Off The Record: సీటు కింద సెగ తగిలేసరికి ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ అజ్ఞాతం నుంచి బయటికి వచ్చారా? ఇప్పట్లో బయట కనిపించడని అనుకున్న నాయకుడు ఉన్నట్టుండి వైసీపీ వేదికల మీద ప్రత్యక్షం అవడం, ఎక్స్‌లో పోస్ట్‌లతో చెలరేగడం వెనకున్న రీజన్ ఏంటి? అధికారిక హోదా ఎలాగూ లేదు… కనీసం పార్టీ పోస్ట్ కూడా దక్కకుండా పోతుందన్న భయమా? ఎవరా లీడర్? ఏంటా లేటెస్ట్ హాట్?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ…పార్టీని రీ సెట్ చేసే పనిలో సీరియస్‌గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ… భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతుండటంతో… మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట. ఈ క్రమంలోనే… మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇటీవలి కాలంలో బయట కనిపిస్తున్నారన్నది పార్టీ వర్గాల సమాచారం. మాచర్లలో నాలుగు సార్లు గెలిచిన పిన్నెల్లి…. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్ళు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆయనపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ఈవీఎం ధ్వంసం లాంటి కేసులు నమోదు కావడం, జైలుకు వెళ్ళడం లాంటి కారణాలతో… చాన్నాళ్ళ నుంచి మాచర్లకు దూరంగా.. హైదరాబాద్, బెంగళూరుకే పరిమితం అయినట్టు తెలుస్తోంది.
కానీ, ఇప్పుడాయన ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై పెడుతున్న పోస్ట్‌లు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. బటన్ నొక్కడంపై ఆయన పెట్టిన ఎక్స్ మెస్సేజ్ వైరల్ అవుతోంది. ముసలమ్మ.. ముసలమ్మ ఎక్కడ ఉన్నావే… ఇక్కడ బటన్ నొక్కలేపోతున్నాడు కాస్త వచ్చి బట్టన్ నొక్కరాదే.. అంటూ ఎక్స్ పోస్ట్ చేశారు పిన్నెల్లి. సీఎం చంద్రబాబు గతంలో బటన్ నొక్కడం పెద్ద కష్టమా.. మంచం మీదున్న ముసలమ్మ కూడా నొక్కుతుందన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఆయన ఈ మెసేజ్ పెట్టారన్నది విస్తృతాభిప్రాయం. దాంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలో కల్పించిన పని దినాల్ని, తమ హయాంలో కల్పించిన పని దినాలతో పోలుస్తూ సర్కార్‌ని ప్రశ్నించారు. ఆ పోలికతో జగన్ సర్కార్ గొప్పగా చేసిందని చెప్పుకునే ప్రయత్నం చేశారు పిన్నెల్లి. ఈ వైఖరి మీదే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. నిన్న మొన్నటి దాకా కామ్‌గా ఉన్న, అసలు ఎక్కుడున్నాడో కూడా తెలియని నాయకులు ఇప్పుడు ఉన్నట్టుండి… ఇలా సోషల్ మీడియాలో ఎందుకు చెలరేగుతున్నారంటే… భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక, జగన్ ఇచ్చిన భరోసాతో… రీఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే…ఇక దూకుడు పెంచబోతున్నారన్నది కొందరి వాదన. మరికొందరైతే అంత లేదమ్మా… బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ వేరే ఉందని అంటున్నారట. సీటు కింద సెగ తగిలేసరికి ఆయనకు సోషల్ మీడియా పోస్ట్‌లు గుర్తుకు వచ్చాయంటూ గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు పిన్నెల్లి. ప్రస్తుతం ఆయన పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో… అందుబాటులో లేని వ్యక్తికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు? ఆయన స్థానంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ మొదలైందట పల్నాడు వైసీపీ వర్గాల్లో. ఈ విషయం తెలుసుకుని… ఎక్కడ పార్టీ పదవి కూడా ఊడుతుందోనన్న కంగారుతో పిన్నెల్లి ఎక్స్‌లోకి ఎక్కేశారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఆ క్రమంలోనే…వరుసగా పలుమార్లు సెంట్రల్ ఆఫీస్‌లో జగన్‌తో భేటీ అయ్యారట మాజీ ఎమ్మెల్యే. అనంతరం పల్నాడు జిల్లాలో జరుగుతున్న అన్ని పార్టీ కార్యక్రమాలు హాజరవుతూ…తాజాగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా వైసీపీ నేతల సమావేశంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసినట్టు చెప్పుకుంటున్నారు. కారణం ఏదైతేనేం… పిన్నెల్లి పూర్తిగా యాక్టివ్ అయ్యారా? లేక ఇది తాత్కాలికమా అన్న సంగతి తేలాలంటే… ఇంకొన్నాళ్ళు వేచి చూడాలంటున్నారు పరిశీలకులు. చూడాలి మరి పల్నాడు వైసీపీ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో.