తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు కాకతీయ ఉత్సవాలు. వారంపాటు జరిగే వేడుకలకు కాకతీయ రాజుల వారసులను ఆహ్వానించారు. నాటి కాకతీయ రాజుల చరిత్ర నేటి తరానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేసినా.. వేడుకల్లో రాజకీయాలు చొచ్చుకొచ్చాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబురాలను కేవలం ఇద్దరు ముగ్గురు నాయకులకే పరిమితం చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో చర్చగా మారింది. వరంగల్‌లోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకే వేడుకల్ని పరిమితం చేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రాష్ట్రం మొత్తం కాకపోయినా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయినా ఉత్సవాలు చేస్తారని వేసిన అంచనాలు తప్పాయని అనుకుంటున్నారట.
ముగింపు కార్యక్రమాలను రామప్పలో పెట్టడంతో అదొక్కటే ములుగు జిల్లాకు పరిమితం చేశారు. వర్దన్నపేట, పరకాల, స్టేషన్ ఘనపూర్, భూపాలపల్లి నియోజకవర్గాల్లో కాకతీయ కట్టడాలు.. ఆలయాలు ఉన్నప్పటికీ.. ఆ ప్రాంతాల్లో ఎలాంటి సందడి లేదు. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు కాకతీయ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో శిలా శాసనం ఉంది. జనగామ జిల్లాలో అనేక కట్టడాలు ఉన్నాయి. అక్కడ ఉత్సవాలు లేవు.. ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆ ప్రాంతాలకు చెందిన వారికి భాగం కల్పించలేదని అధికారపార్టీ వర్గాల నుంచి వస్తున్న మాట.
ఉమ్మడి జిల్లాలో 11 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. తాజా వేడుకల్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాత్రమే కనిపించారు. మంత్రులుగా సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్ హాజరైన కార్యక్రమాల్లో జిల్లా నేతలకు సరైన ప్రాధాన్యం.. ప్రాతినిథ్యం దక్కలేదట. జిల్లాలో నాయకుల మధ్య ఉన్న విభేదాల ప్రభావం కాకతీయ ఉత్సవాలపై పడ్డాయన్నది కొందరి అభిప్రాయం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలోనూ కొందరి ఫొటోలే వేయడంతో మిగతావాళ్లు నొచ్చుకున్నారట.
ఒకవైపు ఉత్సవాలు జరుగుతుంటే.. ఇదే సమయంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలు తమ ప్రాంతాల్లో గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాల్లో పాల్గొన్నారు. రామప్ప అభివృద్ధికి కృషి చేసిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోందట. వేడుకలకు వెళ్దామని మనసులో ఉన్నా.. ఆహ్వానాలు లేక చాలా మంది ఎమ్మెల్సీలు ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. పిలవని పేరంటానికి వెళ్లడం ఎందుకని గుమ్మం దాట లేదట. ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్‌లు వచ్చినా.. వరంగల్ కోట దగ్గరే కనిపించారు. మొత్తానికి వైభవంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించేలా నేతలు ప్రవర్తించడం ఓరుగల్లు గులాబీ శిబిరంలో చర్చగా మారింది. ఇది వ్యూహమా? లేక వైఫల్యమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.