ఆయన రాజకీయాలకు కొత్త. గెలిచాం కదా..! అంతా నాదే.. నేను చెప్పిందే ఫైనల్ అనుకున్నట్టున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వాళ్లను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. అది ఓల్డ్ బ్యాచ్‌కు చిర్రెత్తించింది. ఇంకేం ఉంది గ్రూపు కట్టేశారు. సమావేశాలు పెట్టేస్తున్నారు. ఇది ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందట.
రాజకీయాల్లో ఓనమాలు తెలియని తీరే ఎసరు పెట్టేలా ఉందా?
గుంటూరు జిల్లా పెదకూరపాడు వైసీపీలో గ్రూపు రాజకీయాలు మరింత ముదిరాయి. స్థానిక నేతల మధ్య విభేదాలు పీక్‌కు చేరాయి. పెదకూరపాడు నుంచి గత ఎన్నికల్లో నంబూరు శంకర్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. శంకర్రావు రాజకీయాలకు కొత్త. అందరిని సమన్వయం చేసుకునే అనుభవం లేదు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని ఎమ్మెల్యే తీరు.. ఇప్పుడు ఆయనకే ఎసరు పెట్టేలా మారింది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారితోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి మధ్య విభేదాలు ఉన్నా తర్వాత అంతా సర్దుకుంటుందని భావించారు. కానీ.. ఎమ్మెల్యే కొత్తగా పక్కపార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి మింగుడు పడటం లేదట. దీనికి తోడు ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడు ఆయన్ను పక్కదారి పట్టిస్తున్నారని సొంతపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఐదు మండలాల్లో గ్రూపులుగా విడిపోయిన నేతలు
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ నేతలంతా గ్రూపులుగా విడిపోయారు. పెదకూరపాడు, అచ్చెంపేట, బెల్లంకొండ, క్రోసూరుల్లో రెండు గ్రూపులు.. అమరావతిలో మూడు గ్రూపులు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే శంకర్రావు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గ్రామాలు, మండలాల్లో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియని పరిస్థితి ఏర్పడిందని స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది గతంలోనే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కూడా. ఎమ్మెల్యేతోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే మరో నాయకుడిపైనా పార్టీలకు ఫిర్యాదు చేశారట.
విందు పేరుతో సమావేశం కావడంతో కలకలం
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీలో గ్రూపు రాజకీయాలు ఇంకా ఎక్కువయ్యాయి. బెల్లంకొండ మండలానికి చెందిన కొందరు నేతలు చండ్రాజుపాలెం సమీపంలోని మామిడితోటలో సమావేశమయ్యారు. వైసీపీలో మొదటినుంచి ఉన్న నేతలతోపాటు స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. విందు పేరుతో వీరంతా సమావేశం కావడం కలకలం సృష్టించింది. విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో.. సమావేశంలో పాల్గొన్న కొందరికి ఫోన్లు వెళ్లాయట. వారం రోజుల్లో అంతా సర్దుబాటు చేసుకుందామని.. ఇలాంటి సమావేశాలు పెట్టొద్దని ఫోన్‌లోనే కోరారట. అయితే తామంతా కేవలం విందుకోసం వచ్చామని అసంతృప్తితో కాదని చెప్పి తప్పించుకున్నారట.
గ్రూపు రాజకీయాలతో ఎమ్మెల్యేకు తలబొప్పి
చండ్రాజుపాలెం సమావేశం గురించి బయటకు రావడంతో మిగతా మండలాల్లో అసమ్మతి నేతలు కూడా ఇదే తరహాలో భేటీలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. దీంతో గ్రూపు రాజకీయాలు.. నేతల మధ్య విభేదాలతో ఎమ్మెల్యేకు తలబొప్పి కడుతోందట. ఎవరికీ సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారట శంకర్రావు. అసమ్మతి నేతలు మాత్రం తగ్గేదే లేదన్నట్టు పార్టీ పెద్దలను కలిసే ప్లాన్‌లో ఉన్నట్టు టాక్. మరి.. పెదకూరపాడు వైసీపీ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
.