ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. టీఆర్ఎస్ నుంచి వరసగా రెండోసారి ఎమ్మెల్యే. 2014లో గెలిచిన తర్వాత పెద్దగా వివాదాలు రాకపోయినా.. 2018లో గెలిచాక మాత్రం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. టీఆర్ఎస్ కేడర్‌తోపాటు.. ప్రజలకు ఎమ్మెల్యే దూరం అయ్యారని టాక్ నడుస్తోంది. సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా భాస్కరరావు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో భాస్కరరావుకు తోడుగా ఆయన కుమారుడు నల్లమోతు సిద్దార్థ ఉండేవారు. దాంతో 2018లో సిద్దార్థే ఎమ్మెల్యే అభ్యర్థి అని అంతా అనుకున్నారు. కానీ అధిష్ఠానం భాస్కరరావుకే మళ్లీ ఛాన్స్ ఇచ్చింది.
ప్రస్తుతం ఎమ్మెల్యే శిబిరంలో ఓ కాంట్రాక్టర్ భాస్కరరావుకు షాడోగా మారినట్టు టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే ఎమ్మెల్యే దగ్గర తన స్థానాన్ని పదిలం చేసుకున్నారట ఆ కాంట్రాక్టర్. టీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఎమ్మెల్యేను కలిసి మాట్లాడాలంటే.. ముందుకు షాడో పర్మిషన్ తీసుకోవాలట. కొంతకాలంగా మిర్యాలగూడలో కాంట్రాక్టు పనులు.. ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆ బినామీ కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది.
మిర్యాలగూడలో ప్రభుత్వ సిబ్బంది బదిలీలు.. పోస్టింగ్‌లు సైతం భాస్కర్‌రావు షాడో చెప్పిన వారికే వస్తున్నాయట. దాంతో ఎమ్మెల్యే ఇంటి కంటే సదరు షాడో ఇంటికే క్యూ కడుతున్నారట. పార్టీ కేడర్.. పనులపై వచ్చేవాళ్లే కాదు.. నియోజకవర్గానికి చెందిన ముఖ్య అధికారుల సైతం షాడో ఇంటికే వెళ్తున్నారట. కాంట్రాక్టులు… అందులో కమీషన్లు.. కొత్త వెంచర్లకు పర్మిషన్లు అన్నింటికీ షాడో అనుమతి ఉండాల్సిందేనని మిర్యాలగూడ కోడై కూస్తోంది. సదరు బినామీ తీరువల్ల నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే భాస్కరరావు దగ్గర చోటు లేకుండా పోయిందట. వివిధ పనుల్లో వారికి రావాల్సిన కమీషన్లు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో తాము పెట్టిన ఖర్చు కూడా రాకపోతే ఎలా అని అంతర్గత సమావేశాల్లో ఆగ్రహావేశాలకు పోతున్నారట కొందరు నేతలు.
ఇన్నాళ్లూ భాస్కరరావు తెలివైన ఎమ్మెల్యేగా కేడర్ గొప్పలు పోయేది. కానీ షాడో వ్యవహారం శ్రుతిమించిన తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారట. ఎమ్మెల్యే కొరివితో తలగోక్కుంటున్నారు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టిన టీఆర్ఎస్ అధిష్ఠానం మిర్యాలగూడలో షాడో ఎమ్మెల్యేను గుర్తించిందో లేదో అనే టాక్ నడుస్తోంది. మరి.. రానున్న రోజుల్లో మిర్యాలగూడ టీఆర్‌ఎస్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.