పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక రాజకీయ రగడగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును ఈ పథకానికి సంబంధించి నియోజకవర్గంలో ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే కావడంతో.. ఆయన రోల్ కీలకంగా మారిపోయింది. దీనిని మంథనిలోని టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట.
కాంగ్రెస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే దళితబంధు ఇప్పిస్తున్నారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో అధికారపార్టీ నేతలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారట. ఈ పథకాన్ని ముందుగా టీఆర్ఎస్ కార్యకర్తలకు వర్తింప చేయాలనే డిమాండ్‌తో అధిష్ఠానం దగ్గరకు వెళ్లాలని నిర్ణయించారట. టీఆర్ఎస్‌వాళ్లకు పథకాన్ని వర్తింప చేయకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని తీర్మానించారట. మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజాప్రతినిధులు మహాముత్తారంలో సమావేశం ఏర్పాటు చేసుకుని మంథని టీఆర్ఎస్ ఇంఛార్జ్ పుట్టా మధు సూచించిన వారికే ఇవ్వాలని కోరారట. పుట్టా మధునే దళితబంధు పథకం అమలుకు ఇంఛార్జ్‌ను చేయాలని విన్నవించారట. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సిద్ధం చేసిన జాబితాను రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారికి కాకుండా టీఆర్ఎస్ ఇంఛార్జులకే దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించారని.. ఒకటి రెండుచోట్ల ఆ మినహాయింపు ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అలాంటి మినహాయింపు మంథనిలో ఇవ్వడంతో గుర్రుగా ఉన్నారు గులాబీ నేతలు. పార్టీనే నమ్ముకుని ఉన్న తమను కాదని వ్యతిరేకంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదో విధంగా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేలా ప్రస్తుతం రాజీనామా అస్త్రాలను బయటకు తీశారు మంథని గులాబీ నేతలు. ఈ పరిణామాలను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు శిబిరం కామ్‌గా గమనిస్తోందట. సరైన సమయంలో స్పందించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి.. దళితబంధు రగడ రానున్న రోజుల్లో మంథనిలో ఎలాంటి రాజకీయ చిచ్చు రాజేస్తుందో చూడాలి.