సంచలనం రేపిన మేడ్చల్ బీఆర్ఎస్ ఎపిసోడ్‌పై హైకమాండ్ పోస్టుమార్టం మొదలుపెట్టిందా? మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో అసలు ఒప్పందం ఏంటి? పార్టీపై తొలిసారి బహిరంగంగా ఎమ్మెల్యేలు మాట్లాడటం వెనక ఏం జరిగింది ? సంబంధంలేని ఎమ్మెల్యేలు సమావేశానికి రావడం వెనక ఎవరి ప్రోద్బలం ఉంది?
తొలి ఏడాది కుత్బుల్లాపూర్‌కు మార్కెట్ పదవి
మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్‌లో రేగిన రగడపై అధికార పార్టీలో ఇంకా చర్చ సాగుతూనే ఉంది. మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల విమర్శల వెనక ఏం జరిగిందని ఆరా తీస్తూనే ఉన్నారు. సమస్యకు కారణమైన అంశాలపై ఫోకస్ పెట్టారు నేతలు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రవీందర్ యాదవ్‌ను సరిగ్గా ఏడాది క్రితం నియమించారు. కుత్బుల్లాపూర్-మేడ్చల్ నేతల మధ్య ఇదీ ఒప్పందం. తొలి ఏడాది కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నేతకు ఇవ్వాలనేది అంగీకారం. అందులో భాగంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన రవీందర్ యాదవ్‌కు ఇచ్చారు. ఏడాది తర్వాత మేడ్చల్ జిల్లాకు ఆ పదవి ఇవ్వాలనేది ఒప్పందంలో ఉంది. ఏడాది ముగిసిన వెంటనే ఒప్పందాన్ని నేతల ఉల్లంఘించారు. మళ్లీ ఆ పదవీని మాకే ఇవ్వాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పట్టుపట్టారు.
ఒప్పందం ప్రకారం వెళ్లాలన్న అధిష్ఠానం..!
అధిష్టానం పెద్దల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. ఒప్పందం ప్రకారం నడచుకోవాలని సంకేతాలు వచ్చాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన భాస్కర్ యాదవ్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించింది. జీవో విడదలైంది. ఆలస్యం మంచిదికాదని మరుసటి రోజే భాస్కర్ ప్రమాణం కూడా చేసేశారు. ఇదే మైనంపల్లి ఇంట్లో జిల్లా ఎమ్మెల్యేల సంచలన సమావేశానికి కారణం అయింది.
అగ్నికి ఆజ్యం పోసిన మైనంపల్లి ఇంట్లో భేటీ..!
మేడ్చల్ మార్కెట్ యార్డు కుత్బుల్లాపూర్ -మేడ్చల్ మధ్య ఉంటుంది. ఎనభై శాతం మేడ్చల్ జిల్లాకే ఈ మార్కెట్‌తో సంబంధం ఉంటుంది. దాదాపు 30 ఏళ్లలో కుత్చుల్లాపూర్‌కు చెందిన వ్యక్తికి తొలిసారి ఆ పదవి ఇచ్చారు. మెజార్టీ మేడ్చల్‌లో ఉండటంతో కుత్బుల్లాపూర్ నేతలు ఈ విషయాన్ని పెద్దగా ఎప్పుడూ పట్టంచుకోలేదు. మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డితో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ సఖ్యతగానే ఉండేవారు. మైనంపల్లి ఇంట్లో సమావేశం కావాలని నిర్ణయంచడం… వివేక్ మిగిలిన ఎమ్మెల్యేలను సమావేశానికి కూడగట్టడం… అగ్నికి ఆజ్యం పోసింది. ఈ మార్కెట్‌తో సంబంధంలేని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుబాష్ లాంటి వాళ్లు కూడా ఆ రహస్య సమావేశానికి రావడంతో ఏదో కుట్ర ఉందని అధిష్ఠానం నమ్ముతోంది. అంతర్గత సమావేశం జరిగినా.. పార్టీ అధిష్టానంపై నేరుగా విమర్శలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పెద్దలు.
లైబ్రరీ పదవిపైనా వివేక్, శంభీపూర్ రాజు మధ్య రగడ
ఇక కుత్బుల్లాపూర్‌లో పదవుల పంచాయతీ కొత్తకాదు. జిల్లా లైబ్రరీ చైర్మన్‌గా ఉద్యమకారుడు నాగరాజుయాదవ్‌ను నియమించారు. రెండేళ్ల పదవీ కాలం ఉండగా ఏడాదిన్నరకే తీసేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు నాగరాజు అనుచరుడు. ఆ కారణంతోనే ఎమ్మెల్యే వివేక్ ఒత్తిడి చేసి తీసేశారనేది ఆరోపణ. కుత్బుల్లాపూర్ కు చెందిన నాగరాజు యాదవ్ స్థానంలో లైబ్రరీ చైర్మన్ గా మేడ్చల్ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఆ ఎపిసోడ్ కూడా ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న విభేదాలకు ప్రత్యక్ష సాక్షంగా చెబుతున్నారు నేతలు.