ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఓటమి హ్యాట్రిక్.. డబుల్ హ్యాట్రిక్ స్థాయికి చేరింది. అయినప్పటికీ లీడర్ల తీరు మారడం లేదట. టీడీపీ జెండా ఎగరక తమ్ముళ్లు డీలా పడ్డారట. ఎన్ని రిపేర్లు చేసినా అక్కడ సైకిల్ నడవకపోవడానికి కారణం ఏంటి? కేడర్ చెల్లాచెదురైనా ఎందుకు లైట్‌గా తీసుకుంటున్నారు?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా పార్టీలకు చాలా సెంటిమెంట్ ఉన్న జిల్లా. ఇక్కడ ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెబుతారు. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నాలుగుచోట్ల గత మూడు ఎన్నికల్లో టీడీపీ గెలుపు మాటే మర్చిపోయింది. ఎన్ని ఈక్వేషన్స్ మార్చినా పసుపు జెండా కనిపించడం లేదు. కేడర్ బాగానే ఉన్నప్పటికీ లీడర్లు మాత్రం శ్రద్ధ పెట్టడం లేదట. 2004 తర్వాత కొత్తపేట, జగ్గంపేట, రంపచోడవరం, తుని నియోజకవర్గాలలో టిడిపిని పట్టించుకోవడం లేదు జనాలు.
కొత్తపేటలో అయితే మరీ దారుణం. 1999లో ఇక్కడ టిడిపి చివరిసారిగా గెలిచింది. జగ్గంపేటలోనూ సేమ్ సీన్. ఈ రెండుచోట్లా మరో ట్విస్ట్ ఉంది. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున బండారు సత్యానందరావు, జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిద్దరూ ప్రస్తుతం టిడిపిలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైనే పోటీ చేశారు. కాకపోతే అప్పట్లో వాళ్లు పార్టీ మారి అదే నియోజకవర్గాల నుండి వేరే పార్టీ తరపున అసెంబ్లీకి వెళ్లారు. 2009 ఎన్నికల్లో బండారు సత్యానందరావు పీఆర్పీ నుంచి గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి టిడిపిలోకి రీ ఎంట్రీ ఇచ్చి.. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. జ్యోతుల నెహ్రూ 1999లో టీ డీ పీ తరపున గెలిచి 2004లో టీ డీ పీ తరుపున, 2009 లో పిఆర్పీ తరపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓడారు. 2014లో వైసీపీ నుంచి గెలిచినా… రెండేళ్లకే తిరిగి సైకిల్ ఎక్కేసారు. 2019లో పసుపు పార్టీ తరపున బరిలో ఉన్నా ఓటమి తప్పలేదు. రంపచోడవరంలో 2004 తర్వాత టీ డీ పీ జాడలేదు. ప్రస్తుతం ఇంఛార్జ్‌గా ఉన్న వంతల రాజేశ్వరిని కేడర్ పట్టించుకోవడం లేదట. ఇక్కడ ఎన్నిక ఎన్నికకు అభ్యర్థిని మార్చినా పార్టీకి కలిసిరావడం లేదనే టాక్ ఉంది. తునిలో యనమల బ్రదర్స్‌ను విజయం వరించడం లేదు. 2009లో యనమల రామకృష్ణుడు ఓడిపోగా.. 2014, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు ఓడిపోయారు.
ఈ నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికల్లోను పల్లకిలు మోస్తున్నా.. ప్రయోజనం లేదని ఆవేదన చెందుతున్నారట తెలుగు తమ్ముళ్లు. పల్లకిలో కూర్చునే వారు వెళ్తున్నారు వస్తున్నారుగాని సైకిల్ అడ్రస్ ఉండటం లేదట. లీడర్లకి ఇచ్చిన విలువ క్యాడర్ ఇవ్వకపోవడమే అసలు సమస్య అనేది పార్టీలో వినిపించే మాట. ఈ మధ్యకాలంలో వలసలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయట. ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనా.. మరీ ఇంత దారుణమా అనేది కొందరి ప్రశ్న. పార్టీ అధికారంలో ఉంటే.. పదవుల అనుభవించడానికి వచ్చే నేతలు కష్టకాలంలో కనిపించరని విమర్శిస్తున్నారు.
ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరిగా గయబ్ అయిపోతున్నారట. ఒకరిద్దరు పార్టీ వీరాభిమానులు అధిష్టానం దృష్టికి విషయాలను తీసుకుని వెళ్తే.. అన్ని తమకు తెలుసనే సమాధానం తప్ప మరో మాట ఉండటం లేదట. వచ్చే ఎన్నికలు కీలకంగా కావడంతో ఇప్పటి నుంచే రిపేర్లు మొదలు పెట్టకపోతే ఆ నాలుగుచోట్లా సైకిల్‌ను షెడ్డులో పెట్టాలని సెటైర్లు వేస్తున్నారట. మరి పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.