అధికారపార్టీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. అధినాయకుడి ఫ్యామిలీకి వీరవిధేయుడు. అలాంటి శాసనసభ్యుడికి హైకమాండ్ ఓ ఆఫర్ ఇచ్చింది. పిలిచి పదవిస్తే ససేమిరా అన్నారు. ఆఫర్ తిరస్కరించి కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? అధిష్ఠానం ఇచ్చిన అవకాశం ఏంటి?
తనకు టీటీడీ పదవా అని పెదవి విరిచారట!
ఎమ్మెల్యే అసంతృప్తితో పార్టీ పునరాలోచన?
తిరుమల శ్రీవారి సేవాభాగ్యం కోసం రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పోటీపడుతుంటారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా ఒక్కసారైనా పనిచేయాలని కలలు కంటారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత టీటీడీకి జంబో పాలకమండలిని ప్రకటించింది ప్రభుత్వం. గతబోర్డులో విశాఖ జిల్లా నుంచి యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఈసారి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావును పరిగణనలోకి తీసుకుంది. అదే విషయాన్ని ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి ఫోన్ చేసి మరీ చెప్పారట. అయితే తనకు ఆ పదవి తీసుకోవడం ఇష్టంలేదని బాబూరావు చెప్పేశారట. అంతేకాదు మంత్రిని కావాల్సిన తనకు TTD పదవా అని పెదవి విరిచారట. హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ ను ఎమ్మెల్యే తిరస్కరించడం రాజకీయంగా పెద్దచర్చకు దారితీసింది. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవడం అనేక ఊహాగానాలు వినిపించాయి. ఎమ్మెల్యే అసంతృప్తితో పార్టీ హైకమాండ్ పునరాలోచనలోపడిందట. తర్జనభర్జనలు అనవసరం అని భావించిన అధిష్ఠానం ఆఖరి నిముషంలో టీటీడీ బోర్డ్ సభ్యుల జాబితా నుంచి బాబూరావు పేరును తొలగించింది.
వైసీపీ తొలి మంత్రివర్గంలోనే చోటు ఆశించారు!
ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లో అడుగుపెట్టిన గొల్ల బాబూరావ్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పాయకరావుపేట నుంచి పోటీ చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఈ స్ధానం టీడీపీకి ఒకప్పడు కంచుకోట. దివంగత సీఎం YSR ఎన్నికల వ్యూహం ఫలించడంతో రాజకీయాలకు కొత్త అయినప్పటికీ బాబూరావ్ గెలిచారు. అప్పటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా మారారు బాబూరావ్. YCP ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచిన అతికొద్దిమంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. 2012లో ఉపఎన్నికలు అనివార్యమైనప్పుడు ఫ్యాన్ గుర్తుపై పోటీచేసి మళ్లీ విజయం సాధించారు. 2014లో సీట్ల కూర్పులో భాగంగా బాబూరావును అమలాపురం అసెంబ్లీ సీటుకు పోటీకి దింపింది వైసీపీ. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన బాబూరావు.. 2019కి తిరిగి పాయకరావుపేట వచ్చారు.. గెలిచారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రిజర్వ్డ్ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారనే గుర్తింపు, అధినాయకుడి కుటుంబంపట్ల విధేయత ప్లస్ అవుతాయని .. పార్టీలో సీనియర్ కావడంతో తొలి మంత్రివర్గంలో చోటు ఆశించారు బాబూరావు. అయితే కూడికలు తీసివేతలతో బాబూరావు పేరు కేబినెట్ ఏర్పాటులో పరిగణనలోకి రాలేదు. అప్పట్లోనే ఈ విషయమై బాబూరావు తీవ్ర నిరాశ చెందారట.
మంత్రి కాకున్నా అప్పట్లో శ్రీవారికి సేవ చేసుకోవచ్చని ఆశపడ్డారా?
మంత్రి కావాలని అనుకుంటున్న తరుణంలో తాజా ఆఫర్ నచ్చలేదా?
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ మొదటి బోర్డులో బాబూరావుకు చోటు ఖాయమని వార్తలు వచ్చాయి. మంత్రి కాకున్నా శ్రీవారికి సేవ చేసుకోవచ్చని బాబూరావు ఆశపడ్డారు. కట్ చేస్తే చివరి నిమిషంలో బాబూరావు పేరు జాబితాలో లేకుండా పోయింది. ఆ బాధను దిగమింగిన బాబూరావు రెండున్నరేళ్ల తర్వాత సీఎం జగన్ చేస్తానన్న కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై ఆశలు పెంచుకున్నారట. మొదట్లో మిస్సయినా.. ఈసారి నో డౌట్ అన్నట్టు ఉన్నారట. మళ్లీ కట్ చేస్తే ఈ సారి నిజంగానే టీటీడీ బోర్డులో బాబూరావుకు చోటు ఇస్తున్నట్టు చెప్పారు. కానీ.. మంత్రి కావాలని కలలు కంటున్న బాబూరావుకు అది అస్సలు నచ్చలేదట. మంత్రి పదవి ఇవ్వకుండా ఉండటానికే తనను సైడ్ చేస్తున్నారని గొల్లు మంటున్నారట. అయితే మంత్రే కావాలి కానీ చిన్న చితకా పదవులు వద్దని తేల్చి చెప్పేశారట. మరి.. బాబూరావు కల నెరవేర్చాలని అనుకున్నారో.. లేక మనం ఇస్తాం అంటే తిరస్కరించారనే కోపం ఉందో కానీ హైకమాండ్ కామ్‌గా ఆయన పేరును GO నుంచి తప్పించింది. బాబూరావు తిరస్కరణను పార్టీ నెగిటివ్‌గా తీసుకుందా? పాజిటివ్‌గా తీసుకుందా అనేది కేబినెట్ విస్తరణలో కానీ తెలియదు.