అది రాజకీయ చైతన్యం కలిగిన లోక్‌సభ స్థానం. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత పార్టీని పట్టించుకున్నవాళ్లే లేరు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరో తేల్చడం లేదు. అధిష్ఠానం మనసులో ఎవరున్నారో అంతుచిక్కక.. ఆశావహుల అడుగులు ముందుకు పడటం లేదట. ఆ సెగ్మెంట్ ఏంటో.. ఆశావహులు ఎవరో.. ఈ స్టోరీలో చూద్దాం.
మాగంటి బాబుకు ఏలూరు టీడీపీలో ఎదురుగాలి?
ఏలూరు లోక్‌సభ సభ్యుడిగా 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి వెంకటేశ్వరరావు 2019లో ఓడిపోయారు. కర్ణుడు చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా.. ఆనాడు మాగంటి బాబు ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయని కేడర్ చెవులు కొరుక్కుంటుంది. అందులో ప్రధానంగా గ్రూపు రాజకీయాలదే మొదటి స్థానం. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు పట్టు లేకపోయినా.. ఎదుగుగాలి మాత్రం ఎక్కువే. అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన మాటను నెగ్గించుకోవడం కోసం ఊరికో గ్రూపును ప్రోత్సహించారనే ఆరోపణలు మాగంటి బాబుపై ఉన్నాయి. 2019లో ఓడిన తర్వాత ఇప్పటికీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ పరిస్థితి అయోమయం గందరగోళం. మూడున్నరేళ్లుగా స్థానికంగా సైకిల్ పార్టీని చక్కదిద్దిన పాపాన పోలేదు.
ఇంకా గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని బాబుపై ఆరోపణ
గత ఎన్నికల్లో ఓడిన తర్వాత వ్యక్తిగత కారణాలతో టీడీపీ కార్యక్రమాలకు దూరం అయ్యారు మాగంటి బాబు. ప్రస్తుతం సమస్యలు కొలిక్కి రావడంతో మళ్లీ పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు బాబు అంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదట. గతంలో మాదిరి ఇప్పటికీ ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ తరుణంలో మాగంటి బాబుకు మరోసారి టీడీపీ ఛాన్స్ ఇస్తుందా? ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో.. పోటీ చేసినా ఎంత వరకు నెగ్గుకు రాగలరు అని సందేహిస్తున్నారట.
గన్ని వీరాంజనేయులు ఎంపీగా పోటీ చేస్తారా?
ఒకవేళ మాగంటి బాబు కాకపోతే.. టీడీపీ నుంచి బరిలో ఉండేది ఎవరు అని చర్చిస్తున్నారట పార్టీ నేతలు. ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేరు బలంగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట. వచ్చే ఎన్నికల్లో వీరాంజనేయుల్ని అసెంబ్లీకి కాకుండా ఎంపీగా పోటీ చేయిస్తారనే టాక్ నడుస్తోంది. 2014లో ఉంగుటూరు ఎమ్మెల్యే గెలిచిన ఆయన.. 2019లో ఓడిపోయారు. ప్రస్తుతం జిల్లా టీడీపీ పగ్గాలు చేపట్టాక.. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు వీరాంజనేయులు. టీడీపీ అధిష్ఠానం ఆయనకు ఏమైనా సంకేతాలు ఇచ్చిందా? అందుకే విస్తృతంగా పర్యటిస్తున్నారా? అనే అనుమానాలు ఉన్నాయట. అయితే వీరాంజనేయులు మాత్రం అసెంబ్లీకి పోటీ చేయడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారట. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి కావచ్చొనే లెక్కల్లో ఆయన ఉన్నట్టు సమాచారం.
పొత్తు కుదిరితే బీజేపీకి వదిలేస్తారని చర్చ
ఇదే సమయంలో టీడీపీలో మరో చర్చా జరుగుతోంది. ఒకవేళ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కుదిరితే.. ఏలూరు సీటును కమలం పార్టీకి ఇవ్వొచ్చని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయ పడుతున్నారట. దీనివల్ల పార్టీలోని గ్రూపు తగాదాలకు చెక్ పడుతుందని విశ్లేషిస్తున్నారట. బీజేపీ నుంచి ఆ పార్టీ నేతలు గారపాటి తపన చౌదరి లేదా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు ఏలూరు ఎంపీలుగా పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పొత్తులు ఉంటాయో లేదో కానీ.. టీడీపీ నుంచి అభ్యర్థి విషయంలో పార్టీ క్లారిటీ ఇవ్వకపోవడమే కేడర్‌ను గందరగోళంలో పడేస్తోంది.