మంత్రి లక్ష్యంగా ఆ జిల్లాలో బీజేపీ పావులు కదుపుతోందా? సీబీఐ గట్టిగానే ఉచ్చు బిగిస్తోందా? వందల కోట్ల స్కామ్ కావడంతో అంతా ఉలిక్కి పడుతున్నారా? మంత్రి విషయంలో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొందా?
గ్రానైట్ కేసులో మంత్రి గంగుల ఇరుక్కున్నట్టేనా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 350కిపైగా గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో అత్యధికం రాజకీయ నేతలవే. వారిలో ఒకరు మంత్రి గంగుల కమలాకర్. ఆయన ఆధ్వర్యంలోనూ కొన్ని గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. 2012లో జరిగిన స్కామ్‌పై సీబీఐ లేటెస్ట్‌గా ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి రాజుకుంది. మంత్రి కమలాకర్ పరిస్థితి ఏంటి? ఆయన కేసులో పూర్తిగా ఇరుక్కున్నట్టేనా? అని రకరకాల ప్రశ్నలు షికారు చేస్తున్నాయి.
బీజేపీ నేతల ఫిర్యాదుతో రంగంలోకి సీబీఐ
2011-2013 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల నుంచి వేల కోట్లలో గ్రానైట్ ఎగుమతలు జరిగాయి. దొంగ లెక్కలతో సరుకు ఎగుమతి చేసి షిప్పింగ్ ఏజెన్సీలు వందల కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఈ రెండు పోర్టుల నుంచి లక్షల టన్నుల గ్రానైట్ రాయి విదేశాలకు ఎగుమతైంది. అక్రమాలను అప్పట్లోనే గుర్తించిన విజిలెన్స్ అధికారులు భారీ జరిమానా విధించారు. ప్రభుత్వానికి దాదాపు 750 కోట్లు చెల్లించాలని ఆనాటి ఉత్తర్వుల్లో ఉంది. ఆ నాటి కేసుకు సంబంధించి బీజేపీ నేతలు గత ఏడాది నవంబర్‌లో CBIకి ఫిర్యాదు చేయడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసులో చాలా సంస్థలు ఉన్నా.. మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగానే చర్యలు ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
నోటీసులు రావడంతో కలకలం
ఢిల్లీ సీబీఐ నుంచి వచ్చిన ఆదేశాలతో విశాఖపట్నంలోని CBI ఏసీబీ విభాగం మూడు వారాల క్రితం మైనింగ్ కంపెనీలు.. షిప్పింగ్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చాయి. ఎంత సరుకు పోర్టుల నుంచి ఎగుమతి చేశారు? పర్మిట్లు ఉన్నాయా? అపరాధ రుసుం ఎందుకు చెల్లించలేదు? వంటి ప్రశ్నలు ఆ నోటీసులో ఉన్నాయట. దీంతో అలజడి మొదలైంది. మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్టు టాక్. హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం సమయంలోనూ గ్రానైట్ ప్రకంపనలు రేగాయి. ఇప్పుడు నోటీసుల వరకు రావడంతో నెక్స్ట్ ఏంటనే ఆసక్తి నెలకొంది.
గంగులకు ఇతర గ్రానైట్ యజమానులకు గ్యాప్
తాజా ఎపిసోడ్‌పై మంత్రి గంగుల తనకేం కాదనే ధీమాతో ఉన్నారట. రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారనేది మంత్రి ఆరోపణ. అయితే సీబీఐ నోటీసులపై అధికారపార్టీలోనూ చర్చ మొదలైందట. గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న వర్గ విభేదాల వల్లే సమస్య ఇంత వరకు వచ్చిందన్నది మరికొందరి వాదన. మంత్రి గంగుల కుటుంబీకులకు ఇతర గ్రానైట్ సంస్థల యాజమాన్యాలకు గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సమస్య మంత్రి గంగులకు తలనొప్పిగా మారినట్టు చెబుతున్నారు. మరి.. ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.