ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా చెలామణి అయిన అవంతి శ్రీనివాస్‌కు పదవీ వియోగం ఏ మాత్రం మింగుడు పడ్డం లేదు. గ్రూప్ రాజకీయాలు, అవినీతి అంటే తనకు తెలియదని.. పార్టీకి విధేయుడిగా ఉన్నా పక్కనబెట్టారని ఆవేదన చెందుతున్నారట. మంత్రి హోదా కోల్పోయిన తర్వాత భీమిలి నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తుందనే ఆలోచన కంటే.. అన్ని విధాలుగా జూనియరైన గుడివాడ అమర్నాథ్‌కు అవకాశం లభించడం మాజీమంత్రి జీర్ణించుకోలేకపోతున్నట్టు పార్టీ వర్గాల భోగట్టా. ఈ అసంతృప్తిని కొత్త మంత్రికి తెలియజేసేందుకు అవంతి ప్రయత్నిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా నగరానికి వచ్చిన అమర్‌కు ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు అంతా వచ్చి స్వాగతం పలికారు. అయితే ఈ స్వాగత కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు.. కార్పొరేటర్లు ముఖం చాటేశారనే ప్రచారం జరుగుతోంది. మూడు రోజులుగా జిల్లాలోనే మంత్రి తిరుగుతున్నా భీమిలి నేతలు బహిరంగంగా ఎవరు కలవకపోవడం వెనక కారణాలను ఆరా తీసిందట అమర్ వర్గం. అవంతి మనసు బాగా తెలిసిన పార్టీ నేతలు కొత్త మంత్రిని కలిసేందుకు జంకుతున్నారట. అందుకే ఫ్లెక్సీలు పెట్టలేదని.. వెల్కమ్ చెప్పడానికి సాహసించలేదని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ అంశం చుట్టూనే విశాఖలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మంత్రి పదవులు రాకముందు నుంచే అవంతి, అమర్నాథ్ బాబాయ్-అబ్బాయ్‌లా…కలిసి ఉన్నట్టే పైకి కనిపించినా ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ ఒక రేంజ్‌లో సాగేది. విశాఖలో కాపు సామాజికవర్గంలో తానే బలమైన నేతగా ముద్ర వేసుకోవలనే అవంతి ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అమర్నాథ్ చెక్ పెట్టేవారు. అందుకే అవంతికి పదవి తీసేసి అమర్‌ని మినిస్టర్‌ని చేయడం జీర్ణించుకోలేకపోతోంది మాజీ మంత్రి వర్గం. అమర్‌ది అనకాపల్లి జిల్లా కాబట్టి అక్కడికే పరిమితం కావాలని.. విశాఖ జిల్లాతో ఆయనకు సంబంధం ఉండదనే కొత్త ప్రచారం తెరపైకి తీసుకుని రావడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
తాను మంత్రిగా ఉన్నప్పుడు ఏ నియోజకవర్గంలోనూ అంతర్గత వ్యవహారాల జోలికి వెళ్లలేదని.. కొత్త మంత్రి కూడా ఆ సంప్రదాయం పాటిస్తే అందరికీ మంచిదని భావిస్తున్నారట అవంతి. మొదట్లోనే తన వైఖరిని బయటపెట్టడం ద్వారా భవిష్యత్‌లో చికాకులు, సమస్యలు రాకుండా అమర్నాథ్‌కు బంధంవేసే ప్రయత్నాల్లో మాజీ మంత్రి ఉన్నట్టు సమాచారం. ఇక అమర్‌వర్గం వాదన మరోలా ఉంది. జిల్లాలోని మిగిలిన పొలిటీషియన్స్‌తో పోలిస్తే అవంతి, అమర్నాథ్ అనుబంధం డిఫరెంట్.
ఇంజనీరింగ్ పట్టభద్రుడైన మంత్రి అమర్నాథ్ చదువుకున్నది అవంతి విద్యాసంస్థలోనే. ఒక విధంగా గురుశిష్యులగా మారిన వీరిద్దరూ తొలిసారి 2014లో రాజకీయ ప్రత్యర్థులు. అనకాపల్లి పార్లమెంట్ బరిలో టీడీపీ నుంచి అవంతి, వైసీపీ నుంచి అమర్ నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో అవంతి విజయం సాధించగా.. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మొదలైందని చెబుతారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అవంతి.. వైసీపీలో కాపు నేతలు బలపడితే తన నాయకత్వానికి సవాలుగా మారుతుందనే ఆలోచనతో ఉండేవారట. ఆ కారణంతోనే మంత్రిగా ఉన్న సమయంలో అవంతితో అమర్నాథ్ ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉండేవారనేది సన్నిహితుల వాదన.
మంత్రి పదవి వచ్చాక అమర్ స్వయంగా ఫోన్‌చేసి అవంతికి చెప్పారని.. అయినా ముభావంగా మాట్లాడి పెట్టేసారని టాక్. ఆఖరి నిమిషం వరకు పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు సైతం పెద్ద మనసుతో అమర్‌ను స్వాగతించినప్పుడు.. అవంతి మాత్రం అందుకు భిన్నంగా వెళ్లడంపట్ల మంత్రి అనుకూల వర్గం గుర్రుగా ఉందట. మరి.. రానున్న రోజుల్లో వీరి మధ్య ఆధిపత్యపోరు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.