ఒకరు కాదు…ఇద్దరు కాదు..ఏకంగా నలుగురైదుగురు నాయకులు పాదయాత్రలకు రెడీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశించిన నేతలంతా జనంలోకి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఐతే..పార్టీ అధిష్ఠానం మాత్రం కండీషన్స్ అప్లై అంటోంది. దీంతో పాదయాత్రలు ఎప్పుడు?ఎలా?మొదలుపెట్టాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. ఇంతకీ…హైకమాండ్ షరతులు ఏంటి?
ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో నేతల మధ్య కోల్డ్ వార్
నిజామాబాద్ జిల్లా కమలదళంలో కలహాలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. ఎన్నికలకు సిద్దమవుతున్నతరుణంలో…ఈ వివాదం మరింత ముదురుతోందని టాక్. టికెట్ కోసం నేతల మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ నలిగిపోతుందనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో బీజేపీకి ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో పట్టుంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో బలం పెరిగిందని గట్టి నమ్మకంతో ఉంది బీజేపీ. ఐతే..నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఆర్మూర్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన…వినయ్ రెడ్డి
ఆర్మూర్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన…వినయ్ రెడ్డి…మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన..నియోజకవర్గాన్ని పట్టుకుని క్యాడర్‌ను పెంచుకున్నారట వినయ్ రెడ్డి.. కానీ ఇదే నియోకవర్గంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్, మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్రవంతి రెడ్డి కన్నేశారట. ఎవరికి వారే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆర్మూర్ టికెట్టు తమకు ఇవ్వాలంటూ అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు నేతలు ఎంపీ అర్వింద్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారట. ఆర్మూర్ ఇంచార్జీ వినయ్ రెడ్డి మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎండలను నమ్ముకున్నారు. వినయ్ పాదయాత్రకు రెడీ కాగా…ఆయనకు పోటీగా ఈ నలుగురు పాదయాత్ర చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు.
అందరూ కలిసి నడవాలంటూ మెలిక
ఐతే…పార్టీ పటిష్టతకు ఎవరు పనిచేసినా ఓకే..కానీ అందరూ కలిసి నడవాలంటూ మెలిక పెట్టారు పార్టీ పెద్దలు. టికెట్టు ఆశించే వాళ్లు అందరూ కలిసి పాదయాత్ర చేయాలని సూచించారు. సర్వే ఆధారంగానే టికెట్టు ఓకే అవుతుందని చెప్పేశారట. దీంతో ముందుకు వెళ్లాలో..వెనక్కి తగ్గాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట సదరు నేతలు. ఐతే ఆ నలుగురు మాత్రం..జనవరిలో కలిసి పాదయాత్ర చేసేందుకు మహుర్తం ఖరారు చేసేశారట. వినయ్ రెడ్డి వారితో కలిసి వెళ్లలేనని తెల్చిచెప్పేశారని వినికిడి.
ఆ నలుగురు ఒక గ్రూపు..నియోజకవర్గ ఇంచార్జి మరో గ్రూపు
ఆర్మూర్‌లో ఆ నలుగురు ఒక గ్రూపు..నియోజకవర్గ ఇంచార్జీ మరో గ్రూపుగా పార్టీ చీలిపోయింది. క్యాడర్ ఎవరి వైపు ఉండాలో తెలియక నలిగిపోతున్నారు. వీరితో పాటు పరిస్థితిని బట్టి ఎంపీ అరవింద్ సైతం ఇదే. నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి
ఇక…ఆర్మూర్‌లో ఐదుగురు నేతలు బస్తీమే సవాల్ అంటుంటే…బోధన్‌లో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీలోకి ఇటీవలే వచ్చిన మేడపాటి ప్రకాష్ రెడ్డి, రైస్ మిల్లుల నాయకుడు మోహన్ రెడ్డి టికెట్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పైకి ఇద్దరు కలిసే ఉన్నట్లు కనిపిస్తున్నా..లోపల ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలతో పాటు..బోదన్‌లో జెండా మోసిన నాయకులది మరో వర్గంగా ఉంది. దీంతో మొత్తం మూడు గ్రూపులు అయ్యాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమైన ఇద్దరు నేతలకు..అధిష్టానం షరతులు విధించింది. ఇద్దరూ కలిసి పాదయాత్ర చేయాలని సూచించారని టాక్.
దీంతో మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి ఎలా ముందుకెళ్లాలని తొలుత తర్జనభర్జన పడ్డారు. చివరకు కలిసి పాదయాత్ర చేసేందుకు ఒప్పుకున్నారు. బోధన్‌లో క్యాడర్..లీడర్లు బలంగా లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా ఉన్నట్లు అధిష్ఠానం గుర్తించింది. మరో బలమైన నేత కోసం జల్లెడ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో ఆ నేత …కమలదళంలో చేరితే ఇప్పుడు పోటీలో ఉన్న ఇద్దరికీ..చెక్ పెడతారనే ప్రచారం నడుస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ సైతం పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్ఠానం సైతం టికెట్టు ఆశించే వాళ్లు కలిసి పాదయాత్రలు చేయాలని షరతులు పెడుతుండటం నేతలకు మింగుడు పడటం లేదు.
నియోజకవర్గాల్లో పాదయాత్రలకు..కమళదళం సన్నాహాలు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలకు..కమళదళం సన్నాహాలు చేస్తోంది. క్యాడర్ మాత్రం ప్రస్తుతం నడుస్తున్న పాదయాత్రల చిచ్చు ఆర్పి…అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలని కోరుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఎలా ముందుకెళ్తుందనేదే ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.