దరి మధ్య పంచాయితీ విషయంలో అధినేత జోక్యం చేసుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్ అని స్పష్టత ఇచ్చారు. అయినప్పటీకీ…..ఎమ్మెల్సీ కోటిరెడ్డి వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో గ్యాప్ మరింత పెరిగిదని టాక్. ఎమ్మెల్యే ఒకవైపు ఉంటే…మరోవైపు ఎమ్మెల్సీ ఉండటంతో అధికారులకు నియోజకవర్గంలో పనిచేయడం కత్తిమీద సాములా తయారైందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు సొంత పార్టీ నేతలు.
ఐతే…ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి సైతం వీరి విషయంలో సైలెంట్ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. స్థానికేతరులు అని సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై పరోక్షంగా కామెంట్స్ చేయడం…వారికి ముఖ్యనేతలు కొందరు సపోర్టు చేస్తున్నారట. చిన్నచిన్న పొరపాట్లను పెద్దదిగా చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కేలా చేయడం వెనక ఎమ్మెల్సీ హస్తం ఉందని ఎమ్మెల్యే భగత్ వర్గీయుల ఆరోపణ. విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యకార్యకర్తలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని… వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని…వారికోసం అధికార యంత్రాంగం పనిచేసేలా ఒత్తిడి తెస్తున్నారని ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఖండించకపోయినా..ఎందుకో ఎమ్మెల్యే భగత్‌ను సాగర్ నియోజకవర్గం నుండి సాగనంపాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయల టాక్.
ఇక…ఈనెల 14న నియోజకవర్గంలో కేటీఆర్ టూర్ ఉంది. ఈ ఇద్దరి నేతల మధ్య వివాదాలకు చెక్ పడుతుందని అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు. సీనియర్ నేత జానారెడ్డి ప్రత్యర్ధిగా ఉండే అవకాశం ఉండటంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరి నేతల మధ్య సయోధ్య తప్పని సరి అంటున్నారు కార్యకర్తలు.