కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువ. అలాంటి పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా.. మహేష్‌గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను మహేష్‌గౌడే పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు బీసీ నేతలు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ సఖ్యత లేదు. నిత్యం కయ్యమే. గాంధీభవన్‌లో ఇద్దరు గౌడ్‌లు కలిశారంటే.. ఉప్పు నిప్పులా ఉంటారు. అసలు ఈ ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది అనేది ఎవరికీ అంతుచిక్కదు.
ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీకి గాంధీభవన్‌లో ప్రత్యేక రూమ్ కావాలని అప్పట్లో పంచాయితీ జరిగింది. చివరకు ఉన్న గదుల్లోనే సర్దాల్సి వచ్చిందని చెబుతున్నారు మహేష్‌గౌడ్. AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డికి, మధుయాష్కీకి ఒకే రూమ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు గౌడ్‌ల వైరం ఢిల్లీకీ చేరింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో పంచాయితీ అయింది. హస్తినలో రాహుల్‌గాంధీ నిర్వహించిన సమావేశంలోనూ మహేష్‌గౌడ్, మధుయాష్కీలు పరస్పరం కామెంట్స్ చేసుకున్నారు. ఒక్కరోజు కూడా జిల్లాకు రానివారికి పదవులు ఎందుకు… ఒక్కరికే రెండు పదవులు ఎందుకు అంటూ రాహుల్ ఎదుటే ప్రశ్నలు సంధించుకున్నారు నేతలు. చివరకు అన్నీ సర్దుకుని పనిచేయాలని హితవు పలికి పంపారు పార్టీ అగ్రనేత. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ లొల్లి తప్పలేదట. వాళ్ల మధ్య తగువులోకి AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను లాగడంతో సమావేశం హీటెక్కినట్టు చెబుతున్నారు.
ఇటీవల నిజామాబాద్ జిల్లా నాయకులు మధుయాష్కీ మాకు వద్దు అంటూ తీర్మానం చేశారు. అలా తీర్మానం ఎలా చేస్తారు అని మధుయాష్కీ… మహేష్‌గౌడ్‌ల మధ్య గొడవ జరిగిందట. ఆ సందర్భంగానే ఈ వివాదంలోకి ఠాగూర్‌ను లాగారట యాష్కీ. ఆ ప్రస్తావన తేగానే మీటింగ్ వాతావరణం మారిపోయినట్టు చెబుతున్నారు. ప్రచారకమిటీకి పని విభజన చేయాలని యాష్కీ అడిగారట. ఆ పాయింట్‌కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మద్దతు పలికినట్టు సమాచారం. అయితే పని విభజన చేసి.. పని చెప్పడానికి ఫండ్ ఎక్కడిది అని మహేష్‌గౌడ్ ఎదురు ప్రశ్నలు వేశారట. ప్లానింగ్.. ఫండ్ లేకుండా పని విభజన ఏంటని అనడంతో చర్చ కొంత సద్దుమణిగింది. ఆ తర్వాత అనుబంధ సంఘాల పోస్టింగ్‌లకు మహేష్‌కి సంబంధం ఏంటని ప్రశ్నించారట యాష్కీ. అనుబంధ సంఘాలు పార్టీలో అంతర్భాగమని.. వాటి బాధ్యత కూడా పీసీసీపైనే ఉందన్న మహేష్‌గౌడ్.. పీసీసీ అనుమతి లేకుండా ఎవరికీ పోస్టింగ్‌లు ఇవ్వడం లేదని బదులిచ్చారట. ఇలా ఇద్దరి మధ్య వాడీవేడీ వాగ్యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మధుయాష్కీ, మహేష్‌గౌడ్ ఇద్దరూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులే. ఒకరంటే ఒకరికి పడదు. ఈ వైరం ఎంత వరకు వెళ్తుంది.. ఎన్నాళ్లిలా వైరిపక్షాల్లా ఉంటారో పార్టీ వర్గాలకు అర్థం కాని పరిస్థితి. ఆది అంతాలు తెలియని నేతల విభేదాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.