Telangana Congress : రాహుల్‌గాంధీ కంటే.. ప్రియాంకనే బెటర్ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారా? పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పోవాలన్న రాహుల్ వ్యాఖ్యలు సీనియర్ల చెవుల్లో ఇంకా మార్మోగుతున్నాయా? వాళ్లంతా ప్రియాంక మాటలతో చల్లబడ్డారా లేదా? ప్రస్తుతం బంతి రేవంత్ కోర్టులోకి వెళ్లిందా? లెట్స్ వాచ్..!
తెలంగాణ కాంగ్రెస్‌లో అందరూ సీనియర్లే. వారితో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇబ్బంది పడుతున్నారా..? లేక రేవంత్ తీరు సీనియర్ నేతలకు రుచించడం లేదా? ప్రియాంక గాంధీ సమక్షంలో జరిగిన పంచాయితీలో పార్టీ నేతలు ఎవరేం చెప్పారు? టీ కాంగ్రెస్‌లో ఆసక్తి కలిగిస్తున్న అంశం ఇదే.
వరంగల్ సభలో రాహుల్ గాంధీ… పార్టీ నిర్ణయం ఫైనల్… ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి… వెళ్లిపోతే వెళ్లిపోండనే స్టేట్‌మెంట్ ఇచ్చారు. దానిపై చాలామంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రియాంక మీటింగ్ తర్వాత నాయకులంతా హ్యాపీగా ఉన్నారట. దాంతో వారంతా పార్టీపై రణం ఆపేసినట్టేనా? కలిసి పని చేస్తారా? అనే చర్చ మొదలైంది. ప్రియాంక అందరి అభిప్రాయాలను ఓపిగ్గా విన్నారట. మీరంతా 34 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నారు.. మీరు లేకపోతే పార్టీ ఎక్కడిది? అవకాశాలు వస్తాయి? అలాగే ప్రయోగాలు ఉంటాయి. కలిసి పనిచేయడమే ముఖ్యం అని సమావేశంలో ఉన్నవారికి ప్రియాంక స్పష్టం చేశారట. సీనియర్ నేతలను ఆకాశానికి ఎత్తేశాలా మాట్లాడంతో అంతా సంతోషించారట. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్‌ను న్యూట్రల్‌గా ఉండాలని సూచించారట. అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని కాస్త మందలింపు ధోరణిలోనే చెప్పారట. సీనియర్లను కలుపుకొని వెళ్లాలని పీసీసీ చీఫ్ రేవంత్‌కు కూడా సుతిమెత్తంగా చెప్పారట ప్రియాంక. ఇబ్బందులు వస్తే హైకమాండ్‌కు చెప్పాలని హితవు పలికారట.
యూపీలో తాను కొన్ని ప్రయోగాలు చేశానని.. అందులో కొన్ని వర్కువుట్ అవుతాయని తెలిపారట ప్రియాంక. అలాగే సీనియర్స్ విషయంలో కొన్ని అనుభవాలు ఎదురైనట్టు వివరించారట. సీనియర్ల సేవలు.. అనుభవాలు పార్టీకి ఎంతో మేలు చేస్తాయని వెల్లడించారట. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదట సిఎల్పీ నేత భట్టికి మాట్లాడే అవకాశం ఇచ్చారట ప్రియాంక. ఆ తర్వాత అందరూ పార్టీలో తమకు ఉన్న సమస్యలు చెప్పినట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా సమయం కేటాయించి సర్ది చెప్పడంతో అంతా కూలైనట్టు సమాచారం. జరిగిందేదో జరిగింది.. పాత గొడవలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని చెప్పారట ప్రియాంక.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్‌పై కేసీ వేణుగోపాల్ ఫోకస్ చేశారట. జిల్లాలో సీనియర్ నేత… మాస్ ఫాలోయింగ్ ఉన్న కోమటిరెడ్డిని కలుపుకొని పోవాలని ఠాగూర్‌కు సూచించారట. జిల్లాలో అంతా సీనియర్లు కావడంతో.. అందరి అనుభవాలను రంగరించి ఉపఎన్నికకు సిద్ధం కావాలని వెల్లడించారట వేణుగోపాల్. పార్టీ పెద్దలు చెప్పింది బాగానే ఉన్నా.. పీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేస్తారన్నది ప్రస్తుతం ప్రశ్న. అందుకే ఇకపైనా రణం చేస్తారా? పార్టీకి శరణం అంటారా అనే చర్చ సాగుతోందట.