ఏదో వచ్చారు… వెళ్లారు అని కాకుండా.. ఏపీ పర్యటనలో ఓ కేంద్రమంత్రి చేసిన కామెంట్స్.. బీజేపీకి టెన్షన్ తెచ్చిపెట్టాయి. రాబోయే కష్టాలు తలుచుకుని కలవర పడుతున్నారట. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరు? ఆయన చెప్పిందేంటి? కమలనాథులకు రుచించని ఆ మాటలేంటి?
వైసీపీని ఎన్డీయేలో చేరాలన్న అథవాలే..!
రాందాస్ అథవాలే. కేంద్రమంత్రి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో భాగస్వామి. మాటలతో.. వ్యంగ్యాస్త్రాలతో.. ప్రాసలతో వైరిపక్షాలకు కూడా నవ్వులు పూయిస్తుంటారు అథవాలే. ఇటీవల విశాఖపట్నం వచ్చిన ఆయన.. కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఎన్డీయేలో చేరాలని ఆహ్వానించారు అథవాలే. ఆ ప్రకటనపై జనాల్లో ఎంత చర్చ జరిగిందో ఏమో కానీ.. ఏపీ బీజేపీ నేతలను మాత్రం ఉలిక్కి పడేలా చేసిందట. ఇప్పటికే వైసీపీ సర్కార్‌పై వివిధ రూపాల్లో బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రమంత్రి చేసిన కామెంట్స్‌తో తలబాదుకుంటున్నారట.
అథవాలే ప్రకటనతో ఇరకాటంలో ఏపీ బీజేపీ నేతలు..!
ఏ చిన్న అవకాశం దొరికినా.. వైసీపీ సర్కార్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది బీజేపీ.
ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతిపైసా కేంద్రం ఇచ్చిందేనని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తోంది.
ఇంకోవైపు పవన్ కల్యాణ్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. జనసేనాని తోడుంటే వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించొచ్చనేది బీజేపీ వ్యూహం. పనిలో పనిగా జనాల్లోకి వెళ్లేందుకు.. ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకు సమస్యలపై పోరుబాట పట్టారు కమలనాథులు. ఈ పరిస్థితుల్లో కేంద్రమంత్రి చేసిన ప్రకటన బీజేపీ నేతలను ఇరకాటంలో పడేసింది.
తాము ఏమైపోవాలని కమలనాథుల లబోదిబో..!
ఓ పక్క తాము కిందా మీద పడి జగన్ సర్కారుతో.. అధికారపార్టీ విధానాలపై పోరాడుతోంటే.. తగుదునమ్మా అంటూ ఎన్డీఏలోకి రా రమ్మంటూ వైసీపీకి ఆఫర్లు ఇస్తే ఎలా అని లోలోపల కుతకుతలాడుతున్నారట. పైకి చెబుదామంటే కేంద్రమంత్రి అయిపోయారు. పైగా తమ పార్టీ వ్యక్తి కాదు. దీంతో ఏం చేయాలో తెలియక చేతులు పిసుక్కుంటూ కూర్చొంటున్నారట ఏపీ లోటస్ లీడర్స్. బద్వేల్ ఉపఎన్నికలో పోటీ వైసీపీకి.. తమకేనని గట్టిగా ప్రచారం చేస్తూ.. నాలుగు ఓట్లైనా దక్కించుకుని.. డిపాజిట్ కాపాడుకోవడానికి తంటాలు పడుతోంటే.. అథవాలే ఏపీకి వచ్చి.. అలా ప్రకటనలు చేస్తే.. తామేం అయిపోవాలి..? తమ వ్యూహాలు ఏమైపోవాలి అంటున్నారట.
కేంద్రమంత్రులను కట్టడి చేయాలని కోరతారట..!
ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. ఇటీవలకాలంలో బీజేపీకి.. జనసేనకు మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో అథవాలే వంటి కేంద్రమంత్రులు వచ్చి ఏదిపడితే అది మాట్లాడి వెళ్తే నష్టం ఎవరికి అని ప్రశ్నిస్తున్నారట. ఈ అంశాన్ని బీజేపీ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ కమలనాథులు భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు ఎవరైనా ఇక్కడి రాజకీయాల గురించి వీలైనంత తక్కువగా మాట్లాడేలా ఆదేశాలు ఇవ్వాలని కోరతారట. మరి.. ఏపీ బీజేపీ నేతల అభ్యంతరాలను ఢిల్లీ పెద్దలు పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి.