Chandra Babu Meets Mohan Babu : వారిద్దరూ గతంలో మిత్రులు. తర్వాత శత్రువులుగా మారిపోయారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వారిద్దరి భేటీపై.. పార్టీ కేడర్‌కు మంట పుట్టిస్తోందట. జీర్ణించుకోలేకపోతున్నారట. వాళ్ల భేటీకి రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు?
దాదాపు దశాబ్దానికి పైగా టీడీపీ అధినేత చంద్రబాబు.. నటుడు మోహన్ బాబు మధ్య మాటా మంతీ లేదు. గతంలో తెలుగుదేశం కోసం అన్నీ తానై చేసిన మోహన్ బాబు.. చాలా కాలంగా ఆ పార్టీతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబతో విభేదిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో అయితే.. చంద్రబాబును ఓడిస్తానని పంతం పట్టి మరీ వైసీపీ అధినేత జగన్ పంచన చేరారు. అయితే ఇది గతం. కానీ ఇప్పుడు సీన్ మారినట్టు కన్పిస్తోంది. చంద్రబాబుతో మోహన్‌బాబు గంటన్నరకుపైగా సమావేశం కావడం.. టీడీపీ నేతలు.. కేడరుకు నచ్చడం లేదట.
గత ఎన్నికల్లో టీడీపీకి దెబ్బకొట్టిన వాళ్లల్లో మోహన్ బాబు ఒకరనే అభిప్రాయం కేడర్‌లో ఉంది. తన విద్యా సంస్థలకు ఫీజు రీఎంబర్సుమెంట్ విషయంలో 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారట తమ్ముళ్లు. చంద్రబాబు మాట మీద నిలబడరని.. యువతను.. విద్యార్థులను పట్టించుకోరని అప్పటి ప్రతిపక్షం వైసీపీ చేసిన ప్రచారానికి మోహన్ బాబు చేసిన ఆందోళన కూడా అగ్నికి ఆజ్యం తొడైనట్టుగా కలిసిందని ఇప్పటికీ భావిస్తున్నారట. చంద్రబాబు క్రెడిబులిటీని దెబ్బకొట్టే విషయంలో వైసీపీ మోహన్ బాబును వాడుకుంటే.. మోహన్ బాబు వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడ్డారంటున్నారు తమ్ముళ్లు. కారణం ఏదైనా కావచ్చు.. మోహన్ బాబుతో చంద్రబాబు అంత సేపు భేటీ కావడం సబబు కాదనేది పార్టీలో జరుగుతున్న చర్చ.
ఇటీవల మా ఎన్నికల్లో జరిగిన రాజకీయాన్ని గుర్తు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకునే క్రమంలో మోహన్ బాబు-బాలకృష్ణ ఒక్కటయ్యారనే చర్చ అప్పట్లో చాలా జోరుగా నడిచింది. సినిమాలకు.. రాజకీయాలకు సంబంధం లేదని ఎంతగా చెప్పుకున్నా.. ఆ ప్రభావం కచ్చితంగా ఎన్నికల మీద.. మెగా కుటుంబాన్ని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను అభిమానించే సామాజిక వర్గాల మీద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుందనే చర్చ సాగింది. అందుకే చంద్రబాబు.. మోహన్‌బాబు భేటీపై కలవర పడుతున్నారట.
ఎవరితో భేటీ కావాలి.. ఎవరితో భేటీ కాకూడదనే విషయంలో సీఎం జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో అఖండ సినిమా రిలీజ్ సందర్భంలో టిక్కెట్ రేట్ల విషయమై సీఎం జగన్‌తో భేటీ కావాలని బాలయ్య ప్రయత్నించారట. ఈ విషయం వేరేవరో చెప్పడం కాదు. అప్పట్లో సినీ ఇండస్ట్రీతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్న పేర్ని నానినే స్వయంగా ఆ మాట చెప్పారు. కానీ బాలయ్యను కలవడానికి జగన్ ఇష్టపడలేదని.. తాను కలిస్తే బాలయ్యకు ఇబ్బంది ఉంటుందని జగన్ సున్నితంగా తిరస్కరించారని నాని గతంలో చెప్పుకొచ్చారు. అప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్యతో జగన్ భేటీ అయితే కమ్మ సామాజిక వర్గం.. రెడ్డి సామాజిక వర్గం ఒక్కటేననే విషయం మిగిలిన సామాజిక వర్గాల్లోకి వెళ్తుందని అనుకున్నారట. అప్పుడు రాజకీయంగా తాము చెబుతున్న మాటలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓటర్లను అంతగా ప్రభావితం చేయబోవనే ఉద్దేశ్యంతో బాలయ్యతో భేటీకి ఒప్పుకోలేదని కొందరి విశ్లేషణ. ఎవరితోనైనా భేటీ కావాలంటే సీఎం జగన్ అన్ని రకాలుగా బేరీజు వేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కానీ.. చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా.. ఎవరో చెప్పారనో.. లేక మంచి చేసుకుందామనే ఉద్దేశ్యంతోనే మోహన్‌బాబుతో భేటీ కావడం తమకు అంతగా నచ్చడం లేదని అంటున్నారట పార్టీలోని కొందరు నేతలు.