అధికార పార్టీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమస్య తీరలేదా? ఆయనపై నిజంగానే కుట్ర జరుగుతోందా? శత్రువులు పెరుగుతున్నారా.. ఆయనే శత్రువులను పెంచుకుంటున్నారా? తాజా వ్యాఖ్యల వెనక కథేంటి? లెట్స్ వాచ్..!
మాజీ మంత్రి అనిల్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు? ఆయన పార్టీలోనే ఆయన్ని టార్గెట్ చేస్తోంది ఎవరు? అనిల్ అనుమానం ఎవరిపై ఉంది? టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్న వైసీపీ నేతలు ఎవరు? అనిల్ కామెంట్స్ తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలివే.
మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యల తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు మరోసారి బయటపడింది. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు కొందరు వైసీపీ నేతలే టీడీపీ నాయకులకు డబ్బులు ఇచ్చి విమర్శలు చేయిస్తున్నానేది అనిల్ ఆరోపణ. అయితే ఈ పరిస్థితి రావడానికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అనుసరించిన వైఖరి కూడా కొంత కారణమన్నది కొందరి వాదన. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్‌కు కేబినెట్‌లో చోటు దక్కింది. మూడేళ్లు మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో అంతంత మాత్రమే సంబంధాలు కొనసాగించారు.
కీలకమైన జలవనరుల శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన నిర్వహించిన మొదటి సమీక్షా సమావేశం నుంచి మినిస్టర్ పదవి కోల్పోయే వరకు జరిగిన మీటింగ్స్‌లో పరోక్షంగా అనిల్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై అప్పట్లో వైసీపీ పెద్దలకు అనిల్ ఫిర్యాదు చేయడంతో సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు వచ్చి అందరు కలిసి పనిచేయాలని సూచించారు. కానీ.. పార్టీ నేతలు పాత పద్ధతిలోనే వెళ్లారు. సర్వేపల్లి, కావలి, ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు మంత్రిగా అనిల్‌కు ఆహ్వానాలు ఉండేవి కాదు. తన శాఖ పరిధిలో జరిగిన కార్యక్రమాలకు పిలచేవారు కాదు. వాటిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేవారే తప్ప ఓపెన్‌గా ఎలాంటి కామెంట్స్ చేయలేదు అనిల్. అప్పట్లో ఎవరినీ పట్టించుకోలేదు.. ఇప్పుడు అందరూ తనపైనే దాడి చేస్తున్నారని చెబుతున్నారు.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి వర్గంలో చోటు కోల్పోయారు అనిల్. ఆయన స్థానంలో కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఛాన్స్ దక్కింది. అప్పటి వరకు అంతర్గతంగా ఉన్న గొడవలు మంత్రివర్గంలో మార్పుల తర్వాత బహిర్గతం అయ్యాయి. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఏ విధంగా సహకరించారో.. తాను రెట్టింపు సహకారం అందిస్తానని అనిల్ చెప్పడంతో కలకలం రేగింది. దీంతో అనిల్, కాకాణి ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకోకుండా .. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించకుండా సీఎం సర్ది చెప్పడంతో సంయమనం పాటించారు. ఇప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. దూరం పెరిగిందే తప్ప తగ్గలేదు. తాజాగా అనిల్ వ్యాఖ్యలతో అది మరోసారి రూఢీ అయ్యింది.
మొన్నటి వరకు అనిల్‌ను అనుసరించిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రి కాకాణి వైపు వెళ్లారు. పార్టీ నేతలు కూడా అదే బాట పట్టారు. నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ద్వారకానాథ్, అనిల్ సొంత బాబాయి రూప్ కుమార్ యాదవ్ సైతం మాజీ మంత్రికి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు కేవలం తనను టార్గెట్ చేసుకుని ప్రెస్‌మీట్లు పెడుతున్నారని.. అలా చేసినందుకు వారికి వైసీపీ నేతల నుంచి డబ్బులు అందుతున్నాయని అనిల్ ఆరోపించారు. టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్న వైసీపీ నాయకుల చిట్ట తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. సమస్య తీవ్రతపై వైసీపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టిందట. వైసీపీకి బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఇదే విధంగా కొనసాగితే ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోందట. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై నిఘా వర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. త్వరలోనే జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నారు. మరి.. నెల్లూరు సమస్యకు హైకమాండ్ మంత్రం వేస్తుందో.. అనిల్ కుమార్ యాదవ్‌ను బుజ్జగిస్తుందో చూడాలి.