ఆపరేషన్ ఆకర్ష్. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో చేపట్టింది. ఇతర పార్టీల నేతలకు వలలు.. గేలాలు ఎన్నో వేస్తోంది. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చలు అనేకం. అదిగో వచ్చేస్తున్నారు.. ఇదిగో వచ్చేస్తున్నారు అనే హడావిడి తప్పితే బీజేపీ గడప ఎక్కినవాళ్లు తక్కువే. ఇతర పార్టీలలో పెద్ద నేతలుగా చెలామణి అవుతున్న వాళ్లు బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. కాషాయ కండువా కప్పుకోవడమే మిగిలిందని అనేక లీకులు ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు వస్తున్నా.. ఒక్క చేరికా లేదు. పైస్థాయిలోనే కాదు.. క్షేత్రస్థాయిలో గల్లీ లీడర్లను చేర్చుకోవడానికి ఆపసోపాలు పడుతున్న పరిస్థితి ఉందట.
ఆ మధ్య పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కాగానే తెలంగాణలో వరదలా వచ్చి బీజేపీలో చేరిపోతారని భావించారు. ఆ ఎన్నికలు అయిపోగానే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడూ అంతే..! హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణలో బీజేపీకి గేమ్ ఛేంజర్ అవుతుందని భుజాలు ఎగరేశారు బీజేపీ నేతలు. ఆ ఎన్నికలు అయిపోతూనే ఉన్నాయి.. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. చేరికల్లో ఒక్క ఇంచ్ కూడా పురోగతి లేదు.
పై ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు. పార్టీలో మేం నలుగురమే ఉంటామంటే కుదరదని కొందరిని ఉద్దేశించి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. కానీ. ఏం లాభం.. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉంది తెలంగాణ బీజేపీలో చేరికల పరిస్థితి. ఒకటి రెండు పెద్ద తలకాలయను టచ్ చేసినా.. వాళ్లు ఇంకా ఊ కొట్టలేదట. దీంతో బీజేపీలో క్రమంగా చర్చ మొదలైంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి శివప్రకాష్.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఆ మీటింగ్‌లో జాయినింగ్స్‌పై ప్రశ్నలు నడిచాయట. తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీ నాయకులు ఎందుకు చేరడం లేదు? అని శివప్రకాష్ ఆరా తీశారట.
బీజేపీ పదాధికారుల సమావేశంలోనూ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ సైతం చేరికల గురించే ఎక్కువగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలోనూ ఇతరులను చేర్చుకునేందుకు ఫోకస్ పెట్టాలని హితవు పలికారు. పైగా బీజేపీలో ఎవరిని చేర్చుకోవాలి.. ఎవరిని చేర్చుకోవద్దు అనే దానిపై రాష్ట్రపార్టీ అనుమతి కూడా తీసుకోవాల్సిన పని లేదని తరుణ్‌చుగ్ స్పష్టం చేశారట. వాస్తవానికి బీజేపీలో అంతర్గత వాతావరణం సరిగా లేక చేరికలకు బ్రేక్ పడినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరినైనా తీసుకొస్తే.. మరో బీజేపీ నాయకుడు అభ్యంతరం చెబుతున్నారట. పార్టీ ముఖ్య నేతల మధ్య ఈ విషయంలో సమన్వయం లేదట. ఈ గొడవలు కూడా ఇతర పార్టీ నాయకులు ఆందోళన చెందడానికి కారణంగా ఉన్నాయట.
బీజేపీలో చేరికల గురించి ప్రత్యేకంగా కమిటీ వేశారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి సారథ్యంలో ఆ కమిటీ ఏర్పాటైంది. అయితే ఇంత వరకు చేరికలపై కమిటీ చర్చించింది లేదు. అసలు ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపితే.. కమిటీకి పని లభిస్తుంది. అలాంటి సంకేతాలే లేనప్పుడు కమిటీ వేసి ఉపయోగం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దాంతో తెలంగాణ బీజేపీలో చేరికలు కలేనా అనే చర్చ సాగుతోంది.