కొట్టు సత్యనారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం. దేవాదాయశాఖ మంత్రి. గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా చర్చల్లో నలిగింది ఈ శాఖే. కొట్టుకు ఆ విషయం తెలియంది కాదు. కానీ.. మంత్రిగారు ఎటుపడితే అటు నాలిక మడత పెట్టేస్తున్నారని సొంత శాఖలోనే సణుగుడు ఎక్కువైంది. దీంతో దేవాదాయశాఖ వర్గాలు.. ప్రభుత్వ పెద్దల్లో చర్చగా మారిపోయారట కొట్టు సత్యనారాయణ.
ఇటీవల మంత్రి కొట్టు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశించింది. చాలామంది అర్చకులు కోరుకుంటున్నది అదే. ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేయాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా మంత్రి కొట్టు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే ప్రధాన ఆలయాల్లో కూడా బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మరో కీలక వ్యాఖ్య చేశారు. కొన్ని గుళ్లకు చెందిన ఈనాం భూములు పూజారుల చేతుల్లో ఉన్నాయనే అర్థం వచ్చేలా మాట్లాడం కూడా అర్చకులతోపాటు బ్రాహ్మణ సామాజికవర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. ఆ ఫీడ్ బ్యాక్ ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లిందట.
ఈ క్రమంలో సీఎం సూచనల మేరకు ప్రభుత్వ పెద్దలు మంత్రి కొట్టు సత్యనారాయణను పిలిపించి.. ఓ చిన్న సైజ్ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. సున్నితమైన అంశాల్లో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు చుట్టుకుంటాయన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారట. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాయని.. అందులోనూ మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న అంశాన్ని గమనించాలి కదా అని అక్షింతలు వేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపై సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు అన్నికోణాల్లో ఆలోచించాకే.. మీడియా ముందుకు వెళ్లాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మరో చర్చా జరుగుతోంది. కొత్తగా వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ ఇప్పుడిప్పుడే తమశాఖపై పట్టు సాధించే దిశగా పని చేస్తుంటే.. కొంతమంది దేవదాయశాఖ ఉన్నతాధికారులు.. ఆయనకు రాంగ్ ఇన్‌పుట్స్ ఇస్తూ.. మిస్ లీడ్ చేస్తున్నారట. అధికారులు రాజకీయకోణంలో ఆలోచించకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. మంత్రికి అదే విషయాన్ని బ్రీఫ్ చేస్తుండడంతో.. కొట్టు కూడా రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నారనే చర్చ జరుగుతోందట. ఏది ఏమైనా.. అన్ని రకాలుగా ఆలోచించుకుని మాట్లాడాల్సిన బాధ్యత మంత్రిదే. ఒకమాట ఎక్కువైనా.. తక్కువైనా ఇబ్బందులు తప్పవు. మరి.. సీఎంవో హితోక్తులు అమాత్యుల వారికి వంట బట్టాయో లేదో చూడాలి.