అక్కడ అధికారపార్టీలో గ్రూపుల గోల ఎక్కువైంది. ఎవరిని కదిలించినా ఎదో ఒకవర్గం అనే మాట గట్టిగానే వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. పార్టీలోని నాయకులు వేస్తున్న ఎత్తుగడలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం?
చిత్తూరు వైసీపీలో మూడుముక్కలాట..!
చిత్తూరు వైసీపీలో అంతా కలిసి ఉన్నట్టు కనిపిస్తారు కానీ.. ఎవరి కుంపటి వాళ్లదే. జిల్లాలో ఓ రేంజ్‌లో గ్రూపులు ఉన్న నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడ వైసీపీ నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఆయన పీఆర్పీ నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం భారీ మెజారిటీతో గెలిచారు ఆరణి. ఎమ్మెల్యేగా ఆయన ఏ పని చేద్దామన్నా.. పార్టీలోని వర్గాలు బ్రేక్‌లు వేస్తున్నాయట. ఆరణి వైరివర్గాలకు పార్టీలోని కొందరు సపోర్ట్ చేస్తుండటంతో మూడుముక్కలాటలా మారిపోయింది నియోజకవర్గంలోని అధికారపార్టీ పరిస్థితి.
అవకాశం చిక్కితే బలప్రదర్శనకు దిగుతున్న నేతలు..!
చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా అనుచరులు ఉన్నారు. ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ విజయానందరెడ్డి, పార్టీ నేత బుల్లెట్ సురేష్‌లు మంత్రి అనుచరులుగా హడావిడి చేస్తుంటారు. 2019 ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో వీరిద్దరూ ఆరణి శ్రీనివాసులు గెలుపుకోసం పనిచేసినా.. తర్వాత ఎమ్మెల్యేతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. చీమ చిటుక్కుమన్నా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళమెత్తే పరిస్థితి ఉంది. అవకాశం చిక్కితే బలప్రదర్శనకు కూడా దిగుతున్నారు.
నిత్యం ఏదో ఒక అంశంపై మాటల తూటాలు..!
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంపకంలో వైసీపీ నేతల మధ్య తేడాలొచ్చాయి. ఆ గొడవలు ఇప్పుడు పీక్‌కు చేరినట్టు టాక్. పార్టీకోసం కష్టపడిన వారికి కాకుండా.. ఓ వర్గానికే ఎమ్మెల్యే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు మంత్రి అనుచరులు. ఈ ఆరోపణలకు గట్టిగానే కౌంటర్ వేశారు ఎమ్మెల్యే ఆరణి. అంతా అధికారపార్టీ నేతలే అయినా.. నిత్యం ఏదో ఒక అంశంపై మాటల తూటాలు పేల్చుకోవడం కామనైపోయింది.
స్థానిక ప్రజాప్రతినిధులు, కేడర్ మధ్యా చీలిక..!
ఈ వర్గపోరు కారణంగా సమస్య పరిష్కారం కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో కేడర్‌కు అర్థం కావడం లేదట. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే ఆరణి మనిషిగా ముద్ర వేస్తున్నారట మంత్రి అనుచరులు. కాదూ.. విజయానంద్ లేదా బుల్లెట్ సురేష్ దగ్గరకు వెళ్తే ఎదుటిపక్షం సందేహించే పరిస్థితి. ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పదవి వచ్చాక విజయానందరెడ్డి దూకుడు పెంచి.. మంత్రి పెద్దిరెడ్డితో తాను ఉన్న ఫొటోలతో నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలు నింపేశారు. ఈ చర్య ఎమ్మెల్యే వర్గానికి రుచించ లేదని సమాచారం. చిత్తూరుకు సంబంధించిన ఫైల్ వస్తే ప్రభుత్వ అధికారులు ఎటూ తేల్చడం లేదట. ఈ వర్గపోరు క్షేత్రస్థాయిలోని ప్రజాప్రతినిధులు, కేడర్ మధ్యా చీలిక తెచ్చినట్టు సమాచారం. ఒకరినొకరు ప్రత్యర్థులుగా చూసుకుంటున్నారట. మరి.. సమస్య శ్రుతిమించకుండా గ్రూపుల గోలకు మంత్రి పెద్దిరెడ్డి చెక్ పెడతారో లేక తాడేపల్లి వర్గాలే సయోధ్య కుదురుస్తాయో చూడాలి.