Off The Record: ఆ జిల్లా అధికార పార్టీలో అంతా రివర్స్ గేర్‌లో ఉందట వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరిగిపోతున్నాయి. అయినాసరే… ఆపే దిక్కు లేదు. పైగా కీలక నాయకులు కీచులాటలతో… పోతేపోనీ అని వదిలేశారట. నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య నాయకుడు పథకం ప్రకారం ముందు ద్వితీయ శ్రేణిని కారెక్కించి తర్వాత తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారా? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏంటా వలసల కహానీ?
Read Also: Off The Record: కవిత అక్కడ నుంచే సొంత రాజకీయ యాత్ర మొదలవుతుందా..?
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి-మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య వర్గపోరుతో ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్రంగా నలిగి పోతున్నారట. పోచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరికను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఓ గ్రూపు కట్టారు. ఫలితంగా ఇద్దరి మధ్య వివాదాలు తారా స్దాయికి చేరాయి. అధిష్ఠానానికి పరస్పరం ఫిర్యాదు సైతం చేసుకున్నారు. కానీ… ఎమ్మెల్యేనే సుప్రీం అని పార్టీ పెద్దలు సూచించడంతో రవీందర్ రెడ్డి వెనక్కి తగ్గారు. దీంతో ఆయన వర్గీయులుగా ఉన్న కట్టర్ కాంగ్రెస్ నేతలు, గతంలో పోచారంతో కాంగ్రెస్ గూటికి వచ్చిన ఆయన అనుచరులు కొందరు ఇప్పుడు ఒక్కొక్కరుగా అధికార పార్టీని వదిలి.. గులాబీ గూటికి చేరుతున్నారు. ఇటీవలే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బాన్సువాడ మాజీ జడ్పీటీసీ అంజిరెడ్డి, వర్ని మండల సీనియర్ నేత, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాస్, కోటగిరి మాజీ ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాస్ సహా చాలా మంది తమ అనుచరులతో సహా గులాబీ కండువా కప్పుకున్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
అయితే, పోచారం అనుచరులతో పాటు రవీందర్ రెడ్డి వర్గీయులు సైతం.. పార్టీని వీడుతుండటం హస్తం పార్టీని ఆందోళనకు గురిచేస్తోందట. పోతే పోనీ అనే రీతిలో అధికార పార్టీ… వలసలను అడ్డుకోలేకపోతోందనే టాక్ నడుస్తోంది సెగ్మెంట్ లో. ఎమ్మెల్యే పోచారం పార్టీ వదిలి వెళ్ళడాన్ని గులాబీ అధిష్టానం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోందట. అందుకే ఆయన్ను టార్గెట్ చేసి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్టు తెలిసింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఇన్ఛార్జ్‌గా నియమించింది. బాన్సువాడలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ.. ప్రచారం ముమ్మరం చేసిందట గులాబీ పార్టీ.. పైగా పోచారం అత్యంత సన్నిహితులు, రవీందర్ రెడ్డి అనుచరులను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు కాంగ్రెస్ కేడర్ మాత్రం ఇద్దరు పెద్దల మధ్యన నలిగిపోతున్నట్టు చెబుతున్నారు. ఈ గందరగోళం నడుమే.. స్థానిక సంస్ధల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు స్వాధీనం చేసుకోవాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తుంటే.. బీఆర్‌ఎస్ కూడా దీటుగా పావులు కదుపుతోందట.
Read Also: Bengaluru: భారీ గుంతలో పడిన స్కూల్ బస్సు… తృటిలో తప్పిన పెన ప్రమాదం
ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే.. గులాబీ పార్టీ ఫోకస్ అంతా.. బాన్సువాడపైనే పెట్టినట్టు చెబుతున్నారు. ఓవైపు అలా పార్టీకి నష్టం జరుగుతున్నా.. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం క్యాడర్ లో భరోసా కల్పించే ప్రయత్నం చేయడం లేదంటున్నారు. పార్టీ నుంచి వలసల వెనుక ఓ నేత ఉన్నారట. ముందు ద్వితీయ శ్రేణి నేతలను పంపి.. కీలక సమయంలో ఆయన సైతం జంప్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. స్దానిక సంస్ధల ఎన్నికల తరుణంలో చేరికలు గులాబీకి కొత్త ఉత్సాహం ఇస్తుంటే… అధికార పార్టీ మాత్రం ఇంకా చూద్దాం చేద్దాం అనే రీతిలో వ్యవహారిస్తోంది. వలసలకు అడ్డుకట్ట వేయాలని, ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే చేతులు కలిసేలా చేయాలని కోరుతున్నాయి కట్టర్ కాంగ్రెస్ శ్రేణులు… బాన్సువాడ పై హస్తం ఫోకస్ చేస్తుందా.. లేదా వేచి చూడాలి.