ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ వాలిపోయి మా సత్తా చూపిస్తామంటాయి ఆ రెండు జాతీయ పార్టీలు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తొడగొట్టే ఆ పార్టీలు, లోకల్ పోరులో మాత్రం మాకెందుకులే అన్నట్లు ఉన్నాయి. అసలు అలాంటి పోరు ఒకటి ఉందని కాషాయ పెద్దలు నోరుకు మెదపకపోవడం ఇప్పుడు అ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
కుప్పం…. టిడిపి అదినేత చంద్రబాబు సొంత నియోజక వర్గం…. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది… వరుసగా ఏడుసార్లు గెలిచిన చంద్రబాబుకు, అక్కడి పసుపు దళానికి అత్యంత కీలకమైన ఎన్నికగా కుప్పం మున్సిపల్ పోరు మారింది. వరుసగా పంచాయతీ, జడ్పిటిసీ, ఎంపిటిసి ఎన్నికల ఓటమి తరువాత జరుగుతున్న ఎన్నికలు కావటంతో కంచుకోటను కాపాడుకోవడానికి బాబు కోటరీ తీవ్రంగా పనిచేస్తుంది. ఇక అధికార వైసీపీ సైతం కుప్పంలో గెలిచి….బాబుకు చెక్ పెట్టాలని ఆరాటపడుతోంది. అయితే ఈ రెండు పార్టీలు నువ్వా-నేనా అన్నట్టుగా ఉంటే…. ఎక్కడ ఎన్నికలుంటే, అక్కడ మాదే విజయం అంటూ బరిలో దిగే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రం మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని టాక్ వినపడుతోంది.
చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగే కీలక ఎన్నికల్లో ఏపిలో పాగా వేయాలని పరితపిస్తున్న కాషాయం పార్టీ నేతలు, ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చంద్రబాబు, పెద్దిరెడ్డి, అమరనాధరెడ్డి లాంటి నేతలు మాటలు తూటాలు పేలుస్తూ సై అంటే సై అంటుంటే … బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా ఇతర కీలక నేతలు కుప్పం పోరులో నోరుకూడా మెదపకుండా ఉన్నారని ఆ పార్టీ నేతల్లోనే చర్చలు నడుస్తోందట.
25 వార్డులుండే కుప్పం మున్సిపాలిటీలో బిజెపి ఐదు చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల అభ్యర్థులను నిలబెట్టి చేతులు దులుపుకున్నాయి. అసలు అక్కడ కనీసం అభ్యర్థులు ఉన్నారా లేదా అనేదానిపై, కాషాయ పెద్దలు చిత్తూరు నేతలతో మాట్లాడలేదట. మరోవైపు టిడిపి, వైసీపీలోని కీలక నేతలందరూ కుప్పంలో వాలిపోతే.., కాంగ్రెస్, బిజెపి నేతలు మాత్రం కనీసం మాట్లాడటం కూడా లేదట. బిజెపి కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెసు పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టింది కాని…కాషాయం మాత్రం కామ్ గానే ఉందట. మొన్నటి బద్వేల్ ఉప ఎన్నికలలో బరిలో అభ్యర్థిని నిలపకపోయినా ఫర్వాలేదు అనేచోట మాత్రం నానా రచ్చ చేసి డిపాజిట్ కోల్పోయిన బిజెపి, అత్యంత కీలకంగా మారిన కుప్పం మున్సిపల్ పోరులో మాత్రం సైడ్ అవ్వడానికి కారణం ఏంటన్న చర్చజిల్లాలో మొదలైంది.
బిజెపికి పోటీ చేయటానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందా, లేక కావాలనే దూరంగా ఉందామని అనుకున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ జోరుగా సాగుతోంది. పార్టీ అగ్రనేతలు పట్టించుకోకున్నా, పాపం పార్టీపైన అభిమానం చావని కొంతమంది తూతూ మంత్రంగా ఐదుగురు అభ్యర్థులతో నామినేషన్లు వేశారే తప్ప ప్రచారం కూడా లేదని టాక్. చంద్రబాబు మూడురోజులు పర్యటించి, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడే తిష్టవేసుకుని కూర్చుంచే …జాతీయ పార్టీల మౌనం మాత్రం ఎవరికి అంతుపట్టకుండా ఉందటా…