ప్రత్యర్థులతో పోరాడాల్సిన బీజేపీ నాయకులు.. తమలో తామే కుమ్ములాడుకుంటున్నారా? ఎంపీ.. మాజీ ఎమ్మెల్యేల మధ్య బస్తీమే సవాల్ అనేవిధంగా పరిణామాలు నెలకొన్నాయా? బహిష్కరణలు.. కేసులు వరకు సమస్య వెళ్లిందా? ఎవరా నాయకులు?
ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్
నిజామాబాద్ జిల్లాలో బలంగా ఉన్నామని బీజేపీ నాయకులు చెబుతున్నా.. అక్కడ పార్టీలో నెలకొన్న విభేదాలు క్రమంగా రోడ్డున పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు అవి బయట పడకుండా మ్యానేజ్ చేసినా.. ప్రస్తుతం బస్తీమే సవాల్ అనే వరకు వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆ పార్టీ ఎంపీ మధ్య జరుగుతున్న విభేదాలు కాషాయ శిబిరంలో ప్రస్తుతం హాట్ టాపిక్.
యెండల వర్గానికి చెందిన నేతపై వేధింపుల కేసు
బీజేపీలో రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న నిజామబాద్ నేత ప్రసాద్ పటేల్‌పై ఇటీవల నమోదైన పోలీస్ కేసు పొలిటికల్ చర్చకు దారితీసింది. ప్రసాద్ వేధిస్తున్నారనే ఒక మహిళ ఫిర్యాదుపై.. చివరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యెండల వర్గానికి చెందిన ప్రసాద్‌పై నమోదైన కేసు వెనక కుట్ర జరిగిందనేది ఒక ఆరోపణ. కొందరు బీజేపీ నాయకులే ఆ మహిళతో కేసు పెట్టించినట్టు యెండల అండ్ కో అనుమానిస్తోంది. న్యాయం కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్, బీజేపీ రాష్ట్ర నాయకుల దగ్గరకు వెళ్తున్నారు మాజీ ఎమ్మెల్యే.
తాడోపేడో తేల్చుకుంటామని యెండల వర్గం ప్రకటన
గతంలోనూ బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ స్థాయిలో రచ్చకెక్కలేదు. ఆ మధ్య ఆలయాల పరిరక్షణ పేరుతో పార్టీ నేత ఒకరు ర్యాలీ తీశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం బీజేపీలోని మరో వర్గానికి లేదట. అది కాస్తా రచ్చ అయింది. పార్టీలో బీఫామ్‌లు అమ్ముకున్నారని యెండల పార్టీలోని ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే వైఖరి కొనసాగించి.. తన వర్గాన్ని బలహీన పరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే. అవసరమైతే తాడోపేడో తేల్చుకుంటామని.. ఎన్నికల్లో పోటాపోటీగా బరిలో దిగుతామని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.
యెండలపై కత్తులు నూరుతున్న ఎంపీ వర్గం
మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వర్గం దూకుడు చూశాక.. పార్టీ ఎంపీ వర్గం కూడా కత్తులు నూరుతోందట. కేసులు, కార్యక్రమాలను ఏకపక్షంగా నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని పేరు చెప్పకుండా హెచ్చరిస్తోంది. చినికి చినికి గాలివానలా సమస్య మారడంతో విషయం పార్టీ పెద్దల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఒకరేమో పార్టీ సిట్టింగ్ ఎంపీ.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరూ కావాల్సిన వాళ్లే. ఒకే సామాజికవర్గం నేతలు కావడంతో.. సర్దిచెప్పడానికి తల ప్రాణం తోకకు వస్తోందట. చివరకు బండి సంజయ్ సైతం ఓ నేతను బుజ్జగించినట్టు సమాచారం. అయితే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు రానున్న రోజుల్లో ఏవిధంగా బరస్ట్ అవుతాయో అని కమలనాథులు ఆందోళన చెందుతున్నారట.