తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ నేతలు.. ఆ వేడిలో చేస్తున్న ప్రకటనలు రచ్చ రచ్చ అవుతున్నాయి. కాషాయ శిబిరంలో గుబులు రేపుతున్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతోంది. పాదయాత్రలో భాగంగా సభలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు నాయకులు. ఈ క్రమంలోనే మక్తల్‌లో సభ నిర్వహించారు. ఆ సభ.. సభలో చేసిన ప్రకటనలు ప్రస్తుతం బీజేపీలో చర్చగా మారాయి. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూనే ప్రస్తుతం ఫోకస్ నెలకొంది.
ప్రస్తుతం కేసీఆర్ కూర్చున్న సీటులో బండి సంజయ్ కూర్చుంటేనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు జితేందర్‌రెడ్డి. ముఖ్యమంత్రి పీఠంపై సంజయ్ కూర్చోవాలని అర్ధం వచ్చేలా ఆ కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ. పైగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయే సీఎం అని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా కాషాయ శిబిరం ఉలిక్కి పడింది.
పార్టీలో ఒక హోదాలో ఉన్న నాయకుడు అలా ఎలా కామెంట్స్ చేస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జితేందర్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. దాంతో ఆయన మాటలను తేలికగా తీసుకోవడానికి లేదని.. ఏదో డిసైడ్ అయ్యే ఆ కామెంట్స్ చేశారని కొందరు పార్టీ నేతలు భావిస్తున్నారట. అయితే బీజేపీలో శాసనసభా పక్ష నేతలను ఎలా ఎన్నుకుంటారో జితేందర్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించేవాళ్లూ పార్టీలో ఉన్నారు. బీజేపీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఎలా కామెంట్స్ చేస్తారు అని చర్చకు పెడుతున్నారట.
ఇదే సమయంలో బీజేపీలో మరో చర్చ జరుగుతోంది. పార్టీలో గ్రూపులు ఉన్నాయనేదానిపై జితేందర్‌రెడ్డి ప్రకటనతో స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. అందులో ఒక వర్గం బండి సంజయ్‌ను ప్రమోట్ చేస్తోందని అనుమానిస్తున్నారట. ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. తాను సీఎం అభ్యర్థిని కాదని సంజయ్ చెబుతుంటే.. కాదు.. సంజయ్యే బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేట్టు జితేందర్‌రెడ్డి మాట్లాడటం ఆసక్తిగా మారింది. బీజేపీలో కొందరికి చెక్ పెట్టేందుకే మాజీ ఎంపీ ఆ కామెంట్స్ చేశారని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారట. పైగా జితేందర్‌రెడ్డి ఎవరో అనమంటే అనే వ్యక్తి కాదని.. బలమైన వ్యూహంతోనే మక్తల్ సభలో బరువైన వ్యాఖ్యలు చేశారని సందేహిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే. అధికారంలోకి రావాలంటే చాలా రెట్లు పుంజుకోవాలి. బలమైన అధికార టీఆర్‌ఎస్‌ను మరింత బలంగా ఢీకొట్టాలి. ఇవన్నీ వదిలేసి.. పార్టీ నేతలు నేల విడిచి సాము చేయడం.. తమ శక్తికి మించి ప్రకటనలు గుప్పించడం కమలనాథులకే చెల్లింది. కాకపోతే పార్టీలో నెలకొన్న వర్గపోరు బీజేపీ అంతర్గత రాజకీయాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.