జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ప్రధాని రాక సమయంలోనే, కేసీఆర్ మరో స్టేట్ లో వుండటంపై పొలిటికల్ కాక రేగుతోంది.
మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటన సందర్భంగా హడావిడి చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. మరోవైపు మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే …సీఎం కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు షెడ్యూల్ ఖరారు కావడం, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరతీసినట్టయ్యింది. కొంత కాలంగా టిఆర్ఎస్, బిజెపి మధ్య ఉప్పు నిప్పులా రాజకీయం మారింది. ఇదే సమయంలో మోడీ రావడం, కేసీఆర్ రాష్ట్రంలో ఉండకపోవడం, అందులో భాగంగానే జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది
మొదట్లో మోడీ తో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నా, ఆ తర్వాత కాలక్రమేణా ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. మోడీ టార్గెట్ గా కేసీఆర్ బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇటువంటి పరిణామాల్లోనే మోడీ నిర్వహించే పలు వీడియో కాన్ఫరెన్స్ లకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. మోడీని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ వెళ్లలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, మోడీకి స్వాగతం తెలిపేందుకు పంపారు కేసీఆర్. ఇటు రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు మోడీ హాజరు కాగా, కేసీఆర్ అక్కడికి వెళ్లలేదు. మోడీని కలిసేందుకు ఆసక్తిగా లేని కేసీఆర్, ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారన్న వాదనలు అప్పట్లో వినిపించాయి. తాజాగా మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తుండడంతో, కేసీఆర్ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది..
మే 26న మోడీ హైదరాబాద్ కు రావడం ఖరారైంది. కేసీఆర్ అదేరోజు బెంగుళూరు పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీని కలిసే ఉద్దేశ్యం లేనందుకే, కేసీఆర్ బెంగుళూరు టూర్ పెట్టుకున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. గతంలో మాదిరిగానే మోడీని రిసీవ్ చేసుకునేందుకు, క్యాబినెట్ మినిస్టర్ ను పంపుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మోడీ హైదరాబాద్, కేసీఆర్ బెంగుళూరు పర్యటన యాదృచ్చికంగా జరుగుతోందా…లేక ప్లాన్ ప్రకారమే అంతా అవుతుందా అన్న చర్చ వాడివేడిగా సాగుతోంది
మొత్తంగా మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై చర్చకు దారి తీసే అవకాశం ఉంది.