ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు అమ్మాలన్న ఏపీ ప్రభుత్వం ఆలోచన వెనక ఉద్దేశం ఏంటి? ఈ ప్రతిపాదన ఎవరు చేశారు? దీనివల్ల సర్కార్‌కు కలిగే ఉపయోగం ఏంటి? చిత్ర పరిశ్రమకు ఎలాంటి మెసేజ్ పంపారు?
ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మడంపై చర్చ!
సినిమా టికెట్ల బుకింగ్‌కు సంబంధించి.. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆన్‌లైన్ విధానంలో ఒక ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని చూస్తోంది. ప్రభుత్వమే సొంత పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అమ్మాలన్నది నిర్ణయం. ఓ కమిటీని వేసి.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆన్‌లైన్ టిక్కెట్లను ఏ విధంగా అమ్మాలి? పోర్టల్ విధి విధానాలు ఏవిధంగా ఉండాలన్న దానిపై గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అయితే ప్రభుత్వమేంటి? సినిమా టిక్కెట్లను అమ్మడం ఏంటి? అనే ప్రశ్నలు చర్చల్లోకి వస్తున్నాయి.
ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ?
సినిమా టిక్కెట్లు అమ్మితే ప్రభుత్వానికి వచ్చే లాభమేంటి? ఖజానాకు ఆదాయం పెరుగుతుందా? అక్కర్లేని తలనొప్పిని నెత్తిన పెట్టుకోవడంవల్ల లబ్ధి ఉంటుందా? అంటే కచ్చితంగా లాభం ఉంటుందని అనుకుంటున్నారట. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతల సినిమాలు విడుదలైతే.. టికెట్ల రేట్లను పెంచేస్తున్నారు. వాటికి చెక్ పెట్టాలంటే కచ్చితంగా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకం పోర్టల్ ప్రభుత్వం చేతుల్లో ఉంటేనే బెటరనే అభిప్రాయం వ్యక్తమైందట.
ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్న పోర్టళ్ల ఆఫీసులు ఏపీలో లేవు!
పన్ను ఎగవేత అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆన్‌లైన్ మార్గంలో వివిధ యాప్‌ల ద్వారా టిక్కెట్లు అమ్ముతున్నారు. ఇలాంటి యాప్‌లు.. పోర్టళ్ల మెయిన్ ఆఫీసులు ఎక్కడో ఉంటాయి. వాటి హెడ్ ఆఫీస్‌లు ఏపీలో ఉండవు. పైగా ఆ పోర్టళ్ల వ్యాపారానికి ఏపీలోని సినిమా థియేటర్లు ఉపయోగపడుతున్నాయి. ఆ పోర్టళ్ల నుంచి రాష్ట్రానికి పన్ను రూపంలో పైసా ఆదాయం రావడం లేదు. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల్లో కొంతకాలంగా చర్చ జరుగుతోందట. ఏపీ నుంచే కార్యకలాపాలు సాగించాలని ఆయా పోర్టళ్లను కోరినా స్పందన లేదట. దీంతో సర్కార్ నేరుగా రంగంలోకి దిగినట్టు సమాచారం.
సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తారా?
ఏ రోజుకా రోజే సొమ్ములు జమ చేస్తారట!
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ద్వారా వచ్చే కమీషన్ ఎక్కువగా ఉంటుంది. నెల నెలా కోట్లల్లోనే టర్నోవర్ ఉంటుంది. వీటిపై వచ్చే కమీషన్ రాష్ట్ర ఖజానాకే వస్తే మేలని అనుకుంటున్నారట. పైగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ముందు.. కచ్చితంగా సినీ పెద్దలతో, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడతారని సమాచారం. ఎప్పటికప్పుడు… ఏ రోజుకా రోజే సినిమా టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును సంబంధిత సంస్థలు.. వ్యక్తుల ఖాతాలకు జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయట. అయితే ఇది సున్నితమైన అంశం. ఏ మాత్రం పొరపాట్లు జరిగినా.. విమర్శలు తప్పవు. చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మహేష్‌బాబు వంటి బిగ్ స్టార్స్ సినిమాల టికెట్లు అమ్మే విషయంలో ఏదైనా తేడా వస్తే రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంటుంది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ ఊరుకోరు.
అపోహలకు చెక్ పెట్టక తప్పదు!
సినిమా టికెట్ల అమ్మకం ద్వారా వచ్చని సొమ్ములను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మళ్లించి.. ఎప్పుడో గానీ రిటర్న్ చేయరనే ప్రచారం మొదలైంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మరి.. సినీ వర్గాలను ప్రభుత్వం ఏ విధంగా ఒప్పిస్తుందో.. సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించిన కథ, స్క్రీన్ ప్లేను ఏ విధంగా సిద్ధం చేస్తుందో చూడాలి.