బద్వేల్ ఉపఎన్నికపై బీజేపీ లెక్కలేంటి? అధిష్ఠానం నేరుగా జోక్యం చేసుకున్న ఈ ఉపఎన్నికలో కమలనాథుల అంచనాలు ఎలా ఉన్నాయి? టీడీపీ పోటీలో లేకపోవడంతో.. ఆ పార్టీ ఓటు బ్యాంక్‌పై బీజేపీ పెట్టుకున్న ఆశలేంటి?
2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 735
బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. కేడర్ కూడా అంతంత మాత్రమే…! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 735. నాడు బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి వైసీపీ నుంచి టీడీపీ.. టీడీపీ నుంచి బీజేపీకి జంప్ చేసి బరిలో దిగినా.. వెయ్యి మార్కు దాటలేదు. అలాంటిది ఇప్పుడు జరుగుతున్న ఉపఎన్నికలో అధికారపార్టీ వైసీపీకి తామే ప్రత్యర్థులమని.. గెలుపు తమదేనని భారీ ప్రకటనలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఉపఎన్నికలో రైల్వేకోడూరుకు చెందిన పనతల సురేష్‌ను పోటీకి దింపింది బీజేపీ.
డిపాజిట్‌కు మించి ఓట్లు వస్తే గెలిచినట్టేనట..!
ఉపఎన్నికలో డిపాజిట్‌కు మించి ఓట్లు వస్తే బీజేపీ గెలిచినట్టేనని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. టీడీపీ బరిలో లేకపోవడంతో ఆ ఓట్లు కమలానికే పడతాయని లెక్కలేస్తున్నారు. దీనికితోడు మిత్రపక్షం జనసేన ఓట్లు కలిసివస్తాయని చాలా గట్టి విశ్వాసంతో ఉన్నారు పార్టీ నేతలు. బద్వేలుకు కేంద్ర బలగాలు రావడంతో.. స్వేచ్ఛగా పోలింగ్ జరుగుతుందని.. బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందని.. అదంతా బీజేపీకి అనుకూలిస్తుందని ఇలా.. ఎన్నో ఎన్నోన్నో అంచనాలు వేసుకుంటున్నారు.
టీడీపీ, జనసేన ఓటు బ్యాంకుపై బీజేపీ ఆశలు..!
బద్వేల్ ఉపఎన్నికపై బీజేపీలో మరికొందరి నేతల అంచనా భిన్నంగా ఉంది. టీడీపీ, జనసేన ఓటు బ్యాంకుపై ఆశ పెట్టుకున్నారు. 15 వేల నుంచి 20 వేల ఓట్లు వస్తే బీజేపీ గెలిచినట్లేనని చెబుతున్నారు. టీడీపీ పోటీలో లేని కారణంగా ఆ పార్టీకి బలంగా ఉన్న ఓటర్లు వైసీపీకి ఓటు వేయలేక.. ఇంట్లో కూర్చోలేక బీజేపీకి ఓటు వేస్తారని అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఓట్లు కనీసం 10 వేలు ఉంటాయని వారి అంచనా. ఇక జనసేనకు బలిజ సామాజికవర్గం మద్దతు ఉందని.. ఆ సామాజికవర్గానికి 16 వేలు ఓట్లు ఉన్నాయని.. అందులో 5 వేల ఓట్లు తమకు బదిలీ అవుతాయని ఆశిస్తున్నారు నాయకులు.
లక్ష నుంచి లక్షా 20 వేల మెజారిటీ ఆశిస్తున్న వైసీపీ..!
బద్వేల్లో టీడీపీ ఓట్లకు గాలం వేసిన సందర్భంలో స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేతల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయట. ఎన్నికల్లో బీజేపీవైపు మొగ్గు చూపితే.. రేపటి రోజున రాజకీయంగా ఏదైనా జరిగితే.. తమకు స్థానికంగా బీజేపీ నుంచి అండగా ఉండేవాళ్లు ఎవరని ప్రశ్నించారట. వైసీపీ మాత్రం.. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 50 వేల ఓట్లను తమవైపు మళ్లించుకునేందుకు గట్టి వర్కవుటే చేసిందట. మొత్తంగా బీజేపీకి పదివేల ఓట్లు వస్తాయని.. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధాకు లక్ష నుంచి లక్షా 20 వేల మెజారిటీ ఖాయమని అధికారపార్టీ నేతలు ధీమాగా ఉన్నారట. మరి.. బద్వేల్లో బీజేపీ లెక్కలు ఎంత వరకు నెరవేరాయో నవంబర్ 2 ఫలితాల వరకు ఆగాల్సిందే.