తనకు తాను కమ్మ ప్రతినిధిగా ప్రకటించుకున్న మంత్రి పువ్వాడ అజేయ్ తీరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి. రాష్ట్రానికి అంతటికీ మంత్రి. కానీ.. ఇలా ఒక కులానికి ప్రతినిధిగా చెప్పుకోవడం ఆశ్చర్యపరుస్తోంది.
ఇంతకీ పువ్వాడ అజేయ్ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారా? లేక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారా? లేకపోతే ఒక కులానికి మంత్రిగా ఉన్నారా? ఖమ్మంలో మినిస్టర్ కామెంట్స్ విన్నాక వినిపిస్తున్న ప్రశ్నలివే. బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యతో మంత్రి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నది అధికారపార్టీలో వినిపిస్తున్న మాట. ఆ ఘటనపై స్పందిస్తూ.. కులం కార్డును బయటకు తీశారు మంత్రి. ఆత్మహత్యను అడ్డంపెట్టుకుని తనపై కుట్ర చేస్తున్నారనే ఆరోపణ చేశారాయన. అక్కడితో ఆగకుండా తెలుగు రాష్ట్రాల్లో తాను ఒక్కడినే కమ్మ మంత్రి అని కొత్త రాగం తీశారు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కైన పరిస్థితి.
వాస్తవానికి సొంత జిల్లాలోనే మంత్రి అజేయ్‌కుమార్‌ను కమ్మ సామాజికవర్గం ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. ఆ మధ్య జరిగిన కమ్మ సంఘం ఎన్నికల్లో సంప్రదాయాలకు విరుద్ధంగా అభ్యర్థిని బరిలో దించారు అజేయ్. ఆ చర్యకు కమ్మ సామాజిక వర్గం మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అజేయ్ బలపర్చిన అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించారు కూడా. ఆ సమయంలో కులంపట్ల అలా వ్యవహరించి.. ఇప్పుడు కేసులో ఆరోపణలు వచ్చేసరికి కులం కార్డు ఉపయోగించడంపై మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కమ్మ కులానికి తానే మంత్రి.. ప్రజాప్రతినిధి అన్నట్టుగా అజేయ్ చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన అనేక మంత్రి ప్రజాప్రతినిధులు ఉన్నారు. టీఆర్ఎస్‌లోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎమ్మెల్సీలు చాలామందే ఉన్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహించినవాళ్లు అనేక మంది. ఉన్నతస్థానంలో ఉన్నప్పటికీ అన్ని వర్గాలను సమానంగా చూసి కులానికి మంచి పేరు తీసుకొచ్చినవాళ్లూ ఉన్నారు. కానీ.. అజేయ్ మాత్రం కమ్మ కులానికి తానే ప్రతినిధి అన్నట్టు మాట్లాడటం.. తనను కాపాడుకోవాలని ప్రాధేయపడటం.. ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పదవి పోతుందనే భయమో ఏమో.. అజేయ్ మాటల్లో వచ్చిన మార్పును విశ్వసించే పరిస్థితి లేదని ఖమ్మంలోని కమ్మ సామాజికవర్గం చర్చించుకుంటోందట.
Watch Here : https://youtu.be/p3x9wyHisus