రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్సీని చేయడంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. కేబినెట్‌లో చోటు కల్పించడానికే ఆయన్ను మండలికి తీసుకొచ్చారని సమాచారం. బండ ప్రకాశ్‌తోపాటు మరికొందరిని కేబినెట్లోకి తీసుకోవడం..ఇంకొందరిని డ్రాప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కేబినెట్‌లోకి తీసుకొనేందుకే బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ?
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్. తొలి కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేసి ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంను చేశారు. అదే కడియాన్ని రెండోసారి కేబినెట్లోకి తీసుకోకుండా మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు. ఎవరూ ఉహించని విధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్ అదే సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లేకపోతే ఉన్నపళంగా ఆయన్ను రాజ్యసభ నుంచి శాసనమండలికి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ముదిరాజ్ సామాజికవర్గంలో బండ ప్రకాశ్‌కు మంచి పేరుండటంతో ఈ ఊహాగానాలకు బలం పేరుగుతోంది.
కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటే గుత్తాకు ఛాన్స్?
ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ప్రకాశ్‌తోపాటు మరికొందరిని కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు టాక్. గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బెర్త్ సంపాదించారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు నిర్ణయం తీసుకుంటే గుత్తాను పిలుస్తారని చర్చ జరుగుతోంది. గుత్తాను తీసుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఉన్న మరో మంత్రిని డ్రాప్ చేస్తారా లేక.. అదే సామాజివర్గం నుంచి వేరే జిల్లాలో మరొకరిని తీసేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
వెంకట్రామరెడ్డిని మంత్రిని చేస్తే.. కేబినెట్ నుంచి ఒకరికి గేట్‌పాస్..?
కొత్తగా ఎమ్మెల్సీ అయిన మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకుంటారన్న అంచనాలున్నాయి. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటున్న ఆయనకు ఛాన్స్ ఇస్తే కేబినెట్‌లో ఒక బెర్త్ ఖాళీ చేయాలి. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లారెడ్డిని కేబినెట్ నుంచి డ్రాప్ చేయొచ్చన్న ఉహాగానాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను నడిపించలేకపోతున్నారనే విమర్శ ఆయనపై ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి గెలిచి కేబినెట్‌లో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు పట్నం మహేందర్‌రెడ్డి.
మంత్రి పదవిపై పల్లా ఆశలు పెట్టుకున్నారా?
సామాజిక సమీకరణలతో ఆఖరి నిమిషంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇటీవల గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మరోసారి MLCగా గెలిచారు పల్లా. కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటే తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేబినెట్లోకి తీసుకోవాలి అనుకుంటే ఈ మూడు జిల్లాల్లో ఏదో ఒక జిల్లా నుంచి పల్లా ఎంట్రీకి ఛాన్స్ ఉంది. రెండోసారి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న వాళ్లలో ఒకరిద్దరిని డ్రాప్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్లు రెండోసారి కేబినెట్లో ఉన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకుంటే సంచలనాలు తప్పదని పార్టీ వర్గాల టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.