Off The Record: ఆ శాఖలో.. మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అస్సలు పొసగడం లేదా? ఇద్దరి మధ్య ఒక రకంగా కోల్డ్ వార్ నడుస్తోందా? ఇద్దరి వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా ఉందా? మంత్రి ఆదేశించినా ఆ ఐఏఎస్ ఎందుకు మాట వినడం లేదు? మినిస్టర్ చెప్పినట్టల్లా సంతకాలు చేస్తే రేపు తానే ఇరుక్కుంటానని భయపడుతున్నారా? లేక ఇతర ఇగో సమస్యలున్నాయా? ఎవరా ఆఫీసర్? ఆయన మీద సీఎంవోకి ఫిర్యాదు చేసిన మంత్రి ఎవరు?
Read Also: Most-Wanted Terrorists: ఏపీలోని ఆ రెండు జిల్లాల్లో ఉగ్రమూకల కలకలం..
ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో మంత్రికి, ముఖ్య కార్యదర్శికి మధ్య విభేదాలు ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి తీసుకున్న నిర్ణయాలు రూల్స్‌కు అనుగుణంగా ఉంటే…సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విరుద్ధంగా ఉంటే మాత్రం సరైన సలహాలు ఇచ్చి సవరించుకునే విధానాన్ని వివరించాలి. ఇక్కడే మంత్రి కొండా సురేఖకు, తన శాఖ పరిధిలోని ఓ ముఖ్య కార్యదర్శి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. కొన్ని ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి, ముఖ్య కార్యదర్శి మధ్య విభేదాలు ఎంతకీ సమసిపోవడం లేదట. తన నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని మంత్రి పట్టుబడుతుండగా.. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆఫీసర్ పక్కన పెడుతున్నట్టు సమాచారం. ఈ మధ్య ఓ ఫైల్ పై మంత్రి సంతకం చేసినా… అమలు చేయకుండా ఆ ఫైల్‌ను నేరుగా చీఫ్ సెక్రెటరీ ఆమోదం కోసం పంపడం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ పరిధిలోని ఓ శాఖకు చెందిన 29 మందికి ప్రమోషన్ ఇచ్చే విషయంలో.. ఆమెకు, ప్రిన్సిపల్ సెక్రెటరీకి మధ్య విబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన 20 పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు ముఖ్య కార్యదర్శి అనుమతి ఇచ్చారని తెలిసింది. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఫైలును తనకు పంపాలని ఆదేశించినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.
Read Also: Bengaluru: ఎక్ట్రా కప్పు ఇవ్వనందుకు కాఫీ షాప్ సిబ్బందిని చితకబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్
అయితే, బిజినెస్ రూల్స్ ప్రకారం వారికి ప్రమోషన్ ఇచ్చే అధికారం ఆ శాఖ హెచ్ఓడికి మాత్రమే ఉందని, అందుకు మంత్రి ఆమోదం అవసరం లేదని నిర్ణయానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రెటరీ.. ఆ ఫైల్‌ను మంత్రి పేషీకి పంపడం లేదని తెలిసింది. ఇక్కడే ఇద్దరి మధ్య తేడా కొట్టిందని అంటున్నారు. ఆ ఫైల్ తనకు పంపాలని మంత్రి ఒత్తిడి చేయడం, ఆమె దగ్గరకు అవసరం లేదని ఉన్నతాధికారి భావించడంపై సెక్రెటేరియట్ వర్గాల్లో రక రకాల చర్చలు జరుగుతున్నాయి. సురేఖ పరిధిలోని ఓ శాఖకు సంబంధించిన భూమిని కాపాడాల్సిన అధికారి ఒకరు దాన్ని ఇతరులకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారనే కారణంతో… ఆయన మీద చర్యలకు సిఫారసు చేశారు. ఆ సిఫారసులను ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆమోదించి.. మంత్రి అనుమతి కోసం పంపారు. అందుకు ముందు ఓకే చేసిన కొండా సురేఖ…. సదరు ఫైల్‌పై సంతకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ.. ఆ తర్వాత ఓ సహచర మంత్రి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆమె ఆ ఫైల్‌ను వెనక్కి తెప్పించుకున్నారట. రెండోసారి ఫైల్‌తన వద్దకు వచ్చినప్పుడు సదరు అధికారికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వొద్దని నోట్ రాసినట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!
కానీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. ఆ ఫైల్‌ను సీఎస్ ఆమోదం కోసం పంపారని సమాచారం. బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక అంశంపై మంత్రి, సెక్రెటరీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు.. సీఎస్ నిర్ణయానికి పంపడంలో తప్పేమీ లేదని సదరు సీనియర్ ఐఏఎస్ వాదిస్తున్నట్టు తెలిసింది. దీంతో… మంత్రి సురేఖ సదరు ఉన్నతాధికారి మీద నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తన శాఖకు ఆయన ముఖ్య కార్యదర్శిగా వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మూడు పేజీల్లో వివరించినట్లు సమాచారం. తను తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా కొర్రీలు పెట్టడం, ఫైల్స్‌పై చర్చించేందుకు రావాలని పదే పదే ఫోన్ చేసినా.. స్పందించట్లేదని ఫిర్యాదులో పేర్కొనట్లు తెలుస్తోంది. ఆ శాఖ పరిధిలోని ఓ సంస్థలో బీఆర్ఎస్ మద్దతుదారులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది ఉన్నారని, వాళ్ళని తొలగించాలని పలుసార్లు ఆదేశించినా పట్టించుకోలేదని వివరించినట్లు సమాచారం. తెలంగాణ సచివాలయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మొత్తానికి మేటర్ సీఎంవోకి చేరడంతో… ఇప్పుడు పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరికీ సయోధ్య కుదురుస్తారా? లేక ఆ ముఖ్య అధికారిని ఇంకో శాఖకు బదిలీ చేస్తారా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఉద్యోగ వర్గాలు.