బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియామకమై రెండేళ్లు అవుతుంది. రాష్ట్ర కమిటీ ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం పూర్తయింది. అయినప్పటికీ బీజేపీలో వివిధ స్థాయిలో పార్టీ పోస్ట్‌లు ఖాళీగానే ఉన్నాయి. వివిధ కారణాలతో వాటి భర్తీని ఆపేశారు. ఎప్పటి నుంచో పదవులు కట్టబెట్టాలని నేతలు డిమాండ్ చేస్తున్నా.. సీనియర్లు సూచిస్తున్నా.. ఖాళీగా ఎందుకు ఉంచుతున్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆ పదవుల్లో కీలకమైన అసెంబ్లీ కన్వీనర్ పోస్టులు కూడా ఉన్నాయి.
..spot..
gfx
కన్వీనర్ పోస్టులపై ఉలుకు.. పలుకు లేదు
రెండేళ్లుగా అసెంబ్లీ కన్వీనర్ పోస్టుల ఊసే లేదు బీజేపీలో. పార్టీ జాతీయ నాయకత్వం కూడా బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు సంస్థాగత పోస్టులు ఏవీ ఖాళీగా ఉంచొద్దని స్పష్టం చేసింది. ఆ ఆదేశాలు ఇచ్చిన కొత్తలో అసెంబ్లీ కన్వీనర్ పోస్టుల భర్తీకి కొంత కదలిక వచ్చినా.. తర్వాత కాషాయ శిబిరంలో చప్పుడు లేదు. జిల్లా కోర్ కమిటీలను కన్వీనర్ పోస్టులకు అర్హులైన వారి పేర్లు పంపించాలని అడిగి ఆ తర్వాత చాప చుట్టేశారు. పేర్లు వచ్చినా.. మూలన పడేశారు. ఆ వేడిలోనే అసెంబ్లీ కన్వీనర్ల ప్రకటన ఉంటుందని చాలా మంది బీజేపీ నేతలు ఆశించారు. బీజేపీ ఆవిర్బావ దినోత్సవానికే అంతా కొలిక్కి వస్తుందని అనుకున్నా.. ఉలుకు లేదు. బీజేపీ ఆవిర్భావ దినోత్సం కూడా వెళ్లిపోయింది. ఇప్పుడు దానిపై ఎవరూ మాట్లాడటం లేదు.
అసెంబ్లీ కన్వీనర్ పోస్టుల భర్తీని ఎందుకు పెండింగ్‌లో పెట్టారన్నది పెద్ద చర్చ. ఆ పోస్ట్‌లపై ఆశలు పెట్టుకున్నవారు తమ స్థాయిలో ఆరా తీస్తున్నారట. అదేమీ ఎమ్మెల్యే టికెట్ కాదు. ఒకవేళ జిల్లాల నుంచి వచ్చిన పేర్లలో ఎక్కడైనా తేడా కొట్టిందా అనేదీ బయట పెట్టడం లేదు. ఇటు చూస్తే తెలంగాణలో రాజకీయ వేడి చురుకు పుట్టిస్తోంది. నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పనిచేయడానికి.. కార్యకర్తలను సమన్వయం చేసుకోవడానికి కన్వీనర్ పోస్టు కీలకం. కానీ.. అవేమీ పట్టనట్టు ఉంటోంది పార్టీ రాష్ట్ర నాయకత్వం.
అయితే కన్వీనర్ పోస్టుల విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కొన్ని అనుమానాలు… భయాలు ఉన్నాయట. ఎవరినైనా కన్వీనర్లుగా ప్రకటిస్తే.. వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులం అని ప్రచారం చేసుకుంటారని ఆందోళన చెందుతున్నారట. ఒకవేళ కన్వీనర్ పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నచోట.. ఒకరికి ఆ పదవి ఇస్తే మిగతా వాళ్లు అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉందని లెక్కలేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న వాతావరణం దెబ్బతింటే.. మొదటికే మోసం వస్తుందని పార్టీ వర్గాల అనుమానం. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర పూర్తయ్యాక అసెంబ్లీ కన్వీనర్ల నియామకంపై దృష్టి పెట్టొచ్చని చర్చ జరుగుతోంది. పోనీ అదైనా చెప్పొచ్చగా అనేది కొందరి వాదన. ఏం చెప్పకుండా.. ఆశవహులను మబ్బుల్లో ఉంచితే ఎలా అనే ప్రశ్నలు బీజేపీలో వినిపిస్తున్నాయి. ఇదే కాదు.. బీజేపీలో వివిధ అనుబంధ విభాగాలకు కన్వీనర్లు, స్టేట్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ మెంబర్లు, పార్లమెంట్ కన్వీనర్లను నియమించాల్సి ఉంది. అన్నింటినీ అటకెక్కించేశారు. మరి.. వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారో.. కమలనాథులకు ఎప్పుడు తీపి కబురు చెబుతారో చూడాలి.