తెలంగాణ బీజేపీలో కలకలం మొదలైందా? రహస్య భేటీలు.. సారథి బండి సంజయ్‌పై తిరుగుబాటు సంచలనంగా మారుతున్నాయా? పరిస్థితి షోకాజ్ నోటీసుల వరకు వెళ్లిందా? బండిపై సీనియర్లు ఎందుకు రుసరుసలాడుతున్నారు? ముఖ్యంగా పార్టీ చీఫ్ సొంత జిల్లాలోనే ఇంటిపోరు ఎక్కువైందా?
సంజయ్ పేరు ఎత్తితేనే అసంతృప్త సీనియర్లు గుర్రు
రహస్య భేటీలు.. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో రచ్చ రంబోలా అవుతోంది. సీనియర్ నేతల సీక్రెట్ మీటింగ్స్ సెగలు.. ఢిల్లీ వరకు తాకాయి. రాష్ట్రంలో కమలం పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్న తరుణంలో.. సిద్ధాంతాలను బాగా వంటబట్టించుకున్న సీనియర్ల రివర్స్‌గేర్ గుబులు రేపుతోందట. ముఖ్యంగా పార్టీ చీఫ్ బండి సంజయ్ సొంత జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చర్చగా మారాయి. సంజయ్ పేరు ఎత్తితేనే ఒంటికాలిపై లేస్తున్నారు అసంతృప్త నేతలు.
రహస్య సమావేశాల కలకలం
బీజేపీలో కొత్త నాయకులు వచ్చాక.. పాతవాళ్లకు పనే లేకుండాపోయింది. గతంలో బీజేపీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారినీ పట్టించుకోవడం లేదట. పార్టీలో సీనియర్ల పరిస్థితి అంతే. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్‌గా వచ్చాక.. తమకు గుర్తింపే లేదన్నది వారి ఆవేదన. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారిని పట్టించుకోకపోవడంతో అసంతృప్తులంతా ఒక చోట చేరినట్టు సమాచారం. వీలు చిక్కినప్పుడల్లా రహస్య సమావేశాలు పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.
పదే పదే సీక్రెట్ మీటింగ్స్‌పై సంజయ్ అలర్ట్
ఇటీవల కరీంనగర్‌లో ఓ చోట సీక్రెట్‌గా కలిశారు పాత బీజేపీ లీడర్స్. వచ్చినవాళ్లంతా సంజయ్ వ్యతిరేకులే. బండి పేరు చెబితే ఒంటికాలిపై లేస్తున్నవాళ్లే. సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లూ తమకు బీజేపీలో గుర్తింపు ఉండదని అనుకున్నారో ఏమో.. అధిష్ఠానం దగ్గరకు వెళ్లడానికి నిర్ణయించారట. ఇప్పటికే కేంద్రంలోని కొందరు పెద్దలను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తోంది. రహస్య భేటీలపై ముందునుంచీ సమాచారం ఉన్నా బండి సంజయ్ అండ్ కో పెద్దగా పట్టించుకోలేదట. కానీ.. అసంతృప్త శిబిరంలో నేతల సంఖ్య పెరగడం.. పదే పదే మీటింగ్‌లు పెట్టుకోవడంతో సంజయ్ అలర్ట్ అయినట్టు చెబుతున్నారు.
అసంతృప్త నేతలకు నోటీసులు ఇచ్చినట్టు ప్రచారం
కరీంనగర్ జిల్లాలో 7 శాతంగా ఉన్న బీజేపీ ఓట్లను 35 శాతానికి తెచ్చామన్నది అసంతృప్త నేతల వాదన. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పాలని అనుకున్నారట. కానీ బీజేపీ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది. రహస్య సమావేశాలు పెట్టుకున్నవారిపై పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నాయకులు పొలసాని సుగుణాకర్ రావు, మహేందర్‌రెడ్డి, అర్జునరావు, గుజ్జుల రామకృష్ణారెడ్డిలకు నోటీసులు పంపినట్టుగా ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని అసంతృప్త నాయకులు ఖండిస్తున్నా.. నిప్పు లేకుండా పొగరాదు కదా అన్నది కొందరి వాదన. అందుకే రానున్న రోజుల్లో రహస్య సమావేశాలు బీజేపీలో ఎలాంటి ప్రకంపనలు తీసుకొస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది. మరి.. ఇంటి పోరును ఎదుర్కొనే విషయంలో బండి సంజయ్ ఏ మార్గాన్ని ఎంచుకుంటారో చూడాలి.