హోరాహోరీగా సాగిన పోరులో.. ఓ పార్టీ అధినేతను ఓడించడంతో కేబినెట్‌లో బెర్త్ ఖాయమని అనుకున్నారు ఆ ఎమ్మెల్యే. కానీ.. సమీకరణాలు.. లెక్కలు అడ్డొచ్చాయి. ఇప్పుడు కేబినెట్ రెండున్నరేళ్ల ప్రక్షాళన దగ్గర పడటంతో ఈసారి పిలుపు ఖాయమని అనుకుంటున్నారట. ఎమ్మెల్యే అనుచరులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ ఆశల పల్లకిలో ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు?
అప్పుడే మంత్రి పదవి వస్తుందని లెక్కలేసుకున్నారు!
2019 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోరు హైలెట్. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. భీమవరంలో జనసేనాని గెలుపు ఖాయమని ఆ పార్టీవర్గాలు భావించాయి. కానీ.. గాజువాక, భీమవరం రెండుచోట్లా ఓడిపోయారు పవన్ కల్యాణ్. ఆ సమయంలో భీమవరంలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టాక్ ఆఫ్ ది టౌన్. పవన్ కల్యాణ్, గ్రంధి శ్రీనివాస్ ఇద్దరూ ఒకే సామాజికవర్గం. అయినప్పటకీ జనసేనానిని ఓడించడంతో పదోన్నతిపై ఆశలు పెట్టుకున్నారు గ్రంధి. కేబినెట్‌లో చోటు కల్పిస్తారని ఆయన అనుచరులు భావించారు. కానీ.. సామాజిక సమీకరణాలు అడ్డొచ్చాయి. ఇప్పుడు మళ్లీ గ్రంధి శిబిరంలో మంత్రి పదవిపై ఆశలు చిగురిస్తున్నాయట.
పవన్ కల్యాణ్‌పై గెలుపును ఈసారి గుర్తిస్తారా?
రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని నాడు సీఎం జగన్ చేసిన ప్రకటనపై చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆశ పెట్టుకున్నారు. వారిలో గ్రంధి కూడా ఒకరు. నాడు గెలిచింది పవన్ కల్యాణ్‌పై కాబట్టి ఈసారి తప్పకుండా గుర్తిస్తారని అనుకుంటున్నారట. కేబినెట్ ప్రక్షాళన సమయం దగ్గర పడేకొద్దీ ఎమ్మెల్యే శిబిరంలో చర్చ జోరందుకుంటుంది. అయితే మంత్రి పదవి పొందాలంటే పవన్ కల్యాణ్‌పై గెలుపు ఒక్కటే సరిపోకపోవచ్చని భావించారో ఏమో.. భీమవరంలో అభివృద్ధి పనులను వేగంగా పట్టాలెక్కిస్తున్నారు ఎమ్మెల్యే. అవకాశం చిక్కితే వైరిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు గ్రంధి.
భీమవరంలో జనసేన, టీడీపీలకు ఎమ్మెల్యే గ్రంధి చెక్!
కాంగ్రెస్ హయాంలో 2004లోనూ గ్రంధి శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు రెండోసారి గెలిచారు. అప్పుడు చేసిన పొరపాట్లను రిపీట్ చేయకుండా రాజకీయంగా పావులు కదుపుతున్నారట గ్రంధి. భీమవరంలో జనసేన, టీడీపీలకు ఎప్పటికప్పుడు పొలిటికల్‌గా చెక్ పెడుతున్నారు. పార్టీ పెద్దలు భీమవరం వచ్చినా.. తాడేపల్లిలో వైసీపీ పెద్దలను కలిసే సందర్భంలోనూ మనసులో మాటను ఎమ్మెల్యే బయటపెడుతున్నట్టు సమాచారం. పనిలో పనిగా ప్రొగ్రస్ రిపోర్ట్‌నూ అందజేస్తున్నారట. ఇదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు కూడా ఈసారి గ్రంధిని మంత్రిని చేయాల్సిందేనని స్వరం పెంచుతున్నారు. మరి.. ఎమ్మెల్యే ప్రయత్నాలు.. అనుచరుల ఆశలు గ్రంధి శ్రీనివాస్‌కు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.