kalwakurthy TRS Politics : అక్కడ ఇప్పటికే అధికార పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయ్. ఇప్పుడు మరో వర్గం తయారైంది.
ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు మూడు వర్గాల నేతలు. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆధిపత్యం చెలాయిస్తూ..కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఈ స్టోరీలో చూసేయండి.
పాలమూరు జిల్లా..కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఉన్న రెండు వర్గాలకు తోడు మరో వర్గం తయారైనట్లు కనిపిస్తోంది. కల్వకుర్తి టిఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి రెండు వర్గాలుగా చీలిపోయారనే ప్రచారం ఊపందుకుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నం చేసుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం టిఆర్ఎస్‌లో కొనసాగుతున్న మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అభివృద్ధి కమిటీ పేరుతో మరో వర్గానికి బీజం వేసినట్లు తెలుస్తోంది. అటు…ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిలతో కల్వకుర్తి నియోజకవర్గానికి ఒరిగిందేమి లేదంటూ దాస్ ఎండగడుతున్నారని టాక్.
కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు చిత్తరంజన్ దాస్. రెండున్నర ఏళ్ల క్రితమే టిఆర్ఎస్ గూటికి చేరారు. 1989 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్‌ను ఓడించడంతో చిత్తరంజన్ దాస్‌కు అప్పట్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ తరువాత కాంగ్రెస్‌లో బిసి వాదాన్ని వినిపిస్తూ వచ్చారు చిత్తరంజన్. మారిన రాజకీయ పరిణామాలతో టిఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న దాస్ ఇప్పుడు స్వరం పెంచారట. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదే అని ప్రచారం చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జైపాల్ యాదవ్‌ను కాదని చిత్తరంజన్ దాస్‌కు టికెట్ దక్కుతుందా?అనే చర్చ మొదలైంది.
ఇక…ఇలాంటి పరిస్థితుల్లో చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి తాలూకా అభివృద్ది కమిటీ పేరుతో సమావేశం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఆ సమావేశాలకు టిఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం హాజరు కావడం హాట్ టాపికైంది. నియోజకవర్గంలో అభివృద్ది తాను ఎమ్మెల్యే గా, మంత్రిగా కొనసాగినప్పుడు అయ్యిందే తప్పా….ఇప్పుడు కొత్తగా జరిగిందేమి లేదంటున్నారట చిత్తరంజన్. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి సహాయ నిధి చెక్కుల పంపిణీకే పరిమితమయ్యారని పరోక్షంగా చురకలంటిస్తున్నారట.
మరోవైపు…వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు అధిష్టానం పెద్దలతో చిత్తరంజన్ దాస్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు…కొల్లాపూర్‌లో టిఆర్ఎస్ నేతలు వర్గపోరుతో రచ్చకెక్కుతున్నారు. అక్కడి నేతల మద్య సమన్వయం చేసే భాద్యతను అధిష్టానం చిత్తరంజన్ దాస్‌కు అప్పగించిందట. దీనిపై నివేదికను అధిష్టానానికి ఇచ్చిన దాస్….తనను గులాబీ పెద్దలు గుర్తించారని చెప్పుకుంటున్నారట. నియోజకవర్గంలోని పరిస్థితులు తనకు అనుకూలంగా మారతాయని లెక్కలేసుకుంటున్నట్లు సమాచారం. తన అనుచరుల వద్ద ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారట. ఐతే…తనకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి హమీ లభించిందని ప్రచారం చేసుకోవడంపై జైపాల్ వర్గం భగ్గుమంటోంది.